గొంతు నొక్కే ప్రయత్నం: విపక్షాల ఉమ్మడి గళం

ప్రజల పక్షాన ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్‌ నాయకుడు కె.జానారెడ్డి ఆరోపించారు. రుణమాఫీపై ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వలేదని, సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్‌ చేయడం అన్యాయమని ఆయన అన్నారు. నిబంధనలు పాటించకుండా రైతుల ఘోష వినిపిస్తుంటే ఇలా సస్పెండ్‌ చేయడం అన్యాయమని ఆయన అన్నారు. చరిత్రలో ఇలాంటి సంఘటన ఎన్నడూ జరగలేదని జానారెడ్డి దుయ్యబట్టారు. ఈ విషయాలన్నీ గవర్నర్‌కు తెలియజేయాలని భావించినా ఆయన […]

Advertisement
Update: 2015-10-05 00:17 GMT

ప్రజల పక్షాన ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్‌ నాయకుడు కె.జానారెడ్డి ఆరోపించారు. రుణమాఫీపై ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వలేదని, సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్‌ చేయడం అన్యాయమని ఆయన అన్నారు. నిబంధనలు పాటించకుండా రైతుల ఘోష వినిపిస్తుంటే ఇలా సస్పెండ్‌ చేయడం అన్యాయమని ఆయన అన్నారు. చరిత్రలో ఇలాంటి సంఘటన ఎన్నడూ జరగలేదని జానారెడ్డి దుయ్యబట్టారు. ఈ విషయాలన్నీ గవర్నర్‌కు తెలియజేయాలని భావించినా ఆయన అందుబాటులో లేకపోవడంతో ప్రజల మధ్యలోనే ఈ ప్రభుత్వంతో తేల్చుకోవాలని నిర్ణయించినట్టు జానారెడ్డి తెలిపారు. రైతులంతా ఒకే రకమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ఇది ప్రభుత్వం గమనించడం లేదని ఆయన అన్నారు. తమ సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కోరే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. జనంలోనే తేల్చుకుంటాం… ఒకవేళ రైతు రుణమాఫీకి ప్రభుత్వం ప్రకటన చేస్తే సస్పెన్షన్‌ ఎత్తి వేయాల్సిందిగా తామే ప్రభుత్వానికి విన్నవించుకుంటామని జానారెడ్డి తెలిపారు.

నీటిపారుదల ప్రాజెక్టులకు 25 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు చెబుతున్నారని, ఇంత పెద్ద మొత్తం ఖర్చు పెట్టదలచుకున్నప్పుడు రైతుల పట్ల ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్‌ నాయకుడు చిన్నారెడ్డి ప్రశ్నించారు. సభ నుంచి సస్పెండైన తర్వాత మాట్లాడుతూ… విపక్షాలన్నీ రైతుల పక్షాన నిలబడి పోరాడతామని, రైతు ఆత్మహత్యలు ఆగాల్సిందేనని, దీనికి తాము తెలుగుదేశం, వామపక్షాలు, బీజేపీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలన్నింటితోను కలిసి పని చేస్తామని ఆయన తెలిపారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని ఆయన అన్నారు.
అన్ని రాజకీయ పక్షాలని సస్పెండ్‌ చేసి సభ నిర్వహించుకోవడం ఈ ప్రభుత్వానికే చెల్లిందని బీజేపీ సభ్యుడు చింతల విమర్శించారు. అసెంబ్లీ నుంచి సస్పెండైన ఆయన బయట మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ విత్తనాలు, విద్యుత్‌, ఎరువులు, పురుగుమందులు వంటి అంశాలపైన, ఆత్మహత్య చేసుకున్న బాధిత రైతు కుటుంబాలకు ఎలాంటి హామీ ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. గతవారం సభ నిర్వహించిన సమయంలోనే అనుచితంగా ప్రభుత్వం వ్యవహరించి, సభను అర్దాంతరంగా వాయిదా వేసి రైతుల చర్చను అసంపూర్తిగా మిగిల్చి ప్రభుత్వం తప్పించుకుపోయిందని, ఇపుడు మళ్లీ పూర్తిగా తమను సభనుంచి బయటకు పంపించేసి రైతుల పట్ల ప్రభుత్వానికున్న చిత్తశుద్ధి తెలిసేలా చేసిందని ఆయన అన్నారు.

ఇది చీకటి రోజని బీజేపీ సభ్యుడు లక్ష్మణ్‌ అన్నారు. ఈసభ తాము చెప్పినట్టుగానే జరగాలని ప్రభుత్వం భావిస్తుందని, చర్చ చేయకుండానే ప్రభుత్వం దొంగ నాటకాలాడుతోందని, రైతుల ఆత్మహత్యల నిరోధానికి ఎలాంటి చర్యలు తీసుకోకుండానే నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. విపక్షాలన్నీ కలిసి ఒకే డిమాండు చేసినప్పటికీ స్పీకర్‌ దాన్ని అనుమతించకపోవడం ప్రతిపక్షాన్ని బుల్‌డోజ్‌ చేసే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందని, ప్రజా క్షేత్రంలోనే ఈ ప్రభుత్వవైఖరిని తేటతెల్లం చేస్తామని ఆయన అన్నారు.
రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఇది చాలా దారుణమైన చర్యని, మామాఅల్లుళ్ళు ఇద్దరూ శాసనసభలో విపక్షాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. విపక్షాల పట్ల ఏ మాత్రం గౌరవం లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, 14 వందలపైగా రైతు కుటుంబాలకు పరిహారం అందజేయాలని, రుణ మాఫీని తక్షణం పూర్తి చేయాలని ఆయన డిమాండు చేశారు.
బీజేఎల్పీ కార్యాలయంలో విపక్ష సభ్యులంతా సమావేశమయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై వీరు చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి సభలో ఉన్నా సస్పెన్షన్‌కు గురికాని జానారెడ్డి కూడా హాజరయ్యారు. అన్ని నియోజకవర్గాల్లో ఉద్యమం ప్రారంభించి ప్రభుత్వ దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలని నిర్ణయించారు. రైతులకు మేలు జరిగే వరకు పోరాటం కొనసాగించాలని విపక్షాలు నిర్వహించాయి.

Tags:    
Advertisement

Similar News