Telugu Global

వరద బాధితులకు ఒక్కొక్కరికి రూ.2వేలు తక్షణ సాయం – సీఎం జగన్ ప్రకటన

రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ధవళేశ్వరం ప్రాజెక్టు నుంచి 13 లక్షల క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. మరోవైపు లంక గ్రామాలు నీటమునిగాయి. ప్రజలు మర బోట్ల ద్వారా బయటకు వెళ్లి నిత్యావసర సరుకులు తెచ్చుకుంటున్నారు. ఇదిలా ఉంటే వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి జగన్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. వరద […]

వరద బాధితులకు ఒక్కొక్కరికి రూ.2వేలు తక్షణ సాయం – సీఎం జగన్ ప్రకటన
X

రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ధవళేశ్వరం ప్రాజెక్టు నుంచి 13 లక్షల క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. మరోవైపు లంక గ్రామాలు నీటమునిగాయి. ప్రజలు మర బోట్ల ద్వారా బయటకు వెళ్లి నిత్యావసర సరుకులు తెచ్చుకుంటున్నారు.

ఇదిలా ఉంటే వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి జగన్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. వరద బాధితులను తక్షణమే సహాయశిబిరాలకు తరలించాలని.. వారు ఇంటికి వెళ్లేటప్పుడు తక్షణ సాయం కింద రూ. 2 వేలు అందజేయాలని సూచించారు.

Advertisement

గోదావరి ఉధృతి, వరద సహాయక చర్యలపై సీఎం జగన్‌ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. గోదావరికి ముందస్తుగానే వరదలు వచ్చాయని చెప్పారు. జులై మాసంలోనే 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చిందని, ఇప్పుడు రెండో ప్రమాద హెచ్చరిక నడుస్తోందన్నారు.

బుధవారం ఉదయానికి వరద పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. 16 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందన్న సీఎం జగన్‌.. దీనివల్ల తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు.

Advertisement

మహారాష్ట్రలో భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నదికి వరదలు కొనసాగే అవకాశం ఉందని, ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాల సహకారం తీసుకోవాలని.. వి.ఆర్‌.పురం, కూనవరం, అమలాపురం, వేలురుపాడుల్లో అధికారులకు సూచించారు. సహాయక శిబిరాలు వీలైనంత తొందరగా తెరవాలని ఆదేశించారు.

మంచి ఆహారం, తాగునీరు, ఇతర సౌకర్యాల ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని సూచించారు. అల్లూరి సీతారామరాజు, ఈస్ట్‌గోదావరి, ఏలూరు, అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల కలెక్టర్లకు రూ.2కోట్ల చొప్పున తక్షణ నిధులు ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు.

వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది, నర్సులు, ఇతర సిబ్బంది పూర్తిగా అందుబాటులో ఉండాలని సీఎం జగన్ సూచించారు. వర్షాకాలంలో రోగాలు ప్రబలే అవకాశం ఉండటంతో వైద్య సిబ్బంది ప్రజలకు తగిన వైద్య సహకారం అందించాలని కోరారు.

Next Story