Telugu Global
National

బీజేపీలో చేరితే రూ. 40 కోట్ల ‘తాయిలం’ .. గోవా కాంగ్రెస్ లో ముసలం !

గోవా కాంగ్రెస్ లో తిరుగుబాటు ప్రారంభమైంది. బీజేపీలో చేరినవారికి రూ. 40 కోట్ల ‘నజరానా’ ఇస్తామంటున్నారని గోవా కాంగ్రెస్ మాజీ చీఫ్ గిరీష్ చోడంకర్ ఆరోపిస్తున్నారు. మాజీ సీఎం దిగంబర్ కామత్ ఆధ్వర్యాన కనీసం ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే సూచనలు కనబడడంతో రగడ మొదలైంది. కొందరు పారిశ్రామికవేత్తలు, బొగ్గు మాఫియా నేతలు తమ పార్టీ ఎమ్యెల్యేలకు ఫోన్ కాల్స్ చేస్తున్నారని, ఈ ఆఫర్ ఇస్తున్నారని గిరీష్ చోడంకర్ తెలిపారు. దీనిపై తాము కొందరు ఎమ్మెల్యేలను […]

బీజేపీలో చేరితే రూ. 40 కోట్ల ‘తాయిలం’ .. గోవా కాంగ్రెస్ లో ముసలం !
X

గోవా కాంగ్రెస్ లో తిరుగుబాటు ప్రారంభమైంది. బీజేపీలో చేరినవారికి రూ. 40 కోట్ల ‘నజరానా’ ఇస్తామంటున్నారని గోవా కాంగ్రెస్ మాజీ చీఫ్ గిరీష్ చోడంకర్ ఆరోపిస్తున్నారు. మాజీ సీఎం దిగంబర్ కామత్ ఆధ్వర్యాన కనీసం ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే సూచనలు కనబడడంతో రగడ మొదలైంది.

కొందరు పారిశ్రామికవేత్తలు, బొగ్గు మాఫియా నేతలు తమ పార్టీ ఎమ్యెల్యేలకు ఫోన్ కాల్స్ చేస్తున్నారని, ఈ ఆఫర్ ఇస్తున్నారని గిరీష్ చోడంకర్ తెలిపారు. దీనిపై తాము కొందరు ఎమ్మెల్యేలను కాంటాక్ట్ చేయగా .. ఈ విషయాన్ని గోవా పార్టీ వ్యవహారాల ఇన్-ఛార్జ్ దినేష్ గుండూరావుకు కూడా తెలియజేశామని చెప్పారని ఆయన వెల్లడించారు.

అసలు పార్టీలో చీలికే లేదని రాష్ట్ర కాంగ్రెస్ చెబుతున్నప్పటికీ నిన్న ఉదయం, సాయంత్రం జరిగిన మీడియా సమావేశాలకు చాలామంది పార్టీ నేతలు గైర్ హాజరు కావడం చూస్తే ఇది నిజమేననిపిస్తోంది. ముఖ్యంగా 5 గురు ఎమ్మెల్యేలు సమావేశాలకు డుమ్మా కొట్టారు. కాగా- తమ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారన్నవార్తలు ఊహాగానాలు మాత్రమేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే మైఖేల్ లోబో తోసిపుచ్చారు.

అసెంబ్లీ సమావేశాలు జరిగే ముందు ఇలాంటి రూమర్లు పుట్టుకొస్తుంటాయన్నారు. ఎవరో ఒకరు ఈ విధమైన రూమర్లను వ్యాప్తి చెందింపజేస్తుంటారని, ఒకవేళ ఇవే నిజమైతే మీకు తెలియజేస్తానని ఆయన మీడియాకు చెప్పారు. ఇదే సమయంలో లోబోను విపక్ష నేత పదవి నుంచి తొలగిస్తున్నట్టు దినేష్ గుండూరావు గతరాత్రి పొద్దుపోయాక తెలిపారు.

అలాగే కామత్ కి కూడా పార్టీ నుంచి ఉద్వాసన పలుకుతున్నామన్నారు. దిగంబర్ కామత్, లోబో ఇద్దరూ పార్టీలో చీలికను ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో పార్టీని బలహీనపరచేందుకు వీరిద్దరూ యత్నిస్తున్నారని., ఇది వీరి కుట్ర అని అన్నారు.

సోమవారం నుంచి రెండు వారాల పాటు గోవా అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో.. రాష్ట్ర కాంగ్రెస్ లో తలెత్తిన ఈ పరిణామాలు పార్టీ అధినాయకత్వానికి తలనొప్పిగా మారాయి. విషయం ఏమిటో తెలుసుకుని రమ్మని సోనియా గాంధీ.. సీనియర్ నేత ముకుల్ వాస్నిక్ ని గోవాకు పంపారు.

అటు బీజేపీ తమ పార్టీలో ఇలా అయోమయాన్ని సృష్టిస్తోందని గోవా కాంగ్రెస్ అధ్యక్షుడు అమిత్ పాట్కర్ ఆరోపించారు. తమ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలలో 8 మంది కొత్తవారని, వారితో సీనియర్లు చర్చలు జరుపుతున్నారని ఆయన వెల్లడించారు. ఈ ప్రభుత్వ వైఫల్యాలపై తాము అసెంబ్లీలో పాలక సభ్యులను ఎండగడతామన్నారు.

రాష్ట్రంలో అయిదుగురు ఎమ్మెల్యేల మద్దతుతో (20 మంది సభ్యులున్న) బీజేపీ గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం గమనార్హం. అయితే ఈ సంవత్సరాంతానికి తమ పార్టీ సభ్యుల సంఖ్య 30 కి పెరుగుతుందని బీజేపీ జాతీయ కార్యదర్శి , గోవా పార్టీ వ్యవహారాల ఇన్-ఛార్జ్ సి.టి.రవి లోగడ వ్యాఖ్యానించడంతో ఈ ఊహాగానాలు మరింత ఊపునందుకున్నాయి.

కాగా తమ పార్టీలో చేరితే 40 కోట్ల ఆఫర్ ఉంటుందని కాంగ్రెస్ చేసిన ఆరోపణలను బీజేపీ కొట్టి పారేసింది. కాంగ్రెస్ పార్టీ నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని, తామెవరికీ సొమ్ము ఆఫర్ చేయలేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సదానంద్ తన్వడే తెలిపారు. ఆ పార్టీలో తలెత్తిన అయోమయంపై తమ పార్టీకి సంబంధం లేదన్నారు. అసలు బీజేపీలో ఎవరూ దీనికి సంబంధించి ఎలాంటి అంశాన్నీ ప్రస్తావించలేదన్నారు.

సరిగ్గా మూడేళ్ళ క్రితం జులై 10 న ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. అప్పటి విపక్ష నేత చంద్రకాంత్ బాబు కవ్లేకర్ 10 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరిపోయారు. పొరుగునున్న మహారాష్ట్రలో ఇటీవల తలెత్తిన పరిణామాల ప్రభావం గోవాపై కూడా పడినట్టు కనిపిస్తోందని అంటున్నారు. మహారాష్ట్రలో సీనియర్ నేత ఏక్ నాథ్ షిండే నేతృత్వాన శివసేన రెండుగా చీలిపోవడం, ఆ తరువాత ఉధ్దవ్ థాక్రే రాజీనామా, అనంతరం షిండే సీఎం కావడం చకచకా జరిగిపోయాయి.

First Published:  11 July 2022 12:03 AM GMT
Next Story