వైసీపీ నుంచి కొత్తపల్లి సస్పెన్షన్..

వైసీపీ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిపై సస్పెన్షన్‌ వేటు పడింది. పార్టీ క్రమశిక్షణా కమిటీ, సీఎం జగన్‌ ఆదేశాల మేరకు సుబ్బారాయుడును సస్పెండ్‌ చేసినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నట్టు ఆ ప్రకటనలో కేంద్ర కార్యాలయం వెల్లడించింది. తనకు వైసీపీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నరసాపురం అసెంబ్లీ స్థానం నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేస్తానని కొత్తపల్లి బహిరంగంగా ప్రకటించడంతో పార్టీ […]

Advertisement
Update: 2022-06-01 11:46 GMT

వైసీపీ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిపై సస్పెన్షన్‌ వేటు పడింది. పార్టీ క్రమశిక్షణా కమిటీ, సీఎం జగన్‌ ఆదేశాల మేరకు సుబ్బారాయుడును సస్పెండ్‌ చేసినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నట్టు ఆ ప్రకటనలో కేంద్ర కార్యాలయం వెల్లడించింది. తనకు వైసీపీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నరసాపురం అసెంబ్లీ స్థానం నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేస్తానని కొత్తపల్లి బహిరంగంగా ప్రకటించడంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల జరిగిన నరసాపురం జిల్లా సాధన సమితి ఉద్యమంలో సుబ్బారాయుడు పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రసాద్‌ రాజుపై కూడా ఆయన బహిరంగ విమర్శలు చేశారు. తాజాగా నరసాపురం అభ్యర్థిని తానేనంటూ ప్రకటించుకున్నారు. దీంతో పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇటీవలే ప్రభుత్వం ఆయనకు గన్ మెన్లను కూడా ఉపసంహరించింది.

ఇటీవల రెండో సస్పెన్షన్ ఇదే..
2019 ఎన్నికల్లో 151 స్థానాల ఘన విజయం తర్వాత వైసీపీలో పెద్దగా అసంతృప్తి సెగలు రేగలేదు. రఘురామకృష్ణంరాజు వంటి వారు పార్టీలోనే ఉంటూ ఇబ్బంది పెడుతున్నా కూడా వేటు వేసేందుకు పార్టీ వేచి చూస్తోంది. ఈ దశలో ఇటీవల కారు డ్రైవర్ హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబుపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. రోజుల వ్యవధిలోనే ఇప్పుడు కొత్తపల్లి కూడా సస్పెన్షన్ కు గురవడం విశేషం.

కొద్దిరోజుల క్రితం సుబ్బారాయుడి గన్‌ మెన్లను ప్రభుత్వం తొలగించింది. ఇటీవల జిల్లా కేంద్రం కోసం జరిగిన ఆందోళనల్లో సుబ్బారాయుడిపై కేసు నమోదు చేసి ఏ-1గా చేర్చారు. నోటీసులు కూడా జారీ చేశారు. అధికార పార్టీ నేతలు నోటీసులు జారీ చేయడంతో కలకలం రేగింది. ఇలా తనకు నోటీసులు ఇవ్వడం హాస్యాస్పదం అని వ్యాఖ్యానించారు కొత్తపల్లి. ఆ తర్వాత నరసాపురం నియోజకవర్గం పోటీపై కార్యకర్తలకు క్లారిటీ ఇచ్చారు. చివరకు అధిష్టానం ఆగ్రహానికి బలయ్యారు.

Tags:    
Advertisement