Telugu Global
NEWS

పాల్ కామెడీ పీక్స్.. కేంద్ర మంత్రి పదవి వద్దన్నా..

ఇటీవల తెలంగాణలో ఎఫ్-2 సినిమా చూపించిన కేఏపాల్, ఏపీకి వచ్చి దాని సీక్వెల్ ఎఫ్-3 చూపిస్తున్నారు. త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర చేస్తానన్నారు, వర్షాకాలం తర్వాత బహిరంగ సభలు పెట్టి, ప్రజల్ని మోటివేట్ చేసి ప్రజాశాంతి పార్టీకి చేరువ చేస్తానన్నారు. పైకి బాగానే కనిపిస్తున్నా పాల్ మాటలు వింటే మాత్రం ఎవరూ నవ్వాపుకోలేరు. ఇటీవల రాజ్యసభ సీటుని బీజేపీ తనకు ఆఫర్ చేసిందని, కేంద్ర మంత్రి పదవి ఇస్తానని చూడా చెప్పిందని అంటున్నారు పాల్. మే, […]

పాల్ కామెడీ పీక్స్.. కేంద్ర మంత్రి పదవి వద్దన్నా..
X

ఇటీవల తెలంగాణలో ఎఫ్-2 సినిమా చూపించిన కేఏపాల్, ఏపీకి వచ్చి దాని సీక్వెల్ ఎఫ్-3 చూపిస్తున్నారు. త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర చేస్తానన్నారు, వర్షాకాలం తర్వాత బహిరంగ సభలు పెట్టి, ప్రజల్ని మోటివేట్ చేసి ప్రజాశాంతి పార్టీకి చేరువ చేస్తానన్నారు.

పైకి బాగానే కనిపిస్తున్నా పాల్ మాటలు వింటే మాత్రం ఎవరూ నవ్వాపుకోలేరు. ఇటీవల రాజ్యసభ సీటుని బీజేపీ తనకు ఆఫర్ చేసిందని, కేంద్ర మంత్రి పదవి ఇస్తానని చూడా చెప్పిందని అంటున్నారు పాల్. మే, జూన్ నెలల్లో వరుసగా మోదీ, అమిత్ షా తనతో మాట్లాడి కేంద్ర మంత్రి పదవి తీసుకోండని బతిమిలాడారని, కానీ తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలకోసం తానే దాన్ని తృణప్రాయంగా త్యజించానని చెప్పుకొచ్చారు పాల్.

అప్పులు తీర్చాలంటే పాల్ రావాల్సిందే..

దేశం అప్పుల ఊబిలోకి కూరుకుపోయి కోమా దశలో ఉందని, అప్పుల భారం దించాలంటే పాల్ అధికారంలోకి రావాల్సిందేనన్నారాయన. 8 ఏళ్ల కాలంలో రూ.55 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రధాని మోదీ దేశాన్ని ప్రమాదంలోకి నెట్టారని విమర్శించారు. 32 కోట్ల మంది నిరుద్యోగులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. 2014లో చంద్రబాబుకు సహకారం అందిస్తే, ఆయన కూడా ఏపీని అప్పులోకి నెట్టేశారని, అనుభవం లేని జగన్‌ రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలోకి తీసుకెళ్లారని విమర్శించారు. ఏపీలో ఒక్కో కుటుంబంపై రూ.7.5 లక్షల అప్పు ఉందని చెప్పారు. దేశంలోని 18 పార్టీలతో కలిసి కాంగ్రెస్‌, బీజేపీ లేని ఫ్రంట్ ని అధికారంలోకి తెస్తానన్నారు పాల్.

తెలంగాణ సర్వేలో తనకు 80శాతం మంది ప్రజల మద్దతు ఉందన్న పాల్, ఏపీలో మాత్రం ఎందుకో జగన్ పై దయచూపించారు. ఏపీలో ప్రజాశాంతి పార్టీకి 56శాతం మంది ప్రజలు మద్దతిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇక చంద్రబాబు, జగన్ ని విమర్శిస్తున్నా, పవన్ ని మాత్రం తమ్ముడు అని సంబోధిస్తూ జాలి చూపిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఇప్పటికైనా తన దగ్గరకు వస్తే ఆయనకు పదవి ఇస్తానని, అధికారం అప్పగిస్తానని చెబుతున్నారు. యథా ప్రకారం అమెరికా ప్రెసిడెంట్, రష్యా ప్రెసిడెంట్, బ్రిటన్ ప్రధాని అంటూ.. తన ఫ్లో కంటిన్యూ చేసుకుంటూ వెళ్లారు పాల్. మొత్తమ్మీద ఈ దఫా కాస్త ముందుగానే పాల్ తన జబర్దస్త్ షో మొదలు పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్కరినీ డిజప్పాయింట్ చేయకుండా అక్కడా, ఇక్కడా సమంగా హాస్యాన్ని పండిస్తున్నారు.

First Published:  9 July 2022 9:59 PM GMT
Next Story