ఆర్టీసీ సమ్మెపై మరోసారి హైకోర్టు ఆగ్రహం
సమ్మె విరమించమని పదే పదే ఆదేశించినా చెవికెక్కనట్టు ప్రవర్తిస్తున్న ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం మరోరోజు గడువిస్తూ బుధవారం ఉదయం పదిన్నర గంటలకల్లా సమ్మె విరమించాలని ఆదేశించినా ఆర్టీసీ కార్మిక సంఘాలు పట్టించుకోకుండా ఉండడాన్ని తప్పు పట్టింది. బుధవారం విచారణ సందర్భంగా కార్మిక సంఘాల తరఫున న్యాయవాది మరో రోజు గడువు కావాలని కోరారు. అయితే ఇందుకు హైకోర్టు నిరాకరిస్తూ తక్షణం సమ్మె విరమించాలని ఆదేశించింది. ప్రజా ప్రయోజనాల […]
సమ్మె విరమించమని పదే పదే ఆదేశించినా చెవికెక్కనట్టు ప్రవర్తిస్తున్న ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం మరోరోజు గడువిస్తూ బుధవారం ఉదయం పదిన్నర గంటలకల్లా సమ్మె విరమించాలని ఆదేశించినా ఆర్టీసీ కార్మిక సంఘాలు పట్టించుకోకుండా ఉండడాన్ని తప్పు పట్టింది. బుధవారం విచారణ సందర్భంగా కార్మిక సంఘాల తరఫున న్యాయవాది మరో రోజు గడువు కావాలని కోరారు. అయితే ఇందుకు హైకోర్టు నిరాకరిస్తూ తక్షణం సమ్మె విరమించాలని ఆదేశించింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇది తక్షణావసరమని పేర్కొంది. గత ఎనిమిది రోజులుగా చేస్తున్న సమ్మెపై ఇప్పటికే మూడుసార్లు హైకోర్టు జోక్యం చేసుకుని తీర్పులిచ్చింది. చివరి గడువుగా బుధవారం ఉదయం వరకు ఇచ్చింది. అయినా సమ్మెను విరమించకుండా కార్మిక సంఘాలు పట్టుగా ఉండడంతో హైకోర్టు తీవ్రంగా స్పందించింది.
సమ్మె కొనసాగిస్తున్న కార్మికులపైన, ఉద్యోగుల పైన అత్యవసర సర్వీసుల చట్టం (ఎస్మా)ను ప్రయోగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. సెక్షన్ 12 ప్రకారం నోటీసులు జారీ చేయాలని కోరింది. సమ్మె విరమించిన వైఖరిని దృష్టిలో పెట్టుకుని అవసరమైతే ఉద్యోగుల నియామకాలను కూడా చేపట్టాలని ఆదేశించింది. తాము ఇచ్చిన ఆదేశాలను పాటించక కోర్టు ధిక్కారణకు పాల్పడిన వారిని అవసరమైతే జైలుకు పంపుతామని హెచ్చరించింది. సమ్మె దారికి వచ్చే దాకా పోలీసుల రక్షణతో బస్సులు నడపాలని ఇరు రాష్ట్రాల డీజీపీలను ఆదేశించింది. బస్సులను అడ్డుకున్న వారిపై క్రిమినల్ చర్యలు పెట్టాలని సూచించింది.
కాగా కార్మిక సంఘాల నాయకులు ఏపీ కేబినెట్ సబ్ కమిటీతో సమావేశమయ్యారు. ఇంకోవైపు ఆర్టీసీ బస్ భవన్‌ను ముట్టడించడానికి కొంతమంది కార్మికులు ప్రయత్నించగా వారందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.