Telugu Global
NEWS

ఆప్ష‌న్‌-3పై దృష్టిపెట్టండి – సీఎం జగన్

ఏపీలో జగనన్న కాలనీల నిర్మాణం అనుకున్నంత వేగంగా ముందుకు సాగడంలేదు. గతంలో కోర్టు కేసుల కారణంగా ఇళ్ల పట్టాల పంపిణీ ఆలస్యమైంది, ఆ తర్వాత నిర్మాణాలు జోరందుకుంటాయని అనుకున్నా.. అది సాధ్యం కాలేదు. కొన్నిచోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తయినా, మరికొన్నిచోట్ల కాలనీలన్నీ సరిహద్దు రాళ్లకే పరిమితం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కచోట కూడా అధికారికంగా గృహప్రవేశం జరగలేదు. దీనిపై సీఎం జగన్ సీరియస్ గా దృష్టిపెట్టారు. క్యాంప్ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జగనన్న […]

ఆప్ష‌న్‌-3పై దృష్టిపెట్టండి – సీఎం జగన్
X

ఏపీలో జగనన్న కాలనీల నిర్మాణం అనుకున్నంత వేగంగా ముందుకు సాగడంలేదు. గతంలో కోర్టు కేసుల కారణంగా ఇళ్ల పట్టాల పంపిణీ ఆలస్యమైంది, ఆ తర్వాత నిర్మాణాలు జోరందుకుంటాయని అనుకున్నా.. అది సాధ్యం కాలేదు. కొన్నిచోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తయినా, మరికొన్నిచోట్ల కాలనీలన్నీ సరిహద్దు రాళ్లకే పరిమితం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కచోట కూడా అధికారికంగా గృహప్రవేశం జరగలేదు. దీనిపై సీఎం జగన్ సీరియస్ గా దృష్టిపెట్టారు. క్యాంప్ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు.

మూడో ఆప్షన్ పై దృష్టిపెట్టండి..

జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం లబ్ధిదారులకు మూడు ఆప్షన్లు ఇచ్చింది.
ఆప్షన్ 1: ప్రభుత్వ నమూనా ప్రకారం ఇళ్లు నిర్మించుకోవడానికి అవసరమైన సామగ్రిని (సిమెంట్, ఇసుక, ఇనుప కమ్మీలు) ప్రభుత్వమే ఇస్తుంది. బేల్దారి ఖర్చులను ఎన్ఆర్ఈజీఎస్ రూపంలో చెల్లిస్తుంది. లబ్ధిదారుడు సొంతగా నిర్మాణం చేపట్టాలి.
ఆప్షన్ 2: ప్రభుత్వం దశలవారీగా నిబంధనల ప్రకారం ఆర్థిక సాయం చేస్తుంది, లబ్ధిదారుడు ఇంటి నిర్మాణాన్ని తనకు నచ్చిన సామగ్రితో పూర్తి చేసుకోవచ్చు.
ఆప్షన్ 3: లబ్ధిదారుడికి ఎలాంటి భారం లేకుండా పూర్తిగా ప్రభుత్వమే ఇంటి నిర్మాణాన్ని చేస్తుంది.

అయితే అధికారులు మూడో ఆప్షన్ విషయంలో తెలివిగా వ్యవహరించారు. దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ప్రజలు మొదటి రెండు ఆప్షన్లే ఎంచుకునేలా చేశారు. తమ దగ్గర అస్సలేమాత్రం డబ్బుల్లేవు, మా వల్ల ఇంటి నిర్మాణం కాదు అని అంటున్న పేదలు మాత్రమే మూడో ఆప్షన్ వైపు మొగ్గు చూపారు. అయితే ఈ ఆప్షన్ పెట్టినవారి ఇళ్ల నిర్మాణం అధికారులకు తలకు మించిన భారంగా మారింది. అందుకే తొలి రెండు ఆప్షన్లు ఇచ్చినవారి ఇళ్ల నిర్మాణాలు మాత్రం కాస్తో కూస్తో ముందుకు సాగుతున్నాయి. ఇప్పుడు సీఎం జగన్ ఆ మూడో ఆప్షన్ సంగతేంటని ప్రశ్నించారు.

ఆప్షన్‌ –3 ఎంపిక చేసుకున్న వారి ఇళ్ల నిర్మాణాన్ని సత్వరమే పూర్తిచేయాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన వనరులన్నీ కాలనీల్లో ఉండాలని చెప్పారు. ఈ నెలాఖరులోగా కోర్టు కేసుల వివాదాల్లోని ఇళ్ల పట్టాలపై స్పష్టత కోసం ప్రయత్నించాలని చెప్పారు. కోర్టు వివాదాల విషయంలో ప్రత్యామ్నాయ ప్రణాళికతో సిద్ధం కావాలని అధికారులకు సూచించారు.

నాణ్యత ముఖ్యం..

జగనన్న కాలనీల్లో డ్రెయిన్లు సహా కనీస మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు జగన్. డ్రైనేజీ, కరెంటు, నీటి సరఫరా అంశాలపై దృష్టిపెట్టాలన్నారు. ఇళ్లలో పెట్టే ఫ్యాన్లు, బల్బులు, ట్యూబ్‌ లైట్లు నాణ్యతతో ఉండాలని చెప్పారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని చెప్పారు. లబ్ధిదారుడికి స్థలానికి సంబంధించిన పట్టా, ఇతర అన్ని డాక్యుమెంట్లు అందించాలని చెప్పారు జగన్. ఆయా డాక్యుమెంట్లు ఇచ్చినట్టు లబ్ధిదారులనుంచి ధ్రువీకరణ తీసుకోవాలని ఆదేశించారు.

First Published:  11 July 2022 9:24 AM GMT
Next Story