అవినీతిపై ఆప్ ఉక్కుపాదం.. ఆచరణలో ఎంతవరకు సాధ్యం..

ప్రభుత్వాలు మారినప్పుడల్లా సంచలన నిర్ణయాలు తీసుకోవడం సహజం. పంజాబ్ లో తొలిసారిగా అధికారం చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఆ దిశగా అడుగులు వేసింది. సీఎం ప్రమాణ స్వీకారానికి ముందే ఎమ్మెల్యేలు ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి అధికారుల భరతం పడతామంటూ రంగంలోకి దిగారు. ప్రమాణ స్వీకారం తర్వాత సీఎం భగవంత్ మన్ కూడా ఆ దిశగా సంచలన ప్రకటన చేశారు. భగత్‌ సింగ్‌ వర్ధంతి రోజున.. అంటే మార్చి 23న అవినీతి నిరోధక హెల్ప్‌ లైన్‌ […]

Advertisement
Update: 2022-03-17 22:04 GMT

ప్రభుత్వాలు మారినప్పుడల్లా సంచలన నిర్ణయాలు తీసుకోవడం సహజం. పంజాబ్ లో తొలిసారిగా అధికారం చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఆ దిశగా అడుగులు వేసింది. సీఎం ప్రమాణ స్వీకారానికి ముందే ఎమ్మెల్యేలు ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి అధికారుల భరతం పడతామంటూ రంగంలోకి దిగారు. ప్రమాణ స్వీకారం తర్వాత సీఎం భగవంత్ మన్ కూడా ఆ దిశగా సంచలన ప్రకటన చేశారు. భగత్‌ సింగ్‌ వర్ధంతి రోజున.. అంటే మార్చి 23న అవినీతి నిరోధక హెల్ప్‌ లైన్‌ నంబర్‌ ను విడుదల చేస్తామని సీఎం ప్రకటించారు. ఆ హెల్ప్‌ లైన్‌ నంబర్‌ గా తన వ్యక్తిగత వాట్సాప్‌ నంబరే ఉంటుందని తెలిపారు. లంచగొండుల వివరాలను నేరుగా ఆ నెంబర్ కి వాట్సప్ చేయాలని పౌరులకు సూచించారు. అవినీతిపరులైన అధికారులు, ప్రభుత్వ సిబ్బందిపై పై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. పంజాబ్‌ లో ఇకపై అవినీతి పనిచేయదని హెచ్చరించారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిని అంతం చేసిందని, ఇప్పుడు పంజాబ్ వంతు అని ఆప్ అధినేత కేజ్రీవాల్ ప్రకటించారు.

సిద్ధూ ప్రశంసలు..
సీఎం భగవంత్ మన్ తీసుకున్న నిర్ణయంపై ప్రజలనుంచే కాదు, ప్రతిపక్ష పార్టీ నాయకుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన భగవంత్‌ మన్‌ కు శుభాకాంక్షలు తెలిపిన సిద్ధూ.. పంజాబ్‌ లో మాఫియా వ్యతిరేక శకానికి తెరలేపారంటూ ప్రశంసించారు. పంజాబ్‌లో మాఫియా వ్యతిరేక నూతన శకానికి తెరలేపిన భగవంత్‌ మన్‌ పై ఎన్నో ఆశలు ఉన్నాయి, ఆయన పంజాబ్‌ ను పునరుజ్జీవన పథంలోకి తీసుకువస్తారని ఆశిస్తున్నానంటూ సిద్ధూ చేసిన ప్రకటన కాంగ్రెస్ కి మింగుడు పడటంలేదు. నూతన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో పంజాబ్‌ ప్రజలు అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారని, ప్రజాతీర్పును గౌరవించాలని, ప్రజా వాక్కే దైవ‌వాక్కు అంటూ గతంలో కూడా సిద్ధూ కాంగ్రెస్ అధిష్టానం ఇబ్బంది పడే ప్రకటన విడుదల చేశారు. పంజాబ్ కొత్త ప్రభుత్వాన్ని ప్రశంసల్లో ముంచెత్తుతూ కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారారు సిద్ధూ. తనని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారని ఆశించి భంగపడ్డ ఆయన.. పంజాబ్ ఎన్నికల ఫలితాల తర్వాత మరింత అసంతృప్తికి లోనయ్యారు. అధిష్టానం సూచనతో ఆయన పీసీసీ చీఫ్ గా కూడా రాజీనామా చేశారు. తాజాగా ఆమ్ ఆద్మీ ప్రభుత్వంపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

మాజీ క్రికెటర్ హర్భజన్ కి రాజ్యసభ ఛాన్స్..
మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కి పంజాబ్ స్పోర్స్ట్ యూనివర్శిటీ బాధ్యతలు అప్పగించడంతోపాటు, ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించడం విశేషం. త్వరలో రాజ్యసభలో భర్తీ కాబోయే స్థానాల్లో 5 ఆప్ కి దక్కుతాయి. అందులో ఓ స్థానం పంజాబ్ నుంచి హర్భజన్ కు దక్కుతోంది. గతంలో హర్భజన్ సింగ్ బీజేపీ, కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు ఊహాగానాలు వచ్చాయి. ఓ దశలో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ అవేవీ సాధ్యపడలేదు. తాజాగా ఆప్ విజయం తర్వాత హర్భజన్ కు బంపర్ ఆఫర్ దక్కింది. మొత్తమ్మీద పంజాబ్ లో అధికారం చేపట్టిన ఆప్ సంచలన నిర్ణయాలతో ఆకట్టుకుంటోంది.

Tags:    
Advertisement

Similar News