ఎన్నికల నిర్వహణ ఇప్పుడు కష్టం " ఎస్ఈసీకి సీఎస్ లేఖ

ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరుపుతామని, దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విజ్ఞప్తి చేసిన గంటల వ్యవధిలోనే.. ప్రభుత్వం తరపున చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని ఎన్నికల నిర్వహణ పరిస్థితులు లేవంటూ స్పందించారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖ రాశారు. ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణ పరిస్థితులు లేవని స్పష్టం చేసిన ఆమె, ఎన్నికల నిర్వహణ పై […]

Advertisement
Update: 2020-11-17 21:07 GMT

ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరుపుతామని, దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విజ్ఞప్తి చేసిన గంటల వ్యవధిలోనే.. ప్రభుత్వం తరపున చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని ఎన్నికల నిర్వహణ పరిస్థితులు లేవంటూ స్పందించారు.

ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖ రాశారు. ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణ పరిస్థితులు లేవని స్పష్టం చేసిన ఆమె, ఎన్నికల నిర్వహణ పై కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.

జిల్లా కలెక్టర్లు సహా రాష్ట్రంలోని అధికార యంత్రాంగం అంతా కోవిడ్ ని ఎదుర్కోవడంలో నిమగ్నమై ఉందని, ఈ దశలో ఎన్నికల ప్రక్రియ సరికాదని అన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉందని, ముఖ్యంగా ఇప్పుడు కరోనా గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి ఉందని, ఈ దశలో పంచాయతీ ఎన్నికలు జరిపితే మరింత ప్రమాదం ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె తన లేఖలో వివరించారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తామనడం ప్రజా హితమైన నిర్ణయం కాదని అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికలను, తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు అక్కడి పార్టీలు సిద్ధపడటాన్ని ఉదాహరణగా చూపుతూ ఏపీలో ఎన్నికలకు వెళ్దామన్న ఎస్ఈసీ ప్రతిపాదనకు కూడా సమాధానమిచ్చారు చీఫ్ సెక్రటరీ.

కరోనా మహమ్మరిని ఎదుర్కోవడంలో ఒక్కో రాష్ట్రం ఒక్కో వ్యూహాన్ని అమలు చేస్తోందని, ఏ రాష్ట్రాన్ని మరో రాష్ట్రంతో పోల్చడం సరికాదని, ఏపీలో ఇప్పటికే 6,890 మంది కరోనా కారణంగా మరణించారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాబోయే కాలంలో కరోనా తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పిన విషయాన్ని ఆమె ఎస్ఈసీకి గుర్తు చేశారు. స్థానిక ఎన్నికల నిర్వహణ పై ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని పునస్సమీక్షించాలని కోరారు.

ఇలాంటి నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ పై ఎస్ఈసీ నిర్వహించాలనుకున్న వీడియో కాన్ఫరెన్స్ కూడా అవసరం లేదని భావిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సమాయత్తం అయిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్ లు, సమీక్షలు, సమావేశాలు వంటి చర్యలకు శ్రీకారం చుట్టడం మేలని చెప్పారు.

ఎన్నికల కమిషన్ ఈ అంశాలన్నిటినీ సానుకూలంగా పరిగణిస్తుందని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. మొత్తమ్మీద స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్న విషయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖతో స్పష్టమైంది.

Advertisement

Similar News