ఎమ్మెల్యేలుగా ఓడిపోయారు.... ఎంపీలుగా గెలుస్తారట!

వంద సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నానాటికి దిగజారి పోవడానికి ఆ పార్టీ అనుసరిస్తున్న వైఖరే కారణమా? కాలంతో పాటు మారకుండా మూస విధానాలను అవలంభించడం ఆ పార్టీ చేస్తున్న తప్పిదమా?. కాంగ్రెస్ పార్టీలో తీసుకున్న విధాన నిర్ణయాలు ఏవీ అమలు చేయకపోవడానికి సీనియర్ నాయకులు కారణమా? అవును ఇవే కారణాలు అంటున్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు. ఇతర పార్టీలు తమకు తాము నిబంధనలు విధించుకుంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని అతిక్రమించకుండా కఠినంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో వారు […]

Advertisement
Update: 2019-02-28 21:10 GMT

వంద సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నానాటికి దిగజారి పోవడానికి ఆ పార్టీ అనుసరిస్తున్న వైఖరే కారణమా? కాలంతో పాటు మారకుండా మూస విధానాలను అవలంభించడం ఆ పార్టీ చేస్తున్న తప్పిదమా?. కాంగ్రెస్ పార్టీలో తీసుకున్న విధాన నిర్ణయాలు ఏవీ అమలు చేయకపోవడానికి సీనియర్ నాయకులు కారణమా? అవును ఇవే కారణాలు అంటున్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు.

ఇతర పార్టీలు తమకు తాము నిబంధనలు విధించుకుంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని అతిక్రమించకుండా కఠినంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో వారు అధికారానికి రోజురోజుకు దగ్గరవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ మాత్రం తాము రాసుకున్న విధానాలను తుంగలో తొక్కి తమ ఓటమికి తామే కారణం అని నిరూపిస్తున్నాయని వారంటున్నారు.

దీనికి ప్రత్యక్ష నిదర్శనం రానున్న లోక్ సభ ఎన్నికలలో పార్టీ తరఫున నిలబడే వారి పేర్లను దాదాపు ఖరారు చేయడమేనని అంటున్నారు. ఇటీవల తెలంగాణ ముందస్తు ఎన్నికలలో ఓటమి పాలైన వారందరినీ తిరిగి లోక్ సభ బరిలో నిలపాలని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఓ జాబితాను రూపొందించి ఏఐసీసీ కి పంపుతోంది. ఈ జాబితాలో ఉన్న నాయకులలో ఎక్కువమంది ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటమిపాలైన వారే.

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ స్థానం నుంచి దారుణంగా ఓడిపోయిన పొన్నం ప్రభాకర్ తిరిగి కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయించాలని అనుకుంటున్నారు. అలాగే నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ లేదంటే రేవంత్ రెడ్డి, మల్కాజిగిరి నుంచి శ్రీశైలం గౌడ్ ని కానీ రేవంత్ రెడ్డి కానీ పోటీ చేస్తారని చెబుతున్నారు.

ఈ నియోజకవర్గాల నుంచి తెలంగాణ శాసనసభకు పోటీ చేసి ఓటమి పాలైన వారే. ఒక్క శాసనసభ నియోజకవర్గంలోనే గెలవలేని వారు లోక్ సభ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల ప్రజల మనసును ఎలా గెలుచుకుంటారని కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.

పార్టీలో గెలుపు గుర్రాలను ప్రకటించడం మానేసి పైరవీలకు ప్రాధాన్యత ఇస్తున్నారని వారు మండిపడుతున్నారు. స్థానిక నాయకత్వంపై నమ్మకంతో అభ్యర్థుల ఎంపికను వారికే వదిలేసిన ఏ ఐ సి సి అధ్యక్షుడు రాహుల్ గాంధీది కూడా తప్పేనని వారంటున్నారు.

ఇక శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన సీతక్క చేత మహబూబాబాద్ నుంచి పోటీ చేయించాలనుకోవడం, ఆదిలాబాద్ నుంచి గెలిచిన ఆత్రం సుక్కు ను పోటీ చేయించాలనుకోవడం కూడా పార్టీ తీసుకున్న నిర్ణయాలలో తప్పని అంటున్నారు.

లోక్ సభ ఎన్నికల తేదీని ప్రకటించకముందే కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధులను ప్రకటించడం వ్యూహాత్మకంగా మంచిదే అయినా అభ్యర్థుల ఎంపిక మాత్రం ముందే ఓటమిని అంగీకరించినట్లు గా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News