Telugu Global
National

కోర్టు ధిక్కరణ కేసులో విజయ్ మాల్యాకు 4 నెలల జైలు.. సుప్రీంకోర్టు తీర్పు

లిక్కర్ బేరన్ విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు 4 నెలల జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ కేసులో ఈ శిక్షతో బాటు 2 వేల రూపాయల జరిమానా కూడా విధిస్తున్నట్టు పేర్కొంది. ఆయనకు తగినంత శిక్ష తప్పనిసరిగా వేయాలని, తన తప్పిదాలకు ఆయన ఇప్పటివరకు ఎలాంటి పశ్చాత్తాపం ప్రకటించలేదని న్యాయమూర్తులు జస్టిస్ లలిత్, ఎస్. రవీంద్ర భట్, పీ.ఎస్.నరసింహలతో కూడిన బెంచ్ నేడు వ్యాఖ్యానించింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి మాల్యా తన కుటుంబానికి మళ్లించిన 40 మిలియన్ […]

కోర్టు ధిక్కరణ కేసులో విజయ్ మాల్యాకు 4 నెలల జైలు.. సుప్రీంకోర్టు తీర్పు
X

లిక్కర్ బేరన్ విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు 4 నెలల జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ కేసులో ఈ శిక్షతో బాటు 2 వేల రూపాయల జరిమానా కూడా విధిస్తున్నట్టు పేర్కొంది. ఆయనకు తగినంత శిక్ష తప్పనిసరిగా వేయాలని, తన తప్పిదాలకు ఆయన ఇప్పటివరకు ఎలాంటి పశ్చాత్తాపం ప్రకటించలేదని న్యాయమూర్తులు జస్టిస్ లలిత్, ఎస్. రవీంద్ర భట్, పీ.ఎస్.నరసింహలతో కూడిన బెంచ్ నేడు వ్యాఖ్యానించింది.

కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి మాల్యా తన కుటుంబానికి మళ్లించిన 40 మిలియన్ డాలర్లను తిరిగి వాపసు చేయాలని కూడా వారు ఆదేశించారు. నాలుగు వారాల్లోగా వడ్డీతో సహా ఆయన ఈ సొమ్మును డిపాజిట్ చేయాలని, లేనిపక్షంలో ఆయన ఆస్తులను జప్తు చేయడం జరుగుతుందని అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది.

2017 లో మాల్యా.. కీలక సమాచారాన్ని కోర్టుకు తెలియజేయకుండా తొక్కిపట్టారని, ఇది కోర్టు ధిక్కరణే అవుతుందని, పైగా న్యాయస్థాన ఉత్తర్వులను అతిక్రమించి ఈ సొమ్మును ఆయన తన పిల్లలకు బదలాయించడం మరో ధిక్కారమవుతుందని న్యాయమూర్తులు పేర్కొన్నారు.

ఈ కేసులో కోర్టు తన తీర్పును గత మార్చి 10న రిజర్వ్ లో ఉంచింది. తనపై గల కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించి మాల్యా తన న్యాయవాది ద్వారా వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు సుప్రీంకోర్టు ఆయనకు గత ఫిబ్రవరి 10 న రెండు వారాల వ్యవధినిచ్చింది. లేనిపక్షంలో తాము తదనంతర చర్యలకు ఉపక్రమిస్తామని జడ్జీలు హెచ్చరించారు.

ఈ కేసులో ఆయనకు ఎంతమేరకు శిక్ష విధించాలన్న అంశానికి సంబంధించి విచారణను కొనసాగించాలని గత ఏడాది సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఇప్పటికే చాలాకాలంపాటు వేచి చూశామని, ఇక ఎంతోకాలం వెయిట్ చేయజాలమని న్యాయమూర్తులు గత ఏడాది నవంబరులో పేర్కొన్నారు. కోర్టు ధిక్కరణకేసులో తను దోషి అన్న ఉత్తర్వులను తిరిగి సమీక్షించాలని మాల్యా 2017 లో కోర్టును కోరారు. కానీ ఇందుకు న్యాయస్థానం నిరాకరించింది.

ఇండియాలో 9 వేల కోట్ల మేర బ్యాంకులను నిండా ముంచిన విజయ్ మాల్యా ఇక్కడి నుంచి 2016 మార్చి లో లండన్ చెక్కేశారు. అప్పటినుంచి అక్కడే ఉంటూ ఒకవిధంగా తన పిటిషన్లతో అక్కడి బ్యాంకును, ఇండియాలోని బ్యాంకులను ముప్పు తిప్పలు పెడుతున్నారు.

ఇండియాకు ఈయన అప్పగింత వ్యవహారం ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. 2017 ఏప్రిల్ నుంచి ఈయన బెయిల్‌పై ఉన్నాడు. నిజానికి 2020 అక్టోబరు 5న మాల్యా తమ ఎదుట హాజరు కావాలని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించింది. కానీ, మాల్యా ఎప్పటికప్పుడు తప్పించుకుంటూనే వచ్చాడు.

కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి ఈయన 40 మిలియన్ డాలర్ల సొమ్మును తన కూతుళ్లు లీనా, తాన్యా మాల్యాలకు, కొడుకు సిద్ధార్థ మాల్యాకు బదలాయించాడని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యాన గల వివిధ బ్యాంకుల కన్సార్టియం కూడా సుప్రీంకోర్టుకెక్కిన విషయం తెలిసిందే.

First Published:  11 July 2022 1:12 AM GMT
Next Story