ఆప్షన్లు పక్కనబెట్టిన పవన్.. ప్రకాశం పర్యటనలో క్లారిటీ

2024 ఎన్నికల్లో జనసేన ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది. బీజేపీతో స్నేహం కొనసాగుతుందా..? టీడీపీతో కొత్త బంధం ఏర్పరచుకుంటుందా..? లేక బీజేపీ, టీడీపీ రెండిటితో జత కడుతుందా..? దీనిపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో పవన్ ఇటీవల చేసిన మూడు ఆప్షన్ల ప్రకటన కూడా కలకలం రేపింది. అయితే అంతలోనే ఆయన మరోసారి మాట మార్చారు. ప్రకాశం జిల్లా కౌలురైతు భరోసా యాత్రలో పాల్గొన్న ఆయన.. చాలాసార్లు చాలామందికి అవకాశమిచ్చిన ఏపీ ప్రజలు, ఈసారి జనసేనకు ఛాన్స్ ఇవ్వాలని కోరారు. […]

Advertisement
Update: 2022-06-19 20:24 GMT

2024 ఎన్నికల్లో జనసేన ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది. బీజేపీతో స్నేహం కొనసాగుతుందా..? టీడీపీతో కొత్త బంధం ఏర్పరచుకుంటుందా..? లేక బీజేపీ, టీడీపీ రెండిటితో జత కడుతుందా..? దీనిపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో పవన్ ఇటీవల చేసిన మూడు ఆప్షన్ల ప్రకటన కూడా కలకలం రేపింది. అయితే అంతలోనే ఆయన మరోసారి మాట మార్చారు. ప్రకాశం జిల్లా కౌలురైతు భరోసా యాత్రలో పాల్గొన్న ఆయన.. చాలాసార్లు చాలామందికి అవకాశమిచ్చిన ఏపీ ప్రజలు, ఈసారి జనసేనకు ఛాన్స్ ఇవ్వాలని కోరారు.

ప్రజలతోనే పొత్తు..
ఇటీవలే మూడు ఆప్షన్లు ఇచ్చిన పవన్ కల్యాణ్, ఇప్పుడిక పొత్తులపై మాట్లాడనంటున్నారు. ఆయన ఇచ్చిన ఆప్షన్లపై ఇటు జనసైనికులు అసంతృప్తిగానేఉన్నారు, అటు టీడీపీ, బీజేపీ నుంచి కూడా ఎలాంటి ప్రతిపాదనలు ముందుకు రాలేదు. దీంతో పొత్తులపై ఇప్పుడు మాట్లాడనంటున్నారు పవన్. ఇది సమయం కాదని, తమ పొత్తు కేవలం ప్రజలతోనే అని తేల్చి చెప్పారు. 2009లో ఏం చెప్పానో అదే చేస్తానంటున్నారు జనసేనాని. ప్రజలకోసం, ప్రత్యేక హోదాకోసం అప్పట్లో ప్రధాన మంత్రితో విభేదించి, వ్యక్తిగతంగా నష్టపోయానని గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో ప్రజలు ముందుకెళ్లేలా చేయడమే తన తపన అన్నారు.

దసరా తర్వాత వారి సంగతి చూస్తా..
దసరా తర్వాత వైసీపీ నాయకుల సంగతి చూస్తానని, అప్పటి వరకు వారేం మాట్లాడినా భరిస్తానని చెప్పారు పవన్‌ కల్యాణ్‌. జనసేన అధికారంలోకి రాగానే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామన్నారు. లక్షకోట్లు దోపిడీ చేసే సత్తా వైసీపీ వారికి ఉన్నప్పుడు రెండున్నర లక్షల ఉద్యోగాలు తెచ్చే సత్తా జనసేనకు ఉందని చెప్పారు పవన్. విభజన జరిగినప్పటి నుంచి రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని పదే పదే కేంద్రాన్ని నిందించడం సరికాదని, ముందు మన బంగారం మంచిదవ్వాలంటూ సెటైర్లు వేశారు. బాధ్యతగల వ్యక్తుల్ని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నప్పుడే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పారు. కొత్తతరం నాయకులు రాజకీయాల్లోకి రావాలని, ఈ ఒక్కసారి అందరూ జనసేన వైపు చూడాలని హితబోధ చేసారు.

పార్టీ పెట్టినప్పటి నుంచి జనసేనకు అన్నీ ప్రతికూల పరిస్థితులే అయినా, ఎక్కడా వెనక్కి తగ్గలేదని చెప్పారు పవన్. మొత్తమ్మీద పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన పొత్తు ఆప్షన్లపై కాస్త వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. సొంతగా పోటీ చేయాలనే ఆలోచన మళ్లీ ఆయనకు వచ్చినట్టు ప్రకాశం జిల్లా పర్యటన ద్వారా అర్థమవుతోంది. అందుకే.. తన పొత్తు జనంతోనే, తనకోసారి అవకాశమివ్వాలని అభ్యర్థిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News