Telugu Global
Sports

నడాల్ ను పిప్పి చేస్తున్న గాయాలు.. వింబుల్డన్ నుంచి గాయంతో అవుట్

స్పానిష్ బుల్, 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విజేత రాఫెల్ నడాల్ ను గాయాలు పీల్చిపిప్పి చేస్తున్నాయి. కీలక సమయాలలో తిరగబెట్టడం ద్వారా ప్రతిబంధకంగా మారాయి. ప్రస్తుత సీజన్లో ఇప్పటికే రెండు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన నడాల్…వింబుల్డన్ టైటిల్ కు సైతం గురిపెట్టాడు. అయితే…తాను ఒకటి తలస్తే విధి మరొకటి తలచినట్లుగా తయారయ్యింది. రెండోసీడ్ ఆటగాడిగా వింబుల్డన్ టైటిల్ వేటకు దిగిన నడాల్ అతికష్టం మీద క్వార్టర్ ఫైనల్స్ రౌండ్ గట్టెక్కి సెమీస్ కు అర్హత […]

rafael nadal
X

స్పానిష్ బుల్, 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విజేత రాఫెల్ నడాల్ ను గాయాలు పీల్చిపిప్పి చేస్తున్నాయి. కీలక సమయాలలో తిరగబెట్టడం ద్వారా ప్రతిబంధకంగా మారాయి.

ప్రస్తుత సీజన్లో ఇప్పటికే రెండు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన నడాల్…వింబుల్డన్ టైటిల్ కు సైతం గురిపెట్టాడు. అయితే…తాను ఒకటి తలస్తే విధి మరొకటి తలచినట్లుగా
తయారయ్యింది.

రెండోసీడ్ ఆటగాడిగా వింబుల్డన్ టైటిల్ వేటకు దిగిన నడాల్ అతికష్టం మీద క్వార్టర్ ఫైనల్స్ రౌండ్ గట్టెక్కి సెమీస్ కు అర్హత సంపాదించాడు. అయితే పక్కటెముకల గాయం తిరగబెట్టడంతో..నిక్ కిర్గిసోతో ఆడాల్సిన సెమీఫైనల్స్ మ్యాచ్ నుంచి ఉపసంహరించుకొంటున్నట్లు ప్రకటించాడు.

4 గంటల పోరుతో…..

ఇటీవలే ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను కాలిగాయంతోనే గెలుచుకోడం ద్వారా సంచలనం సృష్టించిన నడాల్…పలురకాల పాతగాయాలను పక్కనపెట్టి మరీ..
వింబుల్డన్ టైటిల్ వేటకు దిగాడు.

మొదటి రెండురౌండ్ల మ్యాచ్ ల్లో అలవోక విజయాలు సాధించిన నడాల్ కు క్వార్టర్ ఫైనల్లో గట్టిపోటీ ఎదురయ్యింది. ఫ్రిట్జ్ అనే ఆటగాడితో తలపడిన నడాల్ విజయం కోసం 4 గంటల 21 నిముషాలపాటు చెమటోడ్చాల్సి వచ్చింది.

నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఈ పోరులో నడాల్ ఆపసోపాలు పడుతూనే తన పోరాటం కొనసాగించి…3-6, 7-5, 3-6, 7-5, 7-6తో విజేతగా నిలిచాడు.

విజయానంతరం భరించలేని నొప్పితో విలవిలలాడిపోయాడు. చెమటోడ్చి నెగ్గిన విజయానందం కాస్త పాతగాయం తిరగబెట్టడంతో ఆవిరైపోయింది.
సెమీఫైనల్స్ పోరుకు దిగకుండానే తాను టోర్నమెంట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.

2003 నుంచి గాయాల ఊబిలో…

36 సంవత్సరాల నడాల్ క్రీడాజీవితంలో గాయాలు ఏమాత్రం కొత్తకాదు. కేవలం 16 సంవత్సరాల వయసులోనే నడాల్ కు తొలిగాయం ఎదురయ్యింది. 2003 నుంచి గాయాలతో సహవాసం చేస్తూనే ఇటీవలి ఫ్రెంచ్ ఓపెన్ వరకూ 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన మొండిఘటం నడాల్ మాత్రమే. గత 18సంవత్సరాల కాలంలో నడాల్..గాయాలతో గ్రాండ్ స్లామ్ టోర్నీల నుంచి అర్థంతరంగా వైదొలగడం ఇది ఐదోసారి.

తరచూ గాయాలతో 11 గ్రాండ్ స్లామ్ టోర్నీలకు నడాల్ దూరంగా ఉండాల్సి వచ్చింది.
2010, 2018 ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్, 2018 అమెరికన్ ఓపెన్ సెమీఫైనల్స్ దశలోనే కాలిమడమ, మోకాలి గాయాలతో ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.

2016 ఫ్రెంచ్ ఓపెన్ మూడోరౌండ్ నుంచే మణికట్టు గాయంతో వైదొలిగాడు.

గత కొద్ది సంవత్సరాలుగా ఏడాదికి ఒక్కో గ్రాండ్ స్లామ్ టోర్నీకి నడాల్ దూరంగా ఉంటూ వస్తున్నాడు.
గాయాలు ఎంతగా వేధిస్తున్నా నడాల్ తన కెరియర్ లో 92 టైటిల్స్, 1063 విజయాలు నమోదు చేయటం ఓ రికార్డుగా మిగిలిపోతుంది. మరే ఆటగాడు సాధించని రీతిలో 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ముందుగా నెగ్గిన మొనగాడు సైతం నడాల్ మాత్రమే.

ఆగస్టు 29న ప్రారంభంకానున్న ప్రస్తుత సీజన్ ఆఖరి గ్రాండ్ స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ కు నడాల్ సిద్ధంగా ఉండే అవకాశాలు అంతంత మాత్రమే. పక్కటెముకలు, ఎడమకాలి పాదం గాయాల నుంచి పూర్తిస్థాయిలో కోలుకోగలిగితేనే నడాల్ కెరియర్ తిరిగి గాడిలో పడే అవకాశం ఉంటుంది.
36 సంవత్సరాల లేటు వయసులో ప్రత్యర్థులతో ఓ వైపు, గాయాలతో మరోవైపు పోరాడుతున్న స్పానిష్ బుల్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే మరి.

First Published:  8 July 2022 6:44 AM GMT
Next Story