అమ్మాయిల పొట్టి దుస్తులపై పోలీసుల ఆంక్షలు... తీవ్ర విమర్శలు

న్యూఇయర్‌ వేడుకల సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. అకతాయిలు రెచ్చిపోయే అవకాశం ఉండడంతో వారి ఆట కట్టించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన కూడళ్ళలో నిఘా ఏర్పాటు చేస్తున్నారు. వడోదర పోలీసులు మరో అడుగు ముందుకేశారు. మహిళల భద్రతపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్టు ప్రకటించారు. అదే సమయంలో అమ్మాయిలకు కొన్ని ప్రత్యేక సూచనలు చేశారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా బయటకు వచ్చే మహిళలు, అమ్మాయిలు పొట్టిదుస్తులు వేసుకోవద్దని […]

Advertisement
Update: 2018-12-27 00:56 GMT

న్యూఇయర్‌ వేడుకల సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. అకతాయిలు రెచ్చిపోయే అవకాశం ఉండడంతో వారి ఆట కట్టించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన కూడళ్ళలో నిఘా ఏర్పాటు చేస్తున్నారు.

వడోదర పోలీసులు మరో అడుగు ముందుకేశారు. మహిళల భద్రతపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్టు ప్రకటించారు. అదే సమయంలో అమ్మాయిలకు కొన్ని ప్రత్యేక సూచనలు చేశారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా బయటకు వచ్చే మహిళలు, అమ్మాయిలు పొట్టిదుస్తులు వేసుకోవద్దని ఆంక్షలు విధించారు. శాంతిభద్రతలకు, నేరాలకు వీలు కల్పించే పనులు చేయవద్దని వడోదర పోలీస్ కమిషనర్ అనుపమ్‌ సూచించారు. పొట్టి దుస్తులేసుకుని రోడ్ల మీదకు రావడాన్ని అనుమతించబోమని ప్రకటించారు.

పరిస్థితులను అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మద్యం సేవించి డ్రైవ్ చేయడం, అతిగా ప్రవర్తించడం వంటి చర్యలను సహించబోమని ప్రకటించారు. న్యూఇయర్ వేడుకలు నిర్వహించే చోట నిర్వాహకులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని… అశ్లీల నృత్యాలు చేయిస్తే కఠిన చర్యలు తప్పవని వడోదర పోలీసులు హెచ్చరించారు. న్యూఇయర్ వేడుకల్లో లౌడ్ స్పీకర్లను కూడా పోలీసులు నిషేధించారు.

అయితే మహిళలు పొట్టి దుస్తులు ధరించి బయటకు రావడానికి వీల్లేదంటూ పోలీసులు జారీ చేసిన మార్గదర్శకాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మహిళలు ఏ బట్టలు వేసుకోవాలో చెప్పే అధికారం పోలీసులకు ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు. పురుషులపై లేని ఆంక్షలు ఒక్క మహిళలపై మాత్రమే ఎందుకని అడుగుతున్నారు. కొత్త ఏడాది మొదటి రోజుకు మహిళలు ఆంక్షల నడుమ స్వాగతం పలకాలా అని ప్రశ్నిస్తున్నారు. వెంటనే పోలీసులు వివాదాస్పద మార్గదర్శకాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News