Telugu Global
NEWS

కాంగ్రెస్ లో రాముడు, హనుమంతుడు..

రాముడు, హనుమంతుడు అనే కాన్సెప్ట్ సహజంగా బీజేపీ నేతలు ఓన్ చేసుకుంటారు. కానీ కాంగ్రెస్ లో కూడా రాముడు, హనుమంతుడు ఉన్నారని చెబుతున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ రాముడైతే.. తాను హనుమంతుడి లాంటివాడినని చెప్పారు. రామాయణంలో రాముడికి హనుమంతుడు అండగా ఉన్నట్టు.. తాను రాహుల్ గాంధీకి ఎప్పుడూ అండగా ఉంటానని అన్నారు. మీరంతా వానర సైన్యం అంటూ కాంగ్రెస్ శ్రేణుల్ని ఉద్దేశించి చెప్పారు. రావణాసురుడిని చంపడం కోసం ఎంత దూరమైనా వెళ్తామని అన్నారు […]

కాంగ్రెస్ లో రాముడు, హనుమంతుడు..
X

రాముడు, హనుమంతుడు అనే కాన్సెప్ట్ సహజంగా బీజేపీ నేతలు ఓన్ చేసుకుంటారు. కానీ కాంగ్రెస్ లో కూడా రాముడు, హనుమంతుడు ఉన్నారని చెబుతున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ రాముడైతే.. తాను హనుమంతుడి లాంటివాడినని చెప్పారు. రామాయణంలో రాముడికి హనుమంతుడు అండగా ఉన్నట్టు.. తాను రాహుల్ గాంధీకి ఎప్పుడూ అండగా ఉంటానని అన్నారు. మీరంతా వానర సైన్యం అంటూ కాంగ్రెస్ శ్రేణుల్ని ఉద్దేశించి చెప్పారు. రావణాసురుడిని చంపడం కోసం ఎంత దూరమైనా వెళ్తామని అన్నారు రేవంత్ రెడ్డి. సోనియా గాంధీ తనకు గొప్ప అవకాశం ఇచ్చారని.. ప్రధాని, సీఎం పదవుల కంటే పీసీసీ పదవి చాలా గొప్పదని చెప్పారు. జీవితాంతం తాను సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి విశ్వాసపాత్రుడిగా పనిచేస్తానని తెలిపారాయన. పార్టీ చేరికల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు.

మెడలు వంచింది, వడ్లు కొనేలా చేసింది మేమే..
తెలంగాణలో దళితులు, గిరిజనులు కన్నీరు పెట్టుకుంటున్నారని.. వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు, మూడెకరాల భూమి ప్రభుత్వం ఇవ్వలేదని విమర్శించారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూముల్ని కేసీఆర్ వెనక్కి తీసుకుంటున్నారని ఆరోపించారు. వడ్లు కొనను అంటూ బీజేపీ, టీఆర్ఎస్ డ్రామాలు వేస్తే.. మెడలు వంచి వడ్లు కొనుగోలు చేసే పరిస్థితి తీసుకొచ్చింది తామేనని చెప్పారు. ధరణి పోర్టల్ దరిద్రంగా మారిందని, తాము అధికారంలోకి వచ్చాక దాన్ని రద్దు చేస్తామన్నారు. తెలంగాణను కాపాడాల్సిన బాధ్యత యువతదేనని పిలుపునిచ్చారు.

అప్పట్లో వైఎస్ఆర్ పనైపోయిందని అన్నారు..
ఏడాదిగా టీపీసీసీ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని, కానీ హుజురాబాద్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, అప్పుడు పార్టీ కార్యకర్తలు తనకు కొండంత అండగా నిలబడ్డారని చెప్పారు రేవంత్ రెడ్డి. 2001 సిద్దిపేట ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ కి 3700 ఓట్లు వచ్చినప్పుడు వైఎస్ఆర్ పని ఖతం అయ్యిందన్నారని.. కానీ 2004లో అత్యధిక మెజారిటీ సీట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. ప్రతి ఓటమి.. గెలుపుకి, అనుభవానికి అవకాశమన్నారు. రేవంత్ రెడ్డి పనైపోయిందని కొందరు చంకలు గుద్దుకున్నప్పుడు.. ఉప ఎన్నికల్లో కుక్క కాటుకి చెప్పు దెబ్బ లాగా జనం వారికి చెంప చెల్లుమనిపించారన్నారు.

కక్షతోనే ఈడీ కేసులు..
రాహుల్ గాంధీపై కక్ష గట్టి ఈడీ కేసులు పెట్టిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకుని.. ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పే పరిస్థితి రాహుల్ గాంధీ తీసుకొచ్చారని, అందుకే ఆ కుటుంబంపై మోదీ కక్ష కట్టారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియమ్మ రాజ్యం రావడం తథ్యమని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

First Published:  7 July 2022 8:21 PM GMT
Next Story