ప్రమాదకరమైన డెంగ్యూ నుంచి రక్షణ ఇలా….!!

వాతావరణంలో చోటుచేసుకునే మార్పుల వల్ల ఆరోగ్యసమస్యలు రావడం సహజం. వేసవికాలం కావచ్చు, చలికాలం కావచ్చు, వర్షాకాలం కావచ్చు వాటి ప్రభావాన్ని మనుషులమీద చూపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం అన్ని ప్రాంతాలలో వర్షాల సందడి కొనసాగుతోంది. డెంగ్యూ, చికెన్ గున్యా, వైరల్ ఇన్ఫెక్షన్ వంటి జ్వరాలు వ్యాపించడానికి ఈ వర్షాకాలం చాలా అనువుగా ఉంటుంది. ఈడీస్ ఈజిప్టి అనే ఆడదోమ కాటు ద్వారా సంక్రమించే డెంగీ జ్వరం చాలా ప్రాణాంతకమైనది. దీనికి ఎలాంటి నిర్దిష్ట చికిత్స లేకపోవడం చాలా గందరగోళపెట్టే […]

Advertisement
Update: 2022-07-06 06:32 GMT

వాతావరణంలో చోటుచేసుకునే మార్పుల వల్ల ఆరోగ్యసమస్యలు రావడం సహజం. వేసవికాలం కావచ్చు, చలికాలం కావచ్చు, వర్షాకాలం కావచ్చు వాటి ప్రభావాన్ని మనుషులమీద చూపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం అన్ని ప్రాంతాలలో వర్షాల సందడి కొనసాగుతోంది. డెంగ్యూ, చికెన్ గున్యా, వైరల్ ఇన్ఫెక్షన్ వంటి జ్వరాలు వ్యాపించడానికి ఈ వర్షాకాలం చాలా అనువుగా ఉంటుంది. ఈడీస్ ఈజిప్టి అనే ఆడదోమ కాటు ద్వారా సంక్రమించే డెంగీ జ్వరం చాలా ప్రాణాంతకమైనది. దీనికి ఎలాంటి నిర్దిష్ట చికిత్స లేకపోవడం చాలా గందరగోళపెట్టే విషయం. కేవలం వైద్యుల పర్యవేక్షణలో గడపడం తప్ప వేరే గత్యంతరం లేదు. అలాంటి ప్రమాదకరమైన డెంగ్యూ జ్వరం రాకుండా ఉండటానికి వైద్యులు సూచించిన కొన్ని జాగ్రత్తలు ఇవి.

సాధారణంగా దోమలు నేరుగా చర్మం మీద కాటు వేసినప్పుడు వ్యాధిని సంక్రమింపచేసే అవకాశం ఉంటుంది. మన శరీరంలో భహిర్గతమయ్యే చర్మప్రాంతాలు ఏవైనా ఉన్నాయంటే అవి చేతులు, ముఖం, పాదాలు మాత్రమే. ధరించే దుస్తులు చేతులను కప్పి ఉంచేలా ఉంటే చాలావరకు ఈ దోమకాటు నుండి తప్పించుకోవచ్చు.

◆ ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు దోమలు కుట్టినా ప్రమాదం జరగకుండా ఉండేందుకు లోషన్ వంటివి ఉపయోగించాలి.

◆ సూర్యరశ్మి లేని సమయాల్లో దోమలు ప్రభావవంతంగా ఉంటాయి. అంటే సూర్యాస్తమయ సమయం నుండి వాటి హవా మొదలవుతుంది. అందుకే సాయంత్రం అవ్వగానే ఇంటి తలుపులు, కిటికీలు వేసుకుని దోమల నుండి తగిన రక్షణ పొందవచ్చు.

◆ సహజంగా దోమలను తరిమికొట్టేశక్తి కొన్ని పాతకాలపు అలవాట్లలో ఉంది. అందులో భాగమే సాంబ్రాణి ధూపం వేయడం. సాయంకాల సమయంలో ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల దోమలను తరిమికొట్టచ్చు. పైగా రసాయనాలతో నిండిపోయిన క్రిమిసంహారక మందులకంటే ఇవి ఎంతో ఉత్తమం.

◆ ఇంట్లో పరిశుభ్రతే కాదు ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రంగా ఉంచడంలో కూడా మన బాధ్యత ఉంటుంది. ఇంటి పరిసరాల్లో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలి. ఆ ప్రాంతాల్లోనే దోమలు పెరుగుతాయనే విషయం మరచిపోకూడదు.

◆ దోమలు చీకటి ప్రాంతాల్లో ఎక్కువగా తిరుగుతుంటాయి. కాబట్టి ఎక్కడున్నా తగినంత వెలుతురు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

◆ ఇప్పటి కాలంలో అందరూ చేస్తున్న తప్పు ఇంట్లో చెత్తను రోజుల తరబడి నిల్వచేయడం, ఆ తరువాత చెత్తకుప్పలో వేసిరావడం. ఇలాంటి పనులే సగం సమస్యకు కారణం అవుతుంటాయి. కాబట్టి ఇంట్లో చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి బయట వేసిరావడం మంచిది.

◆ మద్యపానం, ధూమపానం, గుట్కా వంటివి సేవించడం ఆపేయాలి. ఇవన్నీ శరీరంలో యాంటీ బాడీస్ పనితీరును మందగిస్తాయి.

◆ శరీరానికి దివ్యమైన ఔషధం మంచినీరు. అయితే ఈ వర్షాకాలంలో తాగునీటిని శుభ్రంగా ఉంచుకోవడం, అవసరమైతే కాచి చల్లార్చిన నీటిని తాగడం మంచిది. కాలం ఏదైనా శరీరానికి తగినంత నీటిని అందించాలి.

◆ వర్షంలో తడవడం, నిర్లక్ష్యంగా ఉండటం సమస్యను కొనితెచ్చుకున్నట్టు అవుతుంది.

◆ అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యంగా ఉండటం. రోగనిరోధకశక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవడం. ముఖ్యంగా విటమిన్ సి ఎక్కువగా లభ్యమయ్యే నిమ్మజాతి పండ్లను తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకోవాలి. సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు, పప్పుధాన్యాలు, పాలు, గుడ్లు మొదలైనవి సమృద్ధిగా తీసుకోవాలి. జంక్ ఫుడ్, నూనె ఎక్కువగా ఉన్న పదార్థాలు, నిల్వ ఉంచిన పదార్థాలు, ప్యాక్ చేయబడిన పదార్థాలు మానుకోవాలి. ఇవి శరీరంలో రోగనిరోధకశక్తిని తగ్గిస్తాయి.

◆ కంటి నొప్పి, ఒళ్ళు నొప్పులు, జ్వరం, వికారంగా ఉండటం, వాంతులు కావడం, కండరాలు పట్టేయడం, అకస్మాత్తుగా శరీరమంతా దద్దుర్లు రావడం మొదలైనవి డెంగ్యూ లక్షణాలు. ఈ లక్షణాల్లో ఏవైనా ఇబ్బంది పెడుతూ ఉంటే స్వీయ వైద్యం చేసుకోకుండా, మెడికల్ స్టోరుల మీద ఆధారపడకుండా వైద్యులను కలవడం శ్రేయస్కరం.

Tags:    
Advertisement

Similar News