కూర్చుని లేవగానే తలతిరుగుతోందా...?!

చాలా సమయం పాటు కూర్చుని హఠాత్తుగా పైకి లేవగానే కొంతమందికి కళ్లు తిరిగినట్టుగా మైకం కమ్మినట్టుగా అనిపిస్తూ ఉంటుంది.  తరువాత అది సర్దుకుంటుంది. ఈ సమస్య ఉన్నా… దీనివలన  బాధేముందిలే… అనుకునేవారు అప్రమత్తంగా ఉండాలని ఓ నూతన అధ్యయనం చెబుతోంది.    ఇలాంటి పరిస్థితి ఉన్నవారిలో భవిష్యత్తులో డిమెన్షియా అనే మెదడుకి సంబంధించిన వ్యాధి కలగవచ్చని ఈ అధ్యయనంలో తేలింది. అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ వారి మెడికల్ జర్నల్… న్యూరాలజీలో ఈ అధ్యయనం తాలూకూ వివరాలను […]

Advertisement
Update: 2020-08-08 09:45 GMT

చాలా సమయం పాటు కూర్చుని హఠాత్తుగా పైకి లేవగానే కొంతమందికి కళ్లు తిరిగినట్టుగా మైకం కమ్మినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. తరువాత అది సర్దుకుంటుంది. ఈ సమస్య ఉన్నా… దీనివలన బాధేముందిలే… అనుకునేవారు అప్రమత్తంగా ఉండాలని ఓ నూతన అధ్యయనం చెబుతోంది.

ఇలాంటి పరిస్థితి ఉన్నవారిలో భవిష్యత్తులో డిమెన్షియా అనే మెదడుకి సంబంధించిన వ్యాధి కలగవచ్చని ఈ అధ్యయనంలో తేలింది. అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ వారి మెడికల్ జర్నల్… న్యూరాలజీలో ఈ అధ్యయనం తాలూకూ వివరాలను ప్రచురించారు. డిమెన్షియా వలన మతిమరుపు, ఆలోచనా శక్తి తగ్గిపోవటం లాంటి సమస్యలు కలుగుతాయి.

లేచి నిలబడగానే మైకం కమ్మినట్టుగా అనిపించే స్థితిని ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటారని, నిలబడిన వెంటనే రక్తపోటు పడిపోవటం వలన అలా జరుగుతుందని ఈ జర్నల్లో ప్రచురించిన ఆర్టికల్ లో వివరించారు. అయితే డిమెన్షియాకు కారణమయ్యే రక్తపోటు కేవలం సిస్టాలిక్ (రక్తపోటు నమోదులో పైన ఉండే అంకె) రక్తపోటు మాత్రమేనని… ఇది తగ్గినవారిలోనే భవిష్యత్తులో డిమెన్షియా వచ్చే అవకాశం ఉందని… పూర్తి స్థాయి రక్తపోటు తగ్గటానికి దీనికి సంబంధం లేదని పరిశోధకులు అంటున్నారు.

కూర్చుని లేచిన వెంటనే సిస్టాలిక్ రక్తపోటు 15 ఎమ్ ఎమ్ హెచ్ జి వరకు పడిపోతే దీనిని సిస్టాలిక్ ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటారు. కూర్చుని పైకి లేచినప్పుడు వ్యక్తుల రక్తపోటుని గమనిస్తే ఇది అర్థమవుతుందని ఈ అధ్యయన నిర్వాహకులు చెబుతున్నారు. సిస్టాలిక్ రక్తపోటు పడిపోతున్నపుడు అలాంటివారు తగిన చికిత్స తీసుకుంటే భవిష్యత్తులో మతిమరుపు, మెదడు శక్తి తగ్గిపోవటం లాంటి సమస్యలనుండి బయటపడవచ్చని కూడా వారు సలహా ఇస్తున్నారు.

కూర్చుని పైకి లేస్తున్నప్పుడు సిస్టాలిక్ రక్తపోటు పడిపోతూ ఆ తేడాలు మరీ ఎక్కువగా ఉన్నవారిలో… సిస్టాలిక్ రక్తపోటు స్థిరంగా ఉన్నవారిలో కంటే డిమెన్షియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా పరిశోధకులు తమ అధ్యయనంలో గుర్తించారు. కనుక ఈ సమస్య ఉన్నవారు వైద్యుల సలహాలు తీసుకోవటం మంచిది.

Tags:    
Advertisement

Similar News