Telugu Global
National

ఆయుధాలు.. జపాన్లో అలా.. మనదేశంలో ఇలా..

జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై ఇటీవల ఓ వ్యక్తి కాల్పులు జరపటం.. ఆయన మరణించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో జపాన్ లో గన్ కల్చర్ ఎలా ఉంది.. అనే అంశంపై మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి. జపాన్ లో తుపాకీ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. చెప్పాలంటే ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ తుపాకీ చట్టాలు చాలా భిన్నంగా ఉంటాయి. దాంతో మాజీ ప్రధాని షింజో అబేపై దుండగుడు కాల్పులు జరపటం మరింత ఆశ్చర్యానికి గురిచేసే […]

Gun Laws
X

జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై ఇటీవల ఓ వ్యక్తి కాల్పులు జరపటం.. ఆయన మరణించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో జపాన్ లో గన్ కల్చర్ ఎలా ఉంది.. అనే అంశంపై మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి. జపాన్ లో తుపాకీ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. చెప్పాలంటే ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ తుపాకీ చట్టాలు చాలా భిన్నంగా ఉంటాయి.

దాంతో మాజీ ప్రధాని షింజో అబేపై దుండగుడు కాల్పులు జరపటం మరింత ఆశ్చర్యానికి గురిచేసే అంశంగా మారింది. దుండగుడు తాను స్వయంగా తయారు చేసుకున్న ఆయుధాన్ని వాడినట్టుగా అనుమానిస్తున్నారు.

జ‌పాన్‌లో తుపాకీ చట్టాలు..వాటి ఆచరణ మన దేశంతో పాటు ఇతర దేశాలు సైతం అనుసరించదగిన స్థాయిలో ఉంటాయి. రెండవ ప్రపంచయుద్ధం తరువాత జ‌పాన్‌లో చాలా కఠినమైన చట్టాలను అమల్లోకి తెచ్చారు. దాంతో అక్కడ సాధారణ పౌరుడు గన్ ని కలిగి ఉండటం అరుదనే చెప్పాలి.

– జ‌పాన్‌లో పోలీసులు, మిలటరీ తప్ప పౌరులు ఎవరూ రైఫిల్ ని కొనలేరు. ఎయిర్ గన్స్ ని మాత్రమే అనుమతిస్తున్నారు. అది కూడా నిర్దిష్ట ప్రయోజనాలకోసం మాత్రమే వాటిని వాడాల్సి ఉంటుంది.

-తుపాకీని కొనుగోలు చేయాలంటే ఒక వ్యక్తి షూటింగ్ పరీక్షలో 95శాతం కచ్ఛితత్వం కలిగి ఉండాలి. రాత పరీక్షకూడా ఉంటుంది. అలాగే మానసిక ఆరోగ్యపరీక్షలు సైతం చేస్తారు. అన్నిరకాల అనుమతుల అనంతరం మాత్రమే తుపాకీ లైసెన్స్ ని ఇస్తారు.

-పౌరునికి ఆయుధాన్ని అనుమతించేముందు పలురకాల అంశాలను పరిశీలిస్తారు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులతోనూ, స్నేహితులు, బంధువులతోనూ మాట్లాడతారు. దీనివలన అతని గతం, మనస్తత్వం, జీవిత విధానం తదితర విషయాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. లైసెన్స్ పొందినా అది మూడేళ్ల వరకు మాత్రమే చెల్లుతుంది.

-జపాన్ లో గన్ లైసెన్స్ పొందాలంటే 13 దశల్లో అనుమతులు పొందాల్సి ఉంటుంది. అక్కడ నేరాల సంఖ్య తక్కువగా ఉండటానికి తుపాకీ చట్టాలు సైతం ఒక కారణం. అలాగే కాల్పుల ఘటనలు సైతం అక్కడ అరుదే.

-గన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే దానిని ప్రభుత్వానికి అప్పగించాలి. విధుల్లో లేని పోలీసుల వద్ద గన్ ఉండదు.

మనదేశంలో..

మనదేశంలో కూడా పేపరుపైన తుపాకీ చట్టాలు చాలా కఠినంగానే ఉంటాయి. కానీ ఆచరణలో అవి విఫలం అవుతున్నాయి. ఆయుధాన్ని పొందాలంటే సదరు వ్యక్తికి 21 ఏళ్ల వయసు ఉండాలి. తుపాకీని పొందడానికి పంటల రక్షణ, ఆత్మరక్షణ, క్రీడలు.. ఇలాంటి కారణం ఏదైనా చూపించాలి. ఆయుధం కోపం అప్ల‌య్‌ చేసిన వ్యక్తి నేపథ్యాన్ని పరిశీలించడం, అతని కుటుంబం, ఇరుగుపొరుగువారిని ప్రశ్నించడం లాంటివి కూడా చేస్తారు. లైసెన్స్ కి అనుమతులు పొందాక దరఖాస్తుదారుడు ఆయుధ నిర్వహణకు సంబంధించిన శిక్షణ కోర్సులో పాల్గొనవలసి ఉంటుంది.

అయితే చట్టాలు బలంగానే ఉన్నా మనదేశంలో అక్రమ ఆయుధాల వ్యాపారాన్ని ఆపలేకపోతున్నాయి. ఆయుధాలు అక్రమంగా తయారుచేసేవారు నేరస్తులకు దేశవాళీ ఆయుధాలను ఎలాంటి ఆటంకాలు అవాంతరాలు లేకుండా అమ్ముతున్నారు. ఉత్తర ప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ లాంటి ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాల్లో తుపాకీని కలిగి ఉండటం స్టేటస్ సింబల్ గా మారింది. అక్రమ ఆయుధాల తయారీదారులనుండి చాలామంది చట్ట వ్యతిరేకంగా ఆయుధాలు కొనుగోలు చేస్తున్నారు. ఇంతకుముందు దేశవాళీ ఆయుధాలను మాత్రమే అక్రమంగా తయారు చేస్తుండేవారు. కానీ ఇప్పుడు ఏకె 47, ఏకె 57 వంటి ఆధునిక ఆయుధాలు సైతం అక్రమంగా తయారుచేస్తున్నారు. విదేశాలనుండి కూడా అక్రమ ఆయుధాల దిగుమతి పెరిగింది.

ఇటీవల పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకు ఏఎన్ -94 అనే రష్యన్ రైఫిల్ ని వాడారు. గ్యాంగ్ వార్ లో ఇలాంటి ఆధునాతన ఆయుధాన్ని వాడటం ఇదే తొలిసారి. స్మాల్ ఆర్మ్స్ సర్వే అనే సంస్థ అందిస్తున్న వివరాల ప్రకారం మనదేశంలో 6,14,01,000 ల అక్రమ ఆయుధాలు ఉన్నాయి.

First Published:  11 July 2022 4:33 AM GMT
Next Story