Telugu Global
NEWS

'దుష్టచతుష్టయం' అనగా..

"నీ ప్రయాణంలో ఒక్కోసారి అడుగు ముందుకు వేయడానికి వీల్లేని విధంగా,నిన్ను ఎన్నో ఆటంకాలు చుట్టుముట్టవచ్చు. తీవ్ర ప్రతికూలతలు నిన్ను వెనక్కి పంపడానికే బలవంతం చెయ్యవచ్చు.అయినా నీ నిర్ణయం నువ్వు అడుగు ముందుకు వేసేట్లుగానే ఉండాలి.నీకు ఎదురయ్యే ఆటంకాలేవీ నిన్ను ముందుకు వెళ్ళకుండా నిరోధించలేవు".అనే విధానంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ముందుకు పోతున్నారు. ఆయన ఇటీవల తరచూ 'దుష్టచతుష్టయం' అని మాట్లాడుతూ ఉన్నారు.దుష్టచతుష్టయాన్ని చెండాడుతూ వైసీపీ ప్లీనరీలో ఆయన తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు.

Dusta Chatustaya
X

"నీ ప్రయాణంలో ఒక్కోసారి అడుగు ముందుకు వేయడానికి వీల్లేని విధంగా,నిన్ను ఎన్నో ఆటంకాలు చుట్టుముట్టవచ్చు. తీవ్ర ప్రతికూలతలు నిన్ను వెనక్కి పంపడానికే బలవంతం చెయ్యవచ్చు.అయినా నీ నిర్ణయం నువ్వు అడుగు ముందుకు వేసేట్లుగానే ఉండాలి.నీకు ఎదురయ్యే ఆటంకాలేవీ నిన్ను ముందుకు వెళ్ళకుండా నిరోధించలేవు".అనే విధానంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ముందుకు పోతున్నారు.

ఆయన ఇటీవల తరచూ 'దుష్టచతుష్టయం' అని మాట్లాడుతూ ఉన్నారు.దుష్టచతుష్టయాన్ని చెండాడుతూ వైసీపీ ప్లీనరీలో ఆయన తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు.ఇంతకూ దుష్టచతుష్టయం అంటే ఏమిటి?ఎవరు? ఆ మాట ఎలా వచ్చింది?

మహాభారతంలో దుర్యోధనుడు,దుశ్శాసనుడు,కర్ణుడు,శకునిలకు దుష్టచతుష్టయంగా పేరు వచ్చింది.దుర్యోధనుడు అంటే దుః+యోధనుడు అని అర్ధం.దుః అంటేనే చెడ్డ మార్గములో యోధనము అంటే పోరాటము అని అర్ధం.

అంటే 'A FoulGame Player' అని అర్థమొస్తుంది.జీవితమంటేనే అంతులేని పోరాటమే కదా.. దానిని దుర్మార్గ గామియై సాధించాలన్నది దుర్యోధనుని కాన్సెప్టు.దుర్యోధనుని తోడ బుట్టినవాడు దుశ్శాసనుడు. దుశ్శాసనుడు అంటే దుః+శాసనుడు.దుః అంటే చెడ్డ అని అర్ధం. శాసననమంటే సాధికార నిర్ణయము.ఆ చెడు మార్గాల్లో పోరాటానికి గాను అధికారంతో కూడిన నిర్ణయాలు తోడయ్యాయి.

వక్రమార్గంలో వెళ్లాలని నిశ్చయించుకున్న వ్యక్తికి పదే పదే అవే దుర్మార్గపు ఆలోచనలు వస్తాయి.కర్ణుడు : మంచి వినగలిగి కూడా, ఆ మంచిని పెడ చెవిన బెట్టి, చెడుకే చేయూత నిచ్చినందున "కు' కర్ణుడైనట్టు చరిత్రలో ఒక ప్రచారం ఉన్నది.శకుని: శకునమునకు ఒక అర్థం మాట.ఐతే వేరొక అర్ధంలో పక్షి,పక్షి శాస్త్రం అని అంటారు.

పక్షి ఎడమనుండి కుడికి పొతే ఒక ఫలితం,కుడినుండి ఎడమకు పొతే మరో ఫలితంగా చెబుతారు.పక్షుల అరుపు లేక కూతలను బట్టి కూడా ఫలితాలుంటాయని ఈ శాస్త్రం చెబుతోంది.

దుర్యోధనునిది "నేనే నెంబర్ వన్" అనుకునే స్వభావం. "తా మునిగింది గంగ, తావలచింది రంభ, తాను చెప్పిందే వేదం" అంటాడు. తల్లి దండ్రుల మాట వినడు. కృప ద్రోణుల వంటి గురువుల మాట వినడు. భీష్మాచార్యుల వంటి తాతనూ కాదంటాడు. నిండుసభలో కలకంఠి కంట కన్నీరొలికించాడు.కులకాంత పట్లనే దయ దాక్షిణ్యాలు లేకుండా ప్రవర్తించాడు. తన సోదరుడు దుశ్శాసనుడు, తన మిత్రుడు కర్ణుడు, తన మేనమామ శకుని మాటే వింటాడు.ప్రస్తుతం భారత రాజకీయాలలో ఉండే "కోటరీ" వ్యవస్థ ఆనాడే అట్లా ఉండేది.

స్వయం వ్యక్తిత్వం,స్వతంత్ర ఆలోచన లేనివాడే ఇతరులపై ఆధారపడతాడు.దుర్యోధనుడు అదే రకం. "రావణుడు అన్నీ తెలిసిన మూర్ఖుడు – ధుర్యోధనుడు ఏమీ తెలియని మూర్ఖుడు" అని పౌరాణికులు అంటారు.తన బలగాన్ని చూసుకొని దుర్యోధనుడు గర్వంతో విర్రవీగాడు. "కర్ణుడు వంటి వాడుండగా నాకేంటి?" అని అన్నాడు. శకుని మాటలు విన్నాడు. ఏ క్షణాన కూడా "ఇది తప్పు, ఇది చెయ్యకూడదు, ఇది సమంజసం కాదు" అనే ఆలోచనలే దుర్యోధనునికి రాలేదు.

అవమానాలు, భంగపాట్లు పడినకొద్దీ ప్రతీకారం, కసి, కక్ష, కార్పణ్యం ఎక్కువ అవుతాయి తప్ప తన విధానం మార్చుకోని వ్యక్తులు అప్పుడూ,ఇప్పుడూ కనిపిస్తుంటారు.

కాగా చైనాలో మావో నాయకత్వంలో 1948 సెప్టెంబరు,1949 జనవరి మధ్య 'ప్రజావిముక్తి సైన్యం' భారీ విజయాలను సాధించింది. కొమింటాంగ్‌ సేనల ప్రధాన బలగాన్ని తుడిచిపెట్టింది.ప్రజా విముక్తి సైన్యాన్ని నడిపి మావో తన సహచరులతో కలిసి భూ సంస్కరణలు, విముక్తి ప్రాంతాల్లో ఆర్థిక నిర్మాణాల ప్రక్రియను మొదలు పెట్టారు.

1949 సెప్టెంబరులో జరిగిన చైనా ప్రజా రాజకీయ చర్చావేదిక తొలి ప్లీనరీకి మావో అధ్యక్షత వహించి స్వాగతో పన్యాసం చేశారు. ఆ సమావేశంలో మావోను చైనా ప్రజా రిపబ్లిక్‌ ప్రభుత్వ ఛైర్మన్‌గా ఎన్ను కున్నారు. అదే సంవత్సరం అక్టోబరు 1న తియాన్మెన్‌ కూడలిలో 'చైనా ప్రజా రిపబ్లిక్‌ స్థాపన'ను మావో అధికారికంగా ప్రకటించారు.

ప్రజా రిపబ్లిక్‌ ఏర్పడిన మూడేళ్ల కాలంలో మావో నేతృత్వంలోని చైనా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ, కేంద్ర ప్రజా ప్రభుత్వం జాతీయ స్థాయిలో వ్యవ సాయ, ప్రజాస్వామ్య సంస్కరణలను విజయ వంతంగా అమలు చేశాయి.

1953లో చైనాలో సామ్యవాద పారిశ్రామి కీకరణ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.ప్రణాళి కాబద్ధమైన భారీ స్థాయి ఆర్థిక నిర్మాణం వైపు దృష్టి సారించారు. ఉత్పాదన సాధనాలన్నింటినీ జాతీయం చేశారు. మావో తాను ప్రతిపాదించిన రాజకీయ సిద్థాంతాలను అమలులో పొరబాట్లను గ్రహించిన వెంటనే మావో స్వయంగా నివారణా చర్యలు చేపట్టారు.

పొరబాట్లను సరిదిద్దడానికి 1960 నుంచి 65 వరకూ పార్టీ కేంద్ర కమిటీ, మావో అనేక చర్యలు తీసుకున్నారు. జాతీయ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిపైకి తెచ్చారు.1966లో దేశీయ,అంతర్జాతీయ పరిస్థితులను సరిగ్గా అంచనా వేయకుండానే మావో 'సాంస్కృతిక విప్లవాని'కి కంకణం కట్టుకున్నారన్నా విమర్శలు వచ్చాయి. ప్రతీఘాత విప్లవ కుట్ర దారులైన లిన్‌ పియావో, జియాంగ్‌ కింగ్‌,మరో ఇద్దరు 'దుష్టచతుష్టయం'గా మారారు.

సాంస్కృతిక విప్లవంలో భాగంగా లిన్ పియాయో నేతృత్వంలోని 'తిరోగమనవర్గా'న్ని రూపుమాపేందుకు చైనా కమ్యూనిస్టు పార్టీ భారీ ఉద్యమాన్ని నిర్వహించింది. దుష్టచతుష్టయంగా పేరు గాంచిన 'లిన్ పియాయో వర్గం' దేశ నాయకత్వాన్ని చేజి క్కించుకోకుండా అన్నిస్థాయిలలో పోరాటం జరిగింది.

వెనుకబాటుతనానికి మారుపేరుగా ఉన్న చైనా ప్రజలను విప్లవ పథంలో నడిపించి,విముక్తి చేసిన మహానాయకుడు మావో 1976 సెప్టెంబరు 9న కన్నుమూశారు.అనంతరం చైనా పార్టీ నాయకత్వం 'దుష్టచతుష్టయం' నుంచి దేశాన్ని రక్షించుకొని గాడిన పెట్టింది.

రాజకీయం చేయడమే ఓ కళ ! అందులోనూ 'అధిష్ఠాన' రాజకీయాలు చేయడం ఇంకా అత్యున్నత మర్మకళ! అందుకు గాను తిమ్మిని బమ్మిని చేసే 'తాంత్రికకళ'లో ఆరితేరాలి.తాము చెప్పిందే వేదమని ఒప్పించే గోబెల్స్ నీతిని నమిలి జీర్ణం చేసుకోవాలి.

ప్రజలలో,పార్టీ శ్రేణుల్లో ఐక్యతను చీల్చాలి.ముఠాలను రెచ్చగొట్టాలి. కలహాలను సృష్టించాలి.భావోద్రేకాలకు మంటబెట్టాలి.అర్థంపర్థం లేని ప్రకటనలు చేయాలి. అయినదానికీ, కానిదానికీ గల్లీ నాయకులందరినీ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయించాలి.

ప్రతిపక్షాల్ని కుటిల నీతితో చావుదెబ్బ తీయాలి.ఎవరయినా తోక జాడిస్తే సీబీఐ,ఐటీ,ఈడీలను ఉసిగొల్పాలి. దేశం నలుమూలలా రావణకాష్ఠం రాజేయాలి.కాంగ్రెస్ అయినా,బీజేపీ అయినా అదే పంథా!!

ఇక శ్రీలంకలోనూ 'దుష్టచతుష్టయం' అరాచకాలు వెలుగుచూస్తున్నవి.రాజపక్స సోదర చతుష్టయమే శ్రీలంక కొంప ముంచింది.అస్తవ్యస్త నిర్ణయాలు,అవినీతి పాలనతో దివాళా తీయించారు.రాజపక్సే సోదరులు చమల్,బసిల్,మహీంద,గొటబాయ శ్రీలంక దుస్థితికి కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మొత్తమ్మీద పురాణాలు,ఇతిహాసాల్లోనూ 'దుష్ట చతుష్టయం'గురించిన ఘటనలు,దృశ్యాలు చాలా ఉన్నాయి.ఆధునిక భారత రాజకీయాల్లోనూ మనకు ఇలాంటి చతుష్టయాలకు కొరత లేదు.ఈనాడు రామోజీరావు,ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ,టీవీ5 నాయుడు,పవన్ కళ్యాణ్ లను 'దుష్టచతుష్టయం'గా ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్వచిస్తున్నారు.

పార్టీ ప్లీనరీలో ఈ చతుష్టయం గురించి కనీసం వందసార్లయినా ప్రస్తావించి ఉంటారు.తాము నేరుగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో తలపడడం లేదని,ఆయనకు వెన్నుదన్నుగా ఉన్న ఈ నలుగురితో పోరాడవలసి వస్తున్నట్టు జగన్ నిప్పులు చెరిగారు.

First Published:  10 July 2022 4:11 AM GMT
Next Story