Telugu Global
International

శ్రీ‌లంక అధ్యక్ష భవనం స్విమ్మింగ్ పూల్‌లో నిరసనకారుల జలకాలాట

శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సైనికుల సాయంతో పలాయనం చిత్తగించడంతో కొలంబోలోని ఆయన నివాస భవనమంతా వేలాది నిరసనకారులతో నిండిపోయింది. దేశంలోని నలుమూలల నుంచి ఆందోళనకారులు అధ్యక్ష భవనంవద్ద గల బారికేడ్లను విరగ‌గొట్టి లోపలికి దూసుకువచ్చారు. ఉన్న కొద్దిమంది పోలీసులు, చివరకు సైనికులు సైతం వారిని అదుపు చేయలేక చేతులెత్తేయడంతో నిరసనకారుల దూకుడుకు అడ్డే లేకుండా పోయింది. టియర్ గ్యాస్, వాటర్ క్యానన్ల ప్రయోగం కూడా వారిని ఆపలేకపోయాయి. అధ్యక్ష భవనంలోని స్విమ్మింగ్ పూల్ లోకి దూకి […]

శ్రీ‌లంక అధ్యక్ష భవనం స్విమ్మింగ్ పూల్‌లో నిరసనకారుల జలకాలాట
X

శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సైనికుల సాయంతో పలాయనం చిత్తగించడంతో కొలంబోలోని ఆయన నివాస భవనమంతా వేలాది నిరసనకారులతో నిండిపోయింది. దేశంలోని నలుమూలల నుంచి ఆందోళనకారులు అధ్యక్ష భవనంవద్ద గల బారికేడ్లను విరగ‌గొట్టి లోపలికి దూసుకువచ్చారు. ఉన్న కొద్దిమంది పోలీసులు, చివరకు సైనికులు సైతం వారిని అదుపు చేయలేక చేతులెత్తేయడంతో నిరసనకారుల దూకుడుకు అడ్డే లేకుండా పోయింది. టియర్ గ్యాస్, వాటర్ క్యానన్ల ప్రయోగం కూడా వారిని ఆపలేకపోయాయి.

అధ్యక్ష భవనంలోని స్విమ్మింగ్ పూల్ లోకి దూకి ఆందోళనకారులు ఈత కొడుతున్న దృశ్యాలు వీడియోకెక్కాయి. 16 సెకండ్ల నిడివి గల ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక విశాలమైన కిచెన్ లో పెద్ద టేబుల్ చుట్టూ కొందరు చేరి.. అక్కడున్న పాత్రలను చెల్లాచెదరు చేయగా .. మరికొంతమంది అక్కడే ఉన్న డిషెస్ తినడానికి ఎగబడ్డారు. ఎవరు, ఏం చేస్తున్నారో తెలియకుండా పోయింది. ప్రతివారి నోటా.. ఈ అధ్యక్షుడు రాజీనామా చేయాలన్నదే !

దేశ జాతీయ పతాకాలను చూపుతూ, నినాదాలు చేస్తూ వీరంతా అధ్యక్ష భవనంలో ర‌చ్చ చేశారు. ఈ భవనం మొత్తం వీరి వశమైంది. అధ్యక్షుని వ్యక్తిగత గదిలోకి ప్రవేశించిన ఆందోళనకారులు అక్కడ సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. ఈ గదిలోని కప్ బోర్డును, ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు. నిరసనకారులకు సంఘీభావం ప్రకటిస్తూ మాజీ క్రికెటర్లు సనత్ జయసూర్య, కుమార సంగర్క‌ర వంటివారు కూడా .. గొటబాయ రాజీనామా చేయాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు. కొలంబో చుట్టుపక్కల గల జిల్లాలు, నగరాల నుంచి రైళ్లు, బస్సుల్లో వేల సంఖ్యలో వస్తున్న ఆందోళనకారులతో ఈ రాజధాని అంతా నిండిపోయింది. అసంతృప్తితో ఉన్న పోలీసుల, కొందరు సైనిక సిబ్బంది సైతం పరోక్షంగా వీరికి సహకరించడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది.

దేశంలో ఇంధనం, ఆహార కొరత, విపరీతంగా క్షీణించిపోయిన ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణం, ప్రభుత్వ ఖజానా ఖాళీ కావడంవంటి పరిణామాలతో ఈ ఏడాది నుంచే లంక.. రావణ కాష్టంలా మారింది. దీనికి తోడు రాజపక్స, కుటుంబం పట్ల ఉన్న ప్రజాగ్రహం కూడా పరిస్థితి తీవ్రతకు తోడయింది. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రధానిగా తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని రణిల్ విక్రమసింఘే తమ పార్టీ నేతలకు తెలిపారు. దేశంలో అఖిలపక్ష ప్రభుత్వం అధికార పగ్గాలు చేప‌ట్టేందుకు అనువుగా పదవీ నుంచి దిగిపోతానన్నారు. ప్రస్తుతం పార్లమెంట్ స్పీకర్ అధికార నివాసంలో పార్టీ నేతలు సమావేశమయ్యారు. అయితే పరిస్థితిని ఎలా అదుపు చేయాలన్నది వీరికి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

First Published:  9 July 2022 9:25 AM GMT
Next Story