ఏపీలో పదో తరగతి పరీక్షలపై సందిగ్ధం..
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసినా, జూన్ 7నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను మాత్రం జరిపితీరుతామని చెబుతూ వచ్చింది. ఇప్పటి వరకు వాయిదా ప్రకటన లేదు. అదే సమయంలో పరీక్షలు యథాతధంగా జరుగుతాయని మంత్రి ఆదిమూలపు సురేష్ ఆమధ్య ఓసారి హింట్ ఇచ్చారు. అటు కరోనా కేసులు కూడా తగ్గుముఖం పట్టడంతో.. పరీక్షలు అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరుగుతాయనే అందరూ అనుకుంటున్నారు. ఈ దశలో విద్యాశాఖ అధికారులు […]
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసినా, జూన్ 7నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను మాత్రం జరిపితీరుతామని చెబుతూ వచ్చింది. ఇప్పటి వరకు వాయిదా ప్రకటన లేదు. అదే సమయంలో పరీక్షలు యథాతధంగా జరుగుతాయని మంత్రి ఆదిమూలపు సురేష్ ఆమధ్య ఓసారి హింట్ ఇచ్చారు. అటు కరోనా కేసులు కూడా తగ్గుముఖం పట్టడంతో.. పరీక్షలు అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరుగుతాయనే అందరూ అనుకుంటున్నారు. ఈ దశలో విద్యాశాఖ అధికారులు మాత్రం తాము సిద్ధంగా లేమంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం విశేషం. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో నెలరోజులు పరీక్షల్ని వాయిదా వేయాలని వారు ఆ ప్రతిపాదనల్లో కోరారు. సీఎం జగన్ తీసుకునే నిర్ణయంపై పది పరీక్షల భవితవ్యం ఆధారపడి ఉంది.
మేం సిద్ధంగా లేం..
ఇటీవల ఎన్నికల విధులకు హాజరైన ఉపాధ్యాయుల్లో చాలామంది కరోనాబారిన పడి మరణించిన ఉదాహరణలు చూశాం. అసలు ఎన్నికలే లేకపోయి ఉంటే.. ఆ చావులు ఉండేవి కాదు కదా అని పలు ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ దశలో పదో తరగతి పరీక్షలంటే.. నిత్యం వందలాది మంది విద్యార్థులతో మరోసారి ప్రత్యక్షంగా కలవాల్సి ఉంటుంది. ఆ భయం అటుంచితే.. పరీక్షలకు ఇంకా ఎక్కువ టైమ్ లేదు. అందులోనూ ఏపీలో ఈనెల 31 వరకు కర్ఫ్యూ అమలులో ఉంది. అంటే కర్ఫ్యూ తర్వాత కేవలం 7 రోజులు మాత్రమే పరీక్షలకు గ్యాప్ ఉంది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో స్కూళ్లను కూడా క్వారంటైన్ కేంద్రాలుగా మార్చి కరోనా బాధితులను అక్కడ ఐసోలేషన్ లో ఉంచారు. వీటిలో కొన్ని పరీక్షా కేంద్రాలు కూడా ఉన్నాయి. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని పరీక్షల్ని నెలరోజులు వాయిదా వేయాలంటూ విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
ప్రత్యామ్నాయం ఏంటి..?
ఒకవేళ పరీక్షలు వాయిదా పడితే సరే.. ఏకంగా రద్దు చేస్తే విద్యార్థులకు మార్కులు ఎలా ఇవ్వాలనే విషయంపై కూడా అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. విద్యార్థుల అంతర్గత మార్కులను ఆన్ లైన్ లో నమోదు చేయాలంటూ ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ఈ ఏడాది రెండుసార్లు అంతర్గత మూల్యాంకగనం జరిగింది. వీటి సగటు ఆధారంగా పది విద్యార్థులకు గ్రేడ్లు ఇచ్చే అవకాశం ఉంది. దీనికోసం ప్రత్యేకంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం ఉంది. అటు తెలంగాణ ప్రభుత్వం పదో తరగతి పరీక్షల్ని రద్దు చేసి, అంతర్గత మార్కుల ఆధారంగా ఆల్రడీ రిజల్ట్ కూడా ప్రకటించింది. ఇంటర్మీడియట్ పరీక్షలపై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం, అధికారులు, ఇంటర్ పరీక్షల నిర్వహణకై మొగ్గు చూపుతారని తెలుస్తోంది. ఇటు ఏపీ ప్రభుత్వం కూడా పదో తరగతి పరీక్షల్ని రద్దు చేయదని, షెడ్యూల్ ప్రకారం జూన్ 7న నిర్వహణ సాధ్యం కాకపోతే వాయిదా వేసే అవకాశం ఉందని నిపుణుల అంచనా.