మావి అసలైన ఫలితాలు.. మావి నిజమైన ఫలితాలు

ఏపీలో పంచాయతీ ఎన్నికల ఫలితాలపై రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రకటనలు ప్రైవేటు కాలేజీల ర్యాంకుల మోతని మించిపోతోంది. మావి అసలైన ఫలితాలంటే, మావి సిసలైన ఫలితాలంటూ టీడీపీ, వైసీపీ పోటా పోటీగా ప్రచారం చేసుకుంటున్నాయి. వాస్తవానికి రెండు విడతల్లో జరిగిన పంచాయతీ పోరులో వైసీపీ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. కానీ టీడీపీ మాత్రం లెక్కలతో హడావిడి చేస్తోంది. 35శాతం ఓట్లు వచ్చాయని, 50శాతం సీట్లు వచ్చాయని చెప్పుకుంటోంది. ఓ దశలో టీడీపీ విడుదల చేసివ విజేతల లెక్క […]

Advertisement
Update: 2021-02-14 21:15 GMT

ఏపీలో పంచాయతీ ఎన్నికల ఫలితాలపై రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రకటనలు ప్రైవేటు కాలేజీల ర్యాంకుల మోతని మించిపోతోంది. మావి అసలైన ఫలితాలంటే, మావి సిసలైన ఫలితాలంటూ టీడీపీ, వైసీపీ పోటా పోటీగా ప్రచారం చేసుకుంటున్నాయి. వాస్తవానికి రెండు విడతల్లో జరిగిన పంచాయతీ పోరులో వైసీపీ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. కానీ టీడీపీ మాత్రం లెక్కలతో హడావిడి చేస్తోంది. 35శాతం ఓట్లు వచ్చాయని, 50శాతం సీట్లు వచ్చాయని చెప్పుకుంటోంది. ఓ దశలో టీడీపీ విడుదల చేసివ విజేతల లెక్క వైసీపీని మించిపోతోంది. విచిత్రం ఏంటంటే.. పంచాయతీ ఫలితాలతో వైసీపీ పతనం మొదలైంది, టీడీపీ ప్రజాదరణ పెరిగిందని చెప్పుకుంటున్న చంద్రబాబు.. ఎన్నికల్లో అధికార పార్టీ మోసాలకు తెరతీసిందని పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. నిజంగానే అధికార పక్షం అక్రమాలు చేసి ఉంటే.. టీడీపీకి అన్ని సీట్లు వచ్చే అవకాశమే లేదు. ప్రతిపక్ష పార్టీగా టీడీపీ 50శాతం కంటే ఎక్కువ సీట్లు తెచ్చుకుంటే ఎన్నికలు సజావుగా జరిగినట్టే లెక్క. మరి ఈ రెండిట్లో ఏది నిజమో చంద్రబాబే చెప్పాలి.

ఇక వైసీపీ విషయానికొస్తే.. విజేతల వివరాలు పొందు పరుస్తూ ఏకంగా ఓ వెబ్ సైట్ నే రూపొందించారు నాయకులు. టీడీపీ దానికి డూప్లికేట్ వెబ్ సైట్ ని కూడా లాంచ్ చేసిందని ఫిర్యాదు చేస్తున్నారు. అసలు పంచాయతీ ఎన్నికల ఫలితాలు చెప్పుకోడానికి వెబ్ సైట్ అవసరమా అనేది సామాన్యులకు అంతు చిక్కడంలేదు. వైసీపీకి 90శాతం స్థానాలు వచ్చాయని నాయకులు చెబుతున్నారు. గ్రామాల్లో అధికార పార్టీని కాదని బయటకు వెళ్లే వారు సహజంగానే ఉండరు. రెండోదశ తర్వాత గెలిచిన సర్పంచ్ లందరితో వైసీపీ ఎమ్మెల్యేలు పరేడ్ కూడా పెడుతున్నారు. టీడీపీ నాయకులు మాత్రం పేర్లు చెప్పడం మినహా.. విజేతలను తమ పక్కన నిలబెట్టుకుని చూపించే సాహసం చేయడంలేదు. దీంతో పంచాయతీ పోరుపై జనాలకు ఓ క్లారిటీ వచ్చేసింది. ఈ దశలో కూడా ఈ ప్రకటనల హడావిడి ఎందుకు. గెలిచిన సర్పంచ్ లంతా మావారేనంటూ వైసీపీ చెప్పుకుంటుంటే.. సగం మంది మావారేనంటూ టీడీపీ తరపున లిస్ట్ చదువుతున్నారు చంద్రబాబు. అనుకూల మీడియాతో వందశాతం టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారని కూడా టీడీపీ ప్రచారం చేసుకోగలదు. అంతమాత్రాన దానికి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందేనంటూ, వెబ్ సైట్ల రూపకల్పనతో వైసీపీ ఆందోళనకు గురికావడమే కాస్త విచిత్రంగా ఉంది.

పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరగవు, పార్టీల ప్రమేయంకంటే ఓటుకి నోటు, లేదా ఏకగ్రీవంకోసం అభ్యర్థి పెట్టుకునే ఖర్చుపైనే వారి విజయం ఆధారపడి ఉంటుంది. సహజంగా ప్రతిపక్ష పార్టీల తరపున పోటీ చేసేవారెవరూ అంత రిస్క్ చేయరు. ఒకవేళ చేసినా వెంటనే అధికార పార్టీలోకి మారిపోవాలనే ఉద్దేశంలోనే ఉంటారు. ఈ వివరాలన్నీ స్పష్టంగా ఉన్నా కూడా.. విజేతలు మావారేనంటూ అధికార, ప్రతిపక్ష పార్టీలు క్రెడిట్ కోసం తాపత్రయ పడటమే ఆశ్చర్యం కలిగించే అంశం.

Tags:    
Advertisement

Similar News