Telugu Global
NEWS

బైబై మోదీ సర్.. గుడ్ మార్నింగ్ సీఎం సర్

ఇటీవల తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో బైబై మోదీ అనే హ్యాష్ ట్యాగ్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. హోర్డింగ్ లు, బ్యానర్లతో తెలంగాణలో మోదీకి తీవ్ర అవమానం జరిగింది. సోషల్ మీడియాలో పెట్టిన హ్యాష్ ట్యాగ్ లతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇప్పుడు అదే ప్లాన్ ఫాలో అవ్వాలనుకుంటున్నారు జనసైనికులు. ఏపీలో రోడ్ల దుస్థితిపై 'గుడ్ మార్నింగ్ సీఎం సార్' అనే హ్యాష్ ట్యాగ్ ని వైరల్ చేయాలనుకుంటున్నారు. ఇలా […]

బైబై మోదీ సర్.. గుడ్ మార్నింగ్ సీఎం సర్
X

ఇటీవల తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో బైబై మోదీ అనే హ్యాష్ ట్యాగ్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. హోర్డింగ్ లు, బ్యానర్లతో తెలంగాణలో మోదీకి తీవ్ర అవమానం జరిగింది. సోషల్ మీడియాలో పెట్టిన హ్యాష్ ట్యాగ్ లతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇప్పుడు అదే ప్లాన్ ఫాలో అవ్వాలనుకుంటున్నారు జనసైనికులు.

ఏపీలో రోడ్ల దుస్థితిపై 'గుడ్ మార్నింగ్ సీఎం సార్' అనే హ్యాష్ ట్యాగ్ ని వైరల్ చేయాలనుకుంటున్నారు. ఇలా ఈ హ్యాష్ ట్యాగ్ వైరల్ అయితే కచ్చితంగా దేశవ్యాప్తంగా ఇది చర్చకు వస్తుంది, ఏపీలో రోడ్లు ఎలా ఉన్నాయనే విషయం ఇతర రాష్ట్రాలవారు కూడా చూస్తారని, వైసీపీ ప్రభుత్వానికి ఇది కనువిప్పుగా మారుతుందనేది జనసేన ఆలోచన. సీఎంను నిద్రలేపేందుకే ఈ గుడ్ మార్నింగ్ అనే హ్యాష్ ట్యాగ్ ఉపయోగిస్తున్నామంటున్నారు జనసేన నేత నాదెండ్ల మనోహర్.

ఏపీలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయంటూ ఫొటోలతో సహా ప్రతిపక్ష మీడియా ప్రతి రోజూ వార్తలిస్తుంటుంది. అదే సమయంలో ప్రభుత్వ అనుకూల మీడియాలో రోడ్లకు మహర్దశ వచ్చిందని, గతంలో చంద్రబాబు రోడ్ల నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసినా, వైసీపీ హయాంలో ప్రతి గ్రామానికీ మంచి రోడ్లు పడుతున్నాయని, కావాలంటే ఈ ఉదాహరణలు చూడండి అంటూ నాడు-నేడు ఫొటోలు వేస్తూ హంగామా కనపడుతుంది.

ఇవి రెండూ వాస్తవాలే. కొన్నిచోట్ల రోడ్లు దారుణంగా ఉన్నాయి, మరికొన్నిచోట్ల మరమ్మతు పనులు మొదలయ్యాయి. అయితే ఇన్నాళ్లూ సమస్యలను అడపాదడపా సోషల్ మీడియాలో ప్రస్తావించిన జనసేన ఇప్పుడు డిజిటల్ యుద్ధానికి సిద్ధమైంది.

సోషల్ మీడియాలో రచ్చ చేస్తే కచ్చితంగా అది దేశవ్యాప్తంగా హైలైట్ అవుతుంది, ఏపీలో పరిస్థితి ఎలా ఉందో ఇతర రాష్ట్రాలకు తెలుస్తుంది. దీన్ని అవమానంగా భావిస్తే వెంటనే ఆయా రోడ్ల మరమ్మతు పనులు మొదలవుతాయి. ప్రభుత్వం లైట్ తీసుకుంటే మాత్రం ఇలాంటి డిజిటల్ క్యాంపెయిన్లతో ప్రయోజనం ఉండదు. కానీ జనసేన తన ప్రయత్నం మాత్రం మాననంటోంది.

ఈనెల 15, 16, 17 తేదీల్లో జరిగే డిజిటల్ క్యాంపెయిన్ లో పవన్ కల్యాణ్ కూడా పాల్గొంటారని చెబుతున్నారు. ఏపీలో పెట్రోల్ మీద ప్రతిఏటా సామాన్యుడి నుంచి రూ.750 కోట్లు రోడ్ సెస్ వసూలు చేస్తున్నారని.. ఆ సెస్ చూపించి రూ.6 వేల కోట్లు అప్పులు తెచ్చారని మండిపడ్డారు నాదెండ్ల మనోహర్. ముఖ్యమంత్రికి జవాబుదారీతనం ఉంటే ఆ నిధులను దేనికోసం ఖర్చు చేశారో వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

First Published:  12 July 2022 6:30 PM GMT
Next Story