Telugu Global
NEWS

వైసీపీ విషయంలో రాష్ట్ర బీజేపీని ఇరకాటంలో పెట్టిన అధిష్టానం

రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎన్టీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని తాము కోరలేదని, వైసీపీనే తమంతట తాము వచ్చి మద్దతు ఇచ్చిందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాము బీజేపీతో మంచి సంబంధాలు కలిగి ఉన్నామని ప్రజల్లో భ్రమలు పెంచేందుకు.. వైసీపీ నేతలు కేంద్ర మంత్రుల వెనక నిల్చొని ఫొటోలు దిగుతున్నారని కూడా తూలనాడారు. ఢిల్లీలో మాకు తోక పార్టీగా వ్యవహరిస్తూ.. రాష్ట్రంలో మాత్రం మరోలా మాట్లాడుతున్నారని […]

వైసీపీ విషయంలో రాష్ట్ర బీజేపీని ఇరకాటంలో పెట్టిన అధిష్టానం
X

రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎన్టీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని తాము కోరలేదని, వైసీపీనే తమంతట తాము వచ్చి మద్దతు ఇచ్చిందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

తాము బీజేపీతో మంచి సంబంధాలు కలిగి ఉన్నామని ప్రజల్లో భ్రమలు పెంచేందుకు.. వైసీపీ నేతలు కేంద్ర మంత్రుల వెనక నిల్చొని ఫొటోలు దిగుతున్నారని కూడా తూలనాడారు. ఢిల్లీలో మాకు తోక పార్టీగా వ్యవహరిస్తూ.. రాష్ట్రంలో మాత్రం మరోలా మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ మాకు అంటరాని పార్టీనే అంటూ దుయ్యబట్టారు. మ‌రుస‌టి రోజే బీజేసీ నేత స‌త్య‌కుమార్ వ్యాఖ్య‌ల‌ను అధిష్టానం ఖండించింది.

బీజేపీ జాతీయ కార్యదర్శి వై. సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలపై అధిష్టానం తీవ్రంగా మండిపడింది. సత్యకుమార్ వ్యాఖ్యలతో మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఎన్నికలో వైసీపీ మద్దతు తాము కోరలేదని సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని అన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో బీజేపీ అధిష్టానం వ్యక్తిగతంగా సంప్రదించి, మద్దతు కోరిందని.. ఆ తర్వాతే జగన్ బహిరంగంగా ప్రకటించారని చెప్పారు.

ద్రౌపది ముర్ము నామినేషన్ వేసిన సమయంలో ఆ పార్టీ పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి కూడా వచ్చి, సంతకాలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సత్యకుమార్ వ్యాఖ్యలను బేస్ చేసుకొని వైసీపీపై విరుచుకపడటానికి రాష్ట్ర బీజేపీ నేతలు రెడీ అయ్యారు. అయితే వారి ఆశలపై అధిష్టానం నీళ్లు చల్లింది.

కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వ్యాఖ్యలతో రాష్ట్ర బీజేపీ కూడా ఇరకాటంలో పడింది. వైసీపీని చులకన‌ చేయాలని ప్రయత్నించిన సత్యకుమార్‌కు కూడా భారీ క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తుంది. వైసీపీ మద్దతు లేకుంటే రాష్ట్రపతి ఎన్నికలో ఎన్టీయే తీవ్ర ఇబ్బంది పడేదనే విషయాన్ని కూడా అధిష్టానం గుర్తు చేస్తోంది.

కేంద్రంలోని బీజేపీ పెద్దలు, వైసీపీకి మధ్య మంచి బంధం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ చొరవతోనే బీజేపీ నాయకులు జగన్ మద్దతు కోరారు. మరోవైపు టీడీపీ మాత్రం స్వచ్ఛందంగా ఎన్టీయే అభ్యర్థి ముర్ముకు మద్దతు పలికింది. బీజేపీ నుంచి ఎలాంటి రిక్వెస్ట్ రాకపోయినా.. ఎన్టీయే అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు పేర్కొంది.

ఇది వైసీపీకి మంచి అస్త్రమనే అనుకోవచ్చు. తటస్థంగా ఉంటే బాగుండేదని.. అనవసరంగా మద్దతు ఇచ్చామని టీడీపీ నేతలు కూడా చర్చించుకుంటున్నారు. భవిష్యత్‌లో వైసీపీ దీన్ని కౌంటర్‌గా వాడుకునే అవకాశం ఉందని కూడా అనుమానిస్తున్నారు.

First Published:  12 July 2022 12:17 AM GMT
Next Story