బాబు డైలాగ్‌ వల్లే వర్షాలు ఆగిపోయాయా?... అనంత రైతుల్లో ఆసక్తికర చర్చ

నమ్మకమో లేక మూడ నమ్మకమో గానీ ముఖ్యమంత్రులను బట్టి వర్షాలు పడుతాయన్న చర్చ తెలుగు రాష్ట్రాల్లో చాలా కాలంగా ఉంది. వైఎస్‌ హయాంలో వర్షాలు బాగా పడడంతో అప్పటి కాంగ్రెస్ నేతలు వరుణ దేవుడు తమ పార్టీలో చేరారని చెప్పుకునే వారు. దురదృష్టం కొద్దీ చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో మాత్రం ఎక్కువ కాలం అతివృష్టి లేదంటే అనావృష్టి రాష్ట్రాన్ని వెంటాడుతోంది. అయితే ఈ ఏడాది తొలినాళ్లలో వర్షాలు బాగానే పడ్డాయి. ముఖ్యంగా కరువు పరిస్థితి తీవ్రంగా […]

Advertisement
Update: 2016-08-25 01:04 GMT

నమ్మకమో లేక మూడ నమ్మకమో గానీ ముఖ్యమంత్రులను బట్టి వర్షాలు పడుతాయన్న చర్చ తెలుగు రాష్ట్రాల్లో చాలా కాలంగా ఉంది. వైఎస్‌ హయాంలో వర్షాలు బాగా పడడంతో అప్పటి కాంగ్రెస్ నేతలు వరుణ దేవుడు తమ పార్టీలో చేరారని చెప్పుకునే వారు. దురదృష్టం కొద్దీ చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో మాత్రం ఎక్కువ కాలం అతివృష్టి లేదంటే అనావృష్టి రాష్ట్రాన్ని వెంటాడుతోంది. అయితే ఈ ఏడాది తొలినాళ్లలో వర్షాలు బాగానే పడ్డాయి. ముఖ్యంగా కరువు పరిస్థితి తీవ్రంగా ఉండే అనంతపురం జిల్లాలోనూ వర్షాలు బాగానే పడ్డాయి. దీంతో రైతులంతా విస్తారంగా వేరుశెనగ సాగు చేశారు. అయితే గత నెల రోజులుగా అనంతపురం జిల్లాలో వర్షాలు పడడం లేదు. వేరుశెనగ పంట దాదాపు ఎండిపోయే స్థితికి చేరింది. ఇక్కడే కొందరు రైతుల మధ్య ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

అదేంటంటే… ఈనెల మొదటి వారంలో సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లా ధర్మవరం వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన… ”గతంలో చూశాం. ఒక సారి వర్షాలు వచ్చేవి, మరొకసారి వచ్చేవి కాదు. పంటలు ఎండిపోయేవి, అందుకే దినానికి లక్ష ఎకరాలకు నీరు అందించేలా రెయిన్ గన్స్ తెచ్చాం. దీంతో వరుణ దేవుడు మమ్మల్ని చూసి భయపడ్డాడు. అందుకే సకాలంలో వర్షాలు కురిపిస్తున్నాడు. ఒకవేళ కురిపించకపోయినా సరే నేను పంటలు ఎండిపోకుండా కాపాడుతా” అంటూ వరుణదేవుడి గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అప్పుడే అందరూ ఆశ్చర్యపోయారు.

గతంలో వర్షాలు బాగా పడితే వరుణ దేవుడు తన పార్టీలో చేరాడని కాంగ్రెస్ నేతలు పాజిటివ్‌గా ప్రచారం చేసుకునేవారు. చంద్రబాబు మాత్రం వరుణ దేవుడు తాముతెచ్చిన రెయిన్ గన్స్‌కు భయపడి వర్షాలు కురిపిస్తున్నాడంటూ వరుణదేవుడినే భయపట్టేలా మాట్లాడారు. ఇప్పుడు అనంత రైతులు కూడా ఈ వ్యాఖ్యలనే ప్రస్తావించుకుంటున్నారు. తన దెబ్బకు వరుణ దేవుడు భయపడ్డాడని చంద్రబాబు అనే సరికి వర్షాలు ఆగిపోయాయంటూ రైతులు సెటైర్లు వేస్తున్నారు. వర్షాలు సకాలంలో పడకపోయినా రెయిన్ గన్స్‌తో పంటలుకాపాడుతా అన్న చంద్రబాబు వ్యాఖ్యలతో వరుణ దేవుడికి కోపం వచ్చి అలిగి వెళ్లిపోయినట్టుగా ఉందంటున్నారు.

అయినా చంద్రబాబు అత్యుత్సాహం కాకపోతే వరుణ దేవుడు చంద్రబాబు రెయిన్‌ గన్స్ చూసి భయపడడం ఏమిటి?. అసలు వర్షాలే లేకుంటే నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి… రెయిన్స్ గన్స్‌తో ఫైర్ చేయడానికి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి. ఏంటో ఈ వానాకాలం రాజకీయాలు. ఈ మాటలు ఎలా ఉన్నా వర్షాలు పడితే అదే చాలు.

Click on Image to Read:

 

 

 

 

Tags:    
Advertisement

Similar News