లలిత్‌గేట్‌పై తొలిరోజే అట్టుడికిన రాజ్యసభ

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజునే రాజ్యసభ అట్టుడికింది. సభా కార్యకలాపాలు ప్రారంభమైన కొద్దిసేపటికే లలిత్‌మోడీ వివాదంపై చర్చించాలంటూ కాంగ్రెస్‌ ఎంపీలు నిరసనకు ఉపక్రమించారు. అధికార పార్టీ కంటే విపక్ష సభ్యులే ఎక్కువగా ఉన్న ఈ సభలో ప్రతిపక్షం అడుగడుగునా తన బలాన్ని చూపించే ప్రయత్నం చేసింది. లలిత్‌మోడీకి సహకరించిన విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌ రాజీనామా చెయ్యాలని ప్రతిపక్షం పట్టుబట్టింది. సుష్మతోపాటు లలిత్‌కు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న రాజస్థాన్‌ సీఎం వసుంధర రాజేపైనా విపక్షాలు విమర్శలు గుప్పించాయి. […]

Advertisement
Update: 2015-07-21 11:24 GMT

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజునే రాజ్యసభ అట్టుడికింది. సభా కార్యకలాపాలు ప్రారంభమైన కొద్దిసేపటికే లలిత్‌మోడీ వివాదంపై చర్చించాలంటూ కాంగ్రెస్‌ ఎంపీలు నిరసనకు ఉపక్రమించారు. అధికార పార్టీ కంటే విపక్ష సభ్యులే ఎక్కువగా ఉన్న ఈ సభలో ప్రతిపక్షం అడుగడుగునా తన బలాన్ని చూపించే ప్రయత్నం చేసింది. లలిత్‌మోడీకి సహకరించిన విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌ రాజీనామా చెయ్యాలని ప్రతిపక్షం పట్టుబట్టింది. సుష్మతోపాటు లలిత్‌కు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న రాజస్థాన్‌ సీఎం వసుంధర రాజేపైనా విపక్షాలు విమర్శలు గుప్పించాయి. కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ మాట్లాడుతూ లలిత్ మోడీని విచారించేందుకు ఆయన్ని భారత్‌కు రప్పించాలన్నారు. సభలోనే ఉన్న ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పందిస్తూ లలిత్‌గేట్ వ్యవహారంలో చర్చకు ప్రభుత్వం సిద్ధమని, ఈ విషయమై ప్రకటన చేసేందుకు మంత్రి సుష్మ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అధికార, విపక్షాల వాదోపవాదాల మధ్య సభలో గందరగోళం చోటు చేసుకోవడంతో తొలుత అర గంటపాటు డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సభను వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో రెండోసారి కూడా వాయిదా పడింది.
లోక్‌సభ కూడా వాయిదా
లోక్‌సభ సమావేశాలు బుధవారానికి వాయిదా పడ్డాయి. మంగళవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే ఇటీవల మరణించిన ఎంపీలకు లోక్‌సభ సంతాపం తెలిపింది. వరంగల్‌ ఎంపీ కడియం శ్రీహరి రాజీమానాను ఆమోదించినట్లు స్పీకర్‌ సుమిత్రామహాజన్‌ తెలిపారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.
అభివృద్ధికి కాంగ్రెస్‌ అడ్డుపుల్ల: వెంకయ్య
ప్రధానమంత్రి నరేంద్ర మోడి చేపడుతున్న అభివృద్ధి పథకాలను చూడలేక… ఓర్వలేక పార్లమెంటును స్తంభింపజేయడానికి కాంగ్రెస్‌ పూనుకుందని కేంద్రమంత్రి ఎం. వెంకయ్యనాయుడు ఆరోపించారు. మొదటిరోజే కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటులో వ్యవహరించిన తీరు చూస్తే సిగ్గు కలుగుతుందని ఆయన అన్నారు. మంగళవారం పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఏ అంశంపైనైనా నిబంధనల ప్రకారం చర్చకు సిద్ధమని చెప్పినా కాంగ్రెస్ ఎంపీలు సభను అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. బాధ్యతారహితంగా ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు. అంగుళం భూమి కూడా తీసుకోనివ్వమన్న కాంగ్రెస్ దేశంలో అంగుళం అభివృద్ధి జరగకూడదని కోరుకుంటున్నట్టు అర్దమవుతుందని, ప్రజలంతా దీన్ని అర్ధం చేసుకోవాలని వెంకయ్య విమర్శించారు. కాంగ్రెస్ నేతల చర్యలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ముఖ్యమైన బిల్లులను పాస్ చేయించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. ఏపీ విభజన చట్టం లోపభూయిష్టంగా ఉందని, ఇందులో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని వెంకయ్య చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం టీడీపీ నేతలు కోరినట్లు వెంకయ్య తెలిపారు. అయితే విభజన చట్టంలో మార్పుల అంశం ప్రభుత్వం పరిశీలనలో ఉందని వారికి వివరించినట్లు చెప్పారు.

Tags:    
Advertisement

Similar News