Telugu Global
NEWS

తొలి టీ20లో టీమ్ ఇండియా ఘన విజయం

ఇంగ్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో విజయం వైపు ప్రయాణించి చివరకు ఓడిపోయిన టీమ్ ఇండియా.. టీ20 సిరీస్‌‌ను మాత్రం విజయంతో ప్రారంభించింది. గురువారం రాత్రి సౌంతాంప్టన్‌లో జరిగిన తొలి టీ20లో భారత జట్టు అన్ని విభాగాల్లో రాణించి 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. హార్దిక్ పాండ్యా బ్యాటుతో, బంతితో రాణించి భారత జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. టాస్ గెలిచి కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఆడుతున్న […]

తొలి టీ20లో టీమ్ ఇండియా ఘన విజయం
X

ఇంగ్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో విజయం వైపు ప్రయాణించి చివరకు ఓడిపోయిన టీమ్ ఇండియా.. టీ20 సిరీస్‌‌ను మాత్రం విజయంతో ప్రారంభించింది. గురువారం రాత్రి సౌంతాంప్టన్‌లో జరిగిన తొలి టీ20లో భారత జట్టు అన్ని విభాగాల్లో రాణించి 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. హార్దిక్ పాండ్యా బ్యాటుతో, బంతితో రాణించి భారత జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.

టాస్ గెలిచి కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఆడుతున్న తొలి మ్యాచ్ అయినా సరే.. తన సహజశైలిలోనే దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఉన్నది కొద్దిసేపే అయినా.. మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 14 బంతుల్లో 24 పరుగులు చేశాడు. అయితే స్పిన్నర్ మొయిన్ అలీ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత కాసేపటికే మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (8) కూడా మొయిన్ అలీ బౌలింగ్‌లో పెవీలిన్ చేరాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న దీపక్ హుడా ఈ మ్యాచ్‌లో కూడా దంచి కొట్టాడు. హుడా, సూర్యకుమార్ కలిసి వేగంగా పరుగులు రాబట్టారు. దీంతో పవర్ ప్లేలో భారత జట్టుకు 66 పరుగులు చేసింది.

క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో దీపక్ హుడా (33) అవుటైన తర్వాత సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా కలిసి దూకుడు పెంచారు. వీరిద్దరూ ధాటిగా ఆడటంతో 10వ ఓవర్‌లోనే భారత జట్టు 100 పరుగుల మైలు రాయిని చేరుకున్నది. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ (39), ఆక్షర్ పటేల్ (17) అవుటవడంతో హార్దిక్ పాండ్యా పరుగుల వేగం తగ్గించాడు. ఆ తర్వాత కాసేపు ధాటిగా ఆడి అర్ద సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే పాండ్యా (51)ను టాప్లీ అవుట్ చేశాడు. చివర్లో దినేశ్ కార్తిక్ (11) కాసిన్ని పరుగులు రాబట్టాడు. ఒకానొక దశలో భారత జట్టు 200పైగా పరుగులు చేస్తుందని అందరూ భావించారు. కానీ డెత్ ఓవర్లలో ఇంగ్లాండ్ బౌలర్లు కట్టడి చేయడంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది.

199 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టును హార్దిక్ పాండ్యా దెబ్బ తీశాడు. అతడికి చాహల్, అర్షదీప్ తోడవడంతో ఇంగ్లాండ్ కేవలం 148 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మొయిన్ అలీ (36), హ్యారీ బ్రూక్ (28) తప్ప మిగిలిన బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. కెప్టెన్ జాస్ బట్లర్ (0) తొలి ఓవర్లోనే భువనేశ్వర్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. మలన్ (21) కాసేపు క్రీజులో ఉన్నా.. భారీ స్కోర్ చేయలేకపోయాడు. ఫామ్‌లో ఉన్న లివింగ్‌స్టోన్ (0), జేసన్ రాయ్ (0) లను హార్దిక్ పాండ్యా అవుట్ చేయడంతో ఇంగ్లాండ్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆఖర్లో బ్రూక్, మొయిన్ అలీ పోరాడినా ఫలితం లేకపోయింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు 19.3 ఓవర్లలోనే 148 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత జట్టు 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. హార్దిక్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

First Published:  7 July 2022 8:47 PM GMT
Next Story