Telugu Global
National

అప్పటి వరకు ఒక్క ఎమ్మెల్యేపైనా చర్యలొద్దు- సుప్రీంకోర్టు

మహారాష్ట్రలో ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. శివసేన చీఫ్ ఉద్ధ‌వ్‌ ఠాక్రే, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేలు పరస్పరం తమ ప్రత్యర్థి గ్రూప్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించేందుకు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్ధవ్‌ క్యాంప్ తరఫున సుప్రీంలో వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.. పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరారు. ఉద్ధ‌వ్ వర్గంపై అనర్హత వేటు వేసే యోచనతో ఉన్నట్టు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అందుకు […]

అప్పటి వరకు ఒక్క ఎమ్మెల్యేపైనా చర్యలొద్దు- సుప్రీంకోర్టు
X

మహారాష్ట్రలో ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. శివసేన చీఫ్ ఉద్ధ‌వ్‌ ఠాక్రే, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేలు పరస్పరం తమ ప్రత్యర్థి గ్రూప్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించేందుకు పావులు కదుపుతున్నారు.

ఈ నేపథ్యంలో ఉద్ధవ్‌ క్యాంప్ తరఫున సుప్రీంలో వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.. పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరారు. ఉద్ధ‌వ్ వర్గంపై అనర్హత వేటు వేసే యోచనతో ఉన్నట్టు ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే అందుకు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ నిరాకరించారు. తక్షణమే ఈ పిటిషన్‌ను విచారించలేమని.. పిటిషన్లు అన్నింటినీ విచారించేందుకు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. అందుకు సమయం పడుతుందన్నారు. బెంచ్‌ ఏర్పాటుకు ఎంత సమయం పడుతుందో ఇప్పుడే చెప్పలేమన్నారు.

షిండే ప్రభుత్వ రాజ్యాంగ బద్ధతపైనే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం కూడా తేలాల్సి ఉందని కోర్టు చెప్పింది. ఈ అంశాలన్నింటినీ విచారించాల్సి ఉందని.. కాబట్టి అప్పటి వరకు ఉద్ధవ్ వర్గం ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది.

స్పీకర్ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. కోర్టు విచారణ తేలే వరకు ఏ ఒక్క ఎమ్మెల్యేపైనా చర్యలు తీసుకోకుండా స్పీకర్‌కు తెలియజేయాలని సొలిసిటల్ జనరల్‌కు ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. అందుకు ఎస్‌జీ అంగీకరించారు.

First Published:  11 July 2022 1:22 AM GMT
Next Story