శబరిమలపై అవకాశవాద రాజకీయాలు 

శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల వయసున్న ఆడవాళ్లు ప్రవేశించకూడదన్న వివాదం కేరళ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ ఉంది. ఈ వివాదంలో న్యాయవ్యవస్థ, అధికారంలో ఉన్న వివిధ ప్రభుత్వాలు, మతాధిపతులు, సామాజిక-మతవర్గాల నాయకులు, అన్ని వయసులకు చెందిన భక్తులు – ఇలా అందరికీ ప్రమేయం ఉంది. అయితే ఈ చర్చలో భాగస్వాములైనవారు అందరూ ఒకే రకమైనవాళ్లు కాదు. ఈ అంశంపై ఎవరి అభిప్రాయాలు వాళ్లకు ఉన్నాయి. వివిధ అభిప్రాయాల్లో తేడాలు ఉన్నందువల్ల రాజకీయ అభిప్రాయాల్లో తేడాలు […]

Advertisement
Update: 2018-10-15 08:25 GMT

శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల వయసున్న ఆడవాళ్లు ప్రవేశించకూడదన్న వివాదం కేరళ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ ఉంది. ఈ వివాదంలో న్యాయవ్యవస్థ, అధికారంలో ఉన్న వివిధ ప్రభుత్వాలు, మతాధిపతులు, సామాజిక-మతవర్గాల నాయకులు, అన్ని వయసులకు చెందిన భక్తులు – ఇలా అందరికీ ప్రమేయం ఉంది.

అయితే ఈ చర్చలో భాగస్వాములైనవారు అందరూ ఒకే రకమైనవాళ్లు కాదు. ఈ అంశంపై ఎవరి అభిప్రాయాలు వాళ్లకు ఉన్నాయి. వివిధ అభిప్రాయాల్లో తేడాలు ఉన్నందువల్ల రాజకీయ అభిప్రాయాల్లో తేడాలు మరింత పెద్దవైనాయి. 2018 సెప్టెంబర్ చివరలో శబరిమల వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత భిన్నాభిప్రాయాలు మరింత పెరిగాయి. రుతు స్రావం జరిగే వయసులో ఉన్న ఆడవాళ్లు ఆలయంలో ప్రవేశించకూడదన్న నిషేధాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది.

అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు బెంచీలో నలుగురి తీర్పు ఒక రకంగానూ, ఒక్కరి తీర్పు భిన్నంగానూ ఉంది. ఒకే రకమైన తీర్పు చెప్పిన నలుగురు న్యాయమూర్తులు మగవారే. “రాజ్యాంగ నైతికత” పాటించాలని, “భక్తిభావంలో తేడాలు” ఉండకూడదని, “మత వ్యవహారంలో పితృస్వామ్య భావజాలం” ఉండకూడదని అభిప్రాయపడ్డారు.

ఈ బెంచీలో ఉన్న ఒకే ఒక మహిళా న్యాయమూర్తి భిన్నమైన తీర్పు చెప్పారు. “మత సంబంధ వ్యవహారాల్లో హేతువాద భావాలకు చోటు లేదు” అని ఆమె అన్నారు. స్త్రీపురుష సమానత్వానికి పట్టం కట్టిన ఈ తీర్పును దేశంలో చాలా మంది ఆహ్వానించారు. అయితే కేరళలోని మహిళలు వీధులకెక్కి ఈ తీర్పుపట్ల నిరసన వ్యక్తం చేశారు. ఈ తీర్పువల్ల మత వ్యవహారాల్లో రాజ్యవ్యవస్థ జోక్యం పెరుగుతుందని తీర్పును వ్యతిరేకిస్తున్నవారు అంటారు. అనేక మతాలు ఉన్న భారత్ లాంటి దేశంలో ఇలాంటి భయం ఉండడం సహజమే. కానీ కేరళలోని ఈ దేవాలయ వ్యవహారం, ఇతర దేవాలయాల అంశం దేశంలోని మిగతా పుణ్యక్షేత్రాల పరిస్థితికన్నా భిన్నమైంది.

శబరిమల ఆలయంతో సహా కేరళలోని 1,700 ఆలయాల నిర్వహణ ప్రభుత్వ అధీనంలో ఉంది. దేవస్వోం వ్యవహారాల మంత్రి, ప్రాంతీయ దేవస్థానాల బోర్డులు, దేవస్థానాల వ్యవహారాలు చూసే బోర్డుల కార్యకలాపాలను పర్యవేక్షించే హైకోర్టు మొదలైన వ్యవస్థలన్నింటి ప్రమేయం ఉంటుంది.

స్థానిక కులీన వర్గాలు, రాజకీయ అధికారం ఉన్నవారు ఆలయాల విషయంలో ప్రమేయం కలిగి ఉండడం దక్షిణాది దేవాలయాల విషయంలో మామూలే. ఈ వ్యవహారాలను సంస్థానాల నుంచి వలసవాదులకు బదలాయించిన తర్వాత, చివరకు భారత గణతంత్రానికి అప్పగించిన తర్వాత దక్షిణా భారతంలో రాజ్యవ్యవస్థ ఆలయాలను పర్యవేక్షించడం పెరిగింది. కేరళలో ఇది మరింత ఎక్కువ. అంటే శబరిమల ఆలయంలో పాలకుల జోక్యం 1950నాటి ట్రావన్ కోర్-కొచ్చొన్ హిందూ మత సంస్థల చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచే పాలకుల జోక్యం ఉంది. ట్రావన్ కోర్ రాయల్ దేవస్వోం కమిషన్ నుంచి చట్టబద్ధమైన ట్రావన్ కోర్ దేవస్వోం బోర్డుకు బదిలీ అయింది.

శబరిమల ఆలయ వివాదం వల్ల రేగిన దుమారంలో “1965నాటి కేరళ హిందూ ఆరాధనా వ్యవస్థల (ప్రవేశార్హత) నిబంధనలు రూపిందించింది కేరళ శాసన సభ అన్న విషయం మరచిపోతున్నారు. అంటే ట్రావన్ కోర్ దేవస్వోం బోర్డు రుతు క్రమ దశలో ఉన్న ఆడవారిని గర్భ గుడిలోకి ప్రవేశించడంపై నిషేధం విధించింది కాని ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించడంపై ఆంక్షలు పెట్టలేదు. అసలే ఆలయ ప్రాంగణంలోకే ఆడవారిని రానివ్వకుండా నిషేధించింది రాష్ట్ర శాసనసభ.

ఈ నియమాన్ని శబరిమలకు భక్తులు ఎక్కువగా వచ్చే నవంబర్, డిసెంబర్ నెలల్లో, విషు ఉత్సవాలప్పుడు కచ్చితంగా పాటించేవారు. 1990లో ఒక భక్తుడు ప్రముఖ మహిళల విషయంలో ఈ నియమాన్ని ఉల్లంఘిస్తున్నారని హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. ఆ భక్తుడి అభ్యంతరాన్ని హైకోర్టు ఆమోదించి ఆడవాళ్ల ప్రవేశాన్ని ఏకమొత్తంగా నిషేధించింది. ఆ తర్వాత మహిళలు ఆలయం సందర్శించాలంటే వయసు ఎంతో నిదర్శనాలు చూపవలసిన పద్ధతి వచ్చింది.

ఈ నిషేధంపై కొంత మంది 2006లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో తన వైఖరి అనేక సార్లు మారుస్తూ వచ్చింది. 2006లో సుప్రీంకోర్టులో అర్జీ దాఖలైనప్పుడు, ప్రస్తుతం కూడా అధికారంలో ఉన్న వామపక్ష ఫ్రంట్ ప్రభుత్వం మహిళల ఆలయ ప్రవేశంపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూనే వస్తోంది.

కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రభుత్వం నిషేధాన్ని సమర్థించింది. ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పువల్ల ఈ సయ్యాటలకు తెరపడింది కాని వీధుల్లోకి వచ్చి మహిళల ఆలయ ప్రవేశాన్ని వ్యతిరేకిస్తున్నవారు ఎక్కువయ్యారు. ఈ ఉద్యమాలకు కొన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉంది. సి.పి.ఐ.(ఎం) తన వాదనకు ఇప్పటికీ కట్టుబడి ఉంది. ట్రావన్ కోర్ దేవస్వోం బోర్డు కూడా మద్దతు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.

కేరళలో ప్రాబల్యం ఉన్న నాయర్ల ఓట్ల కోసం కాంగ్రెస్, బీజేపీ సుప్రీంకోర్టు తీర్పును పునః సమీక్షించాలని కోరుతున్నాయి. కేరళలో ఆలయాల నిర్వహణ బాధ్యత పాలకుల చేతిలో ఉన్నప్పటికీ శాసనసభ ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిషేధించడంపై కలగ జేసుకోవడం అనవసరం. మహిళల ప్రవేశాన్ని నిషేధించే చట్టం రాజ్యాంగ నైతికతకు విరుద్ధమైంది. అత్యున్నత న్యాయస్థానం సైతం ఇదే అంశాన్ని గుర్తు చేసింది.

భారత్ లో సెక్యులరిజం అంటే రాజ్య వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోవడం. కాని మన దేశంలో చాలా వివాదాలు మతం చుట్టే తిరుగుతాయి. దీనికి ఆజ్యం పోసింది రాజకీయ పార్టీలు, వాటికి మద్దతు ఇచ్చే సంస్థలే. వివిధ సందర్భాలలో ప్రజాభిప్రాయలను సమీకరించి, లబ్ధి పొందడం కోసం అనేక అంశాలను రెచ్చగొట్టారు. 1985లో షా బానో కేసు, ఇటీవల 2017లో ముమ్మారు తలాఖ్ కేసులు ఇలా రెచ్చగొట్టినవే. ముమ్మారు తలాఖ్ విషయంలోనూ శబరిమల కేసులోనూ రాజకీయ పక్షాలు అనుసరిస్తున్న పరస్పర విరుద్ధ వైఖరులు అవకాశవాదానికి పరాకాష్ఠ.

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

Tags:    
Advertisement

Similar News