మోదీ అంటే చంద్రబాబుకి అంత భయమా..?

బీజేపీతో తెగతెంపులైన తర్వాత చంద్రబాబు సహా టీడీపీ నాయకులంతా మోదీని టార్గెట్ చేశారు. విమర్శల విషయంలో ఒకరిని మించి మరొకరు రాటు దేలారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయానికి మోదీని మరింత దారుణంగా విమర్శించారు చంద్రబాబు. అయితే ఫలితాలు తేడా కొట్టడంతో రోజుల వ్యవధిలోనే ప్లేటు ఫిరాయించారు. ఎన్డీయే రెండో దఫా అధికారంలోకి వచ్చాక మోదీ మరింత కఠినంగా ఉండటం, ఇటు ఏపీలో తన పార్టీ పరిస్థితి మరీ తీసికట్టుగా తయారవడంతో మోదీ శరణం గచ్ఛామి మినహా […]

Advertisement
Update: 2021-03-11 21:27 GMT

బీజేపీతో తెగతెంపులైన తర్వాత చంద్రబాబు సహా టీడీపీ నాయకులంతా మోదీని టార్గెట్ చేశారు. విమర్శల విషయంలో ఒకరిని మించి మరొకరు రాటు దేలారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయానికి మోదీని మరింత దారుణంగా విమర్శించారు చంద్రబాబు. అయితే ఫలితాలు తేడా కొట్టడంతో రోజుల వ్యవధిలోనే ప్లేటు ఫిరాయించారు. ఎన్డీయే రెండో దఫా అధికారంలోకి వచ్చాక మోదీ మరింత కఠినంగా ఉండటం, ఇటు ఏపీలో తన పార్టీ పరిస్థితి మరీ తీసికట్టుగా తయారవడంతో మోదీ శరణం గచ్ఛామి మినహా బాబు చేయగలిగిందేమీ లేకుండా పోయింది. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ రేట్లు పెరుగుతున్నా కేంద్రాన్ని విమర్శించరు, ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ధర్నాలు చేస్తుంటే బాబుకి పట్టదు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యవహారంలో కూడా మోదీని పల్లెత్తు మాట అనరు, అన్నిటికీ కారణం వైసీపీయేనని తిట్టిపోస్తున్నారు. కనీసం ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ గాయపడి ఆస్పత్రిలో ఉంటే, జాతీయ మీడియా మొత్తం మమత ఘటనపై ఫోకస్ పెడితే చంద్రబాబుకి స్పందించే టైమ్ కూడా లేకపోవడం విచిత్రమే.

వాస్తవానికి మమతా బెనర్జీ ఘటనకు చంద్రబాబుకి సంబంధం లేదు, ఆమెపై సింపతీ చూపించాలని కూడా ఎక్కడా రూలు లేదు. కానీ చంద్రబాబు తనకు తాను జాతీయ నాయకుడినని చెప్పుకుంటారు, టీడీపీకి తాను జాతీయాధ్యక్షుడినని కూడా ప్రకటించుకున్నారు. అంతే కాదు. 2019 ఎన్నికల్లో పశ్చిమబెంగాల్, కర్నాటక వెళ్లి ప్రచారం కూడా చేసొచ్చారు. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, దేవగౌడ సహా.. ఇతర రాష్ట్రాల నేతల్ని సైతం ఏపీలో తీసుకొచ్చి ప్రచారం చేయించుకున్నారు. కనీసం మమతపై ఆ సింపతీ కూడా లేకపోవడమే ఇక్కడ దారుణమైన విషయం. రెండేళ్లు కూడా కాలేదు, అప్పుడే మమత అంత శత్రువైపోయారా, ఆమెకు శత్రువైన మోదీ.. బాబుకి అంత మిత్రుడైపోయారా?

చంద్రబాబుపై సెటైర్లు..
2019 ఎన్నికల్లో తన రాజకీయ అవసరాలకోసం మమతా బెనర్జీతో అంటకాగిన చంద్రబాబు.. రెండేళ్లు తిరక్కుండానే తన నిజస్వరూపం బయటపెట్టారని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. జాతీయ నాయకుడినని చెప్పుకునే చంద్రబాబు మమత గాయపడి రోజులు గడుస్తున్నా పట్టించుకోకపోవడం, కనీసం తన ట్విట్టర్లో కూడా సానుభూతి ప్రకటించకపోవడంతో ఆయన నైజం మరోసారి బయటపడిందని విమర్శిస్తున్నారు. జాతీయ నాయకుడైన చంద్రబాబు, పక్క రాష్ట్ర సీఎం ఆస్పత్రిలో ఉంటే పట్టించుకోకపోవడం ఏంటి.. మరీ అంతలా మోదీకి భయపడాలా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఉక్కు పోరాటంలో వైసీపీపై నిందలేస్తే.. అది రాజకీయ అవసరం, మరి మమతా బెనర్జీని కనీసం పలకరించకపోవడం మానవత్వం లేకపోవడం.

Tags:    
Advertisement

Similar News