తూటాలు కశ్మీర్ జ్వాలలను ఆర్పలేవు

ఇవ్వాల్టికి సరిగ్గా పదిహేను రోజులైంది. కశ్మీర్ ఇంకా భగ్గుమంటూనే ఉంది. కశ్మీర్ లోని పదిహేను జిల్లాల్లో నిరంతరంగా కర్ ఫ్యూ అమలులోనే ఉన్నా నిరసన జ్వాలలు చల్లారడం లేదు. భద్రతా దళాల తూటాలను లెక్క చేయకుండా అనేక చోట్ల ప్రజలు వీధుల్లోకి వచ్చి వివిధ పద్ధతుల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాళ్లు రువ్వుతున్నారు. భద్రతా దళాల తూటాలకు బలవుతున్నారు. తీవ్రంగా గాయపడుతున్నారు. భద్రతా దళాల బాధ్యతా రహిత, అనాలోచిత కాల్పుల వల్ల కంటి చూపు కోల్పొతున్న వారు […]

Advertisement
Update: 2016-07-23 05:16 GMT

ఇవ్వాల్టికి సరిగ్గా పదిహేను రోజులైంది. కశ్మీర్ ఇంకా భగ్గుమంటూనే ఉంది. కశ్మీర్ లోని పదిహేను జిల్లాల్లో నిరంతరంగా కర్ ఫ్యూ అమలులోనే ఉన్నా నిరసన జ్వాలలు చల్లారడం లేదు. భద్రతా దళాల తూటాలను లెక్క చేయకుండా అనేక చోట్ల ప్రజలు వీధుల్లోకి వచ్చి వివిధ పద్ధతుల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాళ్లు రువ్వుతున్నారు. భద్రతా దళాల తూటాలకు బలవుతున్నారు. తీవ్రంగా గాయపడుతున్నారు. భద్రతా దళాల బాధ్యతా రహిత, అనాలోచిత కాల్పుల వల్ల కంటి చూపు కోల్పొతున్న వారు వందల సంఖ్యలో ఉన్నారు. ఇప్పటికి 45 మంది ప్రాణాలు పోగొట్టుకుంటే మరో 3000 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. విచిత్రం ఏమిటంటే తీవ్రవాదం చెలరేగిన రోజుల్లో కూడా ప్రశాంతంగా ఉన్న కశ్మీర్ లోయలోని దక్షిణప్రాంతాలు కూడా ఇప్పుడు భగ్గుమంటున్నాయి.

హిజ్బుల్ ముజహిదీన్ కమాండర్ బుర్హాన్ ముజఫ్ఫర్ వనీని, మరో ఇద్దరిని భద్రతా దళాల వారు జులై 8న మట్టుపెట్టినప్పటి నుంచి నిరసన జ్వాలలు చెలరేగాయి.ట్రాల్ అటవీ ప్రాంతం నుంచి బుర్హాన్ వనీ రంజాన్ వేడుకలకోసం అజ్ఞాతవాసం నుంచి బయటికి వస్తున్నాడన్న ఉప్పందడంతో భద్రతా దళాల వారు బుర్హాన్ ను, సర్తాజ్ అహమద్ షేక్, పర్వేజ్ అహమద్ లష్కరి అనే మరో ఇద్దరినీ మట్టుబెట్టారు. దీనితో స్థానిక ప్రజలు బందుఉరా గ్రామంలో వందల సంఖ్యలో గుమిగూడి నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల మీదికి రాళ్లు రువ్వారు. కొకెర్నాగ్ ప్రాంతంలోని బందూరా గ్రామం అమాంతం రణరంగంగా మారిపోయింది.

బుర్హాన్ కేవలం 22 ఏళ్ల ప్రాయం వాడే. 2010 అక్టోబర్ 16న 15వ ఏట బుర్హాన్ ఇల్లు విడిచి వెళ్లి మిలిటెంటుగా మారిపోయాడు. అతని తీవ్రవాద కార్యకలాపాల గురించి, విధ్వంసం గురించి పెద్దగా వివరాలేవీ అందుబాటులో లేవు. కాని సామాజిక మాధ్యమాలలో ఆయన ఆరితేరిన వ్యక్తి. ఆయన సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసే వీడియోలను చూసే వారు, ఆదరించే వారు, స్ఫూర్తి పొందే వారు అపారంగా ఉన్నారు. ఆయన “విద్రోహకర” కార్యకలాపాలు సామాజికమాధ్యమాలకు పరిమితమైనవే. బుర్హాన్ సోదరుడు ఖాలిద్ ముజఫ్ఫర్ వనీని 2015 ఏప్రిల్ 13న భారత సైనికులు అంతమొందించారు.

జులై 9న బుర్హాన్ వనీ అంత్యక్రియలకు కనీ విని ఎరగని రీతిలో 2,00,000 మంది హాజరయ్యారు. ఇది అతనికున్న ప్రజాదరణకు చిహ్నం. ఈ అంత్యక్రియలకు హిజ్బుల్ ముజహిదీన్ మిలిటెంట్లు హాజరు కావడమే కాదు 21 సార్లు గాలిలోకి తుపాకులు పేల్చి వనీకి వందనం అర్పించారు. ఈ పరిణామాన్ని భద్రతాదళాలు ఊహించినట్టు లేదు. బుర్హాన్ ను అంతమొందించిన తర్వాత సాధారణంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నిరసనలు వ్యక్తమయ్యే అనంత్ నాగ్, ట్రాల్, పుల్వామా పట్టణాల్లో వెంటనే నిరసన ఎగిసిపడలేదు. ఆ ప్రాంతాలలో భద్రతా దళాల వారు అలవాటుగా తగిన కట్టుదిట్టం చేయడమే దీనికి కారణం కావొచ్చు. ఈ ప్రాంతాలలో అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారూ ఎవరూ లేరు. కాని అనంత్ నాగ్ జిల్లాలోని సీర్ ప్రాంతం సాధారణంగా ప్రశాంతంగా ఉంటుంది. సీర్, కుల్గంలోని డి.హెచ్. పోర, హాల్ ప్రాంతంలోని పుల్వామాలో నిరసన విధ్వంసానికి దారి తీసింది. ఇతర సందర్భాలలో ప్రశాంతంగా ఉన్న సీర్ ప్రాంతంలో ఒక పౌరుడు మరణించాడు. డి.హెచ్.పోరా ప్రాంతంలో అధికారంలో ఉన్న పీడీపీ కి, నేషనల్ కాన్ఫరెన్స్ కు కూడా పట్టుంది. అక్కడా విధ్వంసం చెలరేగింది. ఊహించని చోట్లలో ఈ సారి జనాగ్రహ జ్వాలలు అగ్నిపర్వతం బద్దలైన రీతిలో పెల్లుబికాయి.

కశ్మీర్ లో తీవ్రవాదం ఎంత విపరీతంగా ఉన్నా కశ్మీరీ పండితుల మీద దాడి జరగలేదు. కాని పుల్వామాలో కశ్మీరీ పండితుల మీద నిరసనకారులు విరుచుకుపడి నిర్మానుష్యంగా ఉన్న రెండు ఇళ్లను దగ్ధం చేశారు. 2008, 2010లో తీవ్రవాదం పంజా విసిరినప్పుడు కూడా మైనారిటీల మీద దాడులు జరగలేదని పుల్వామాలోని పీడీపీ నాయకుడే అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కశ్మీరీ పండితులకోసం ప్రత్యేక వాడలు నిర్మించాలని ప్రయత్నిస్తోంది. స్థానిక ముస్లింలు, వేర్పాటు వాదులు కూడా ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వనీని మట్టుబెట్టిన తర్వాత ప్రజాగ్రహం కశ్మీరీ పండితుల మీదకు మళ్లడం కశ్మీర్ లో అదనపు సమస్య తలెత్తుతోందనడానికి సంకేతం.

అల్లకల్లోల పరిస్థితి ఏర్పడి పక్షం రోజులు గడుస్తున్నా ప్రభుత్వం పరిస్థిని అదుపులో పెట్టడంలో విఫలమైంది. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి చర్య పరిస్థితి మరింత విషమించడానికే దోహదం చేస్తోంది. మొబైల్ ఫోన్లు పని చేయకుండా చేయడం, పత్రికలు వెలువడకుండా చేయడం, అంతర్జాల సదుపాయాలు పరిహరించడం లాంటివి జనాగ్రహాన్ని ఇనుమడింప చేయడానికి మాత్రమే ఉపయోగపడ్డాయి. ఒకప్పుడు తీవ్రవాదానికి అనుకూలంగా వ్యవహరించిన ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ నిస్సహాయ స్థితిలో పడిపోయారు. కేంద్రప్రభుత్వం రొడ్డ కొట్టుడు విధానాలకు పరిమితమై పోయి ఈ అల్లర్లకు పాకిస్తానే కారణమని అరోపించి విచ్చలవిడి బలప్రయోగానికి పాల్పడుతోంది.

కాశ్మీర్ లో అదును దొరికినప్పుడల్లా నిప్పు కణికలు రాజేయడానికి పాకిస్తాన్ ఏ అవకాశాన్ని వదులుకోదనడంలో అనుమానం అక్కర్లేదు. కాని ఈ మధ్య కాలంలో “స్వదేశీ తీవ్రవాదం” పురి విప్పి విలయనర్తనం చేస్తోందన్న వాస్తవాన్ని అంగీకరించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. కశ్మీర్ అంటే అక్కడి భూభాగమే అన్న రీతిలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వ్యవహరిస్తోంది. కశ్మీర్ మనదేనని వాదించడంలో అత్యుత్సాహం ప్రదర్శించే బీజేపీ కశ్మీర్ ప్రజలను మనవాళ్లుగా భావిస్తున్న దాఖలాలు మాత్రం లేవు. తాజా పరిణామాలు ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం, కడకు మహబూబా ముఫ్తీ నాయకత్వంలోని పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కూడా వాస్తవలాను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం బలప్రయోగంతో, సాయుధ శక్తితో పరిస్థితిని చక్కబెట్టొచ్చునన్న భ్రమల్లో ఉన్నాయి. అది వృధా ప్రయాస అని పదిహేను రోజుల నుంచి ఎదురవుతున్న పరిస్థితే రుజువు చేస్తోంది.

కశ్మీర్ లో ఇప్పుడు పురివిప్పిన తీవ్రవాదం పూర్తిగా స్వదేశీయమైంది. బుర్హాన్ వనీ ఈ రకం తీవ్రవాదానికి ప్రతినిధి. ఇంకా పసితనం పూర్తిగా వీడని బుర్హాన్ జీవితకాలంలోనే ప్రభుత్వ వ్యక్తిరేక అభిప్రాయాలున్న వారికి ఆరాధ్యుడై పోయాడు. ఈ వాస్తవాన్ని గుర్తించడానికి మోదీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. పరిస్థితిని కట్టడి చేయడంలో భద్రతా దళాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఆందోళనకారులను అదుపు చేయడంలో సకల నియమాలను ఉల్లంఘించి సొంత ప్రజలమీదే కత్తిగట్టినట్టు వ్యవహరిస్తూ ప్రజల ఆగ్రహానికి ఆజ్యం పోస్తున్నాయి.

2010లో ఇలాంటి పరిస్థితే ఎదురైనప్పుడు భద్రతా దళాలు ఇంత కసితో వ్యవహరించలేదు. అప్పుడు జన నష్టం ఇంతకన్నా ఎక్కువ అయిన మాట వాస్తవమే కాని పరిస్థితిని అదుపు చేయడానికి ప్రస్తుతం ఏ కోశాన కనిపించని రాజకీయ సమీకరణ అప్పుడుంది. ఇప్పుడది పూజ్యం. ప్రస్తుతం భద్రతా దళాలు జన నష్టాన్ని వీలైనంత తగ్గించే ప్రయత్నం చేస్తున్న జాడలే లేవు. కశ్మీర్ పరిస్థితిని ఎదుర్కోవడంలో గతానుభవాలనుంచి ప్రస్తుత కేంద్రప్రభుత్వం గుణపాఠాలు నేర్చుకుంటున్న జాడలే కనిపించడం లేదు. దీనితో నిరసన జ్వాలలు మరింత చెలరేగుతున్నాయి. ఆగ్రహోదగ్రులైన యువకులు ప్రభుత్వ చిహ్నాల మీద విరుచుకుపడుతున్నారు. కేవల బలప్రయోగంతో జనాగ్రహాన్ని చల్లార్చలేమన్న ఇంగితజ్ఞానం పాలకులలో ఇసుమంత కూడా కనిపించడం లేదు.

వివిధ ప్రసార మాధ్యమాల మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆంక్షలు విధించడం వల్ల నిరసన చల్లారదని ప్రభుత్వం గమనించడం లేదు. ఈ ఆంక్షల వల్ల తీవ్రవాదాన్ని వ్యతిరేకించే వారి నోళ్లు కూడా అనివార్యంగా మూతపడతాయి. పడికట్టు పదాలు జనానికి విశ్వాసం కలిగించవు. పాకిస్తాన్ మీద నిందలు, ఆరోపణలు ఎవరినీ నమ్మించలేవు. కావాల్సింది రాజకీయ పరిష్కారం. ఆ దిశగా మోదీ సర్కారు ప్రయత్నిస్తున్న దాఖలాలే లేవు. ఉంటాయని అనుకోవడానికి మోదీ కనీసం అటల్ బిహారీ వాజపేయి కూడా కాదుగా!

ఆర్వీ రామారావ్

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News