రాజీనామాపై నిర్ణయం స్పీకర్‌దే: తలసాని

తన రాజీనామా లేఖ స్పీకర్‌ పరిధిలో ఉందని, ఆయన తీసుకునే నిర్ణయాన్ని శిరసా వహిస్తానని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ స్పష్టం చేశారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు మంత్రిగా చేసిన తనకు ప్రజాస్వామ్య విలువలు ఏమిటో తెలుసునని, తనను విమర్శించేవారు వీటి గురించి తెలుసుకుంటే మంచిదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ అన్నారు. తనపై ఎవరు పోటీ చేసినా ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన సవాలు విసిరారు. మంగళవారం ఆయన […]

Advertisement
Update: 2015-07-21 05:57 GMT
తన రాజీనామా లేఖ స్పీకర్‌ పరిధిలో ఉందని, ఆయన తీసుకునే నిర్ణయాన్ని శిరసా వహిస్తానని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ స్పష్టం చేశారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు మంత్రిగా చేసిన తనకు ప్రజాస్వామ్య విలువలు ఏమిటో తెలుసునని, తనను విమర్శించేవారు వీటి గురించి తెలుసుకుంటే మంచిదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ అన్నారు. తనపై ఎవరు పోటీ చేసినా ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన సవాలు విసిరారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై విమర్శలు చేసే వారిని దుమ్మెత్తి పోశారు. తాను స్పీకర్‌కు రాజీనామా ఇవ్వలేదనడం నిజం కాదని, 2014 డిసెంబర్ 16న నేను రాజీనామా స్పీకర్‌గారికి ఇచ్చానని, అదే లేఖను మీకు కూడా ఇచ్చానని ఆయన తెలిపారు. రాజీనామాను ఆమోదించడానికి స్పీకర్‌కు ఓ పద్ధతి ఉంటుందని, రాజీనామా ఇచ్చిన వెంటనే ఆమోదించేస్తారా అని ఆయన ప్రశ్నించారు. స్పీకర్‌ కార్యాలయం మీ రాజీనామా లేఖ రాలేదని చెప్పింది కదా అన్న ప్రశ్నకు ఆయన ఒక్క క్షణం ఆలోచించి ఆ విషయం తనకు తెలీదన్నారు.
ఆర్టీఐ చట్టం కింద గండ్ర తీసుకున్న సమాచారాన్ని ప్రస్తావించిన విలేఖరులతో గండ్ర వెంకటరమణారెడ్డి వేషాలు తనకు తెలుసని, ఉస్మానియో కోఆపరేటివ్‌ సొసైటీ అనే పేరుతో ఎలాంటి మోసం చేశాడో అందరికీ తెలుసని ఆయన అన్నారు. తనపై ఆరోపణలు చేసిన వారందరి చరిత్ర తన దగ్గర ఉందని ఆయన హెచ్చరించారు. రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామిని కావాలనే ఉద్దేశంతో టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నానని, దీన్ని విమర్శించడంలో పని లేని వాళ్ళంతా పాల్గొంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై విమర్శలు చేసేవారు ముందు వారినివారు ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆయన అన్నారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే మంచిదని, లేకపోతే ఎవరి బండారం ఏమిటో బయట పెడతానని ఆయన హెచ్చరించారు.
కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఏ పార్టీ నుంచి గెలిచింది… నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఏ పార్టీ నుంచి గెలిచాడు… ఆయనకు ఎవరు కండువా కప్పారు? టీడీపీలో తిరుగుతున్న కొత్తపల్లి గీత ఎక్కడ నుంచి టీడీపీకి వెళ్ళింది అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సంగతి అందరికీ తెలిసిందేనని ఆయన అన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తికి తనను విమర్శించే స్థాయి ఉందా అని నిలదీశారు. ఆయనపై చర్య తీసుకోవలసిన అవసరం పార్టీ అధ్యక్షుడికి లేదా అంటూ రేవంత్‌రెడ్డిని పరోక్షంగా విమర్శించారు. టీడీపీకి ఆంధ్రాలో ఒక నీతి, తెలంగాణలో ఒక నీతి ఉంటుందా అని తలసాని ప్రశ్నించారు. అన్ని పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసి తనపై గెలవాలన్న ఆలోచన చేస్తున్నాయని, అది ఎవరికీ సాధ్యమయ్యే పని కాదని తెలుసుకుంటే మంచిదని ఆయన అన్నారు.
Tags:    
Advertisement

Similar News