Telugu Global
MOVIE REVIEWS

హ్యాపీ బర్త్ డే మూవీ రివ్యూ

నటీనటులు: లావణ్య త్రిపాఠి, నరేష్ ఆగస్త్య, సత్య, వెన్నెల కిషొర్, గుండు సుదర్శన్ తదితరులు సంగీతం: కాలభైరవ సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: రితేష్ రానా బ్యానర్లు : క్లాప్ ఎంటర్ టైన్ మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు : చిరంజీవి (చెర్రీ), హేమలత రేటింగ్ : 2/5 తక్కువ బడ్జెట్ లో ఫటాఫట్ ఎంటర్ టైనర్లు తీయడానికి చాలామంది మేకర్స్ ఆసక్తి చూపిస్తున్న రోజులివి. అందుకే ఈ తరహా సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే […]

హ్యాపీ బర్త్ డే మూవీ రివ్యూ
X

నటీనటులు: లావణ్య త్రిపాఠి, నరేష్ ఆగస్త్య, సత్య, వెన్నెల కిషొర్, గుండు సుదర్శన్ తదితరులు
సంగీతం: కాలభైరవ
సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం
కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: రితేష్ రానా
బ్యానర్లు : క్లాప్ ఎంటర్ టైన్ మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు : చిరంజీవి (చెర్రీ), హేమలత
రేటింగ్ : 2/5

తక్కువ బడ్జెట్ లో ఫటాఫట్ ఎంటర్ టైనర్లు తీయడానికి చాలామంది మేకర్స్ ఆసక్తి చూపిస్తున్న రోజులివి. అందుకే ఈ తరహా సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఇలా వేగంగా వినోదాన్ని అందించే క్రమంలో కీలకమైన ఓ థ్రెడ్ ను మేకర్స్ మిస్సవుతున్నారు. ఇలాంటి లో-బడ్జెట్ వినోదాత్మక చిత్రాలు తీసేవాళ్లు లీడ్ క్యారెక్టర్స్ ను పకడ్బందీగా డిజైన్ చేసుకోవాలి. మెయిన్ క్యారెక్టర్స్ ఎంత బలంగా ఉంటే ఇలాంటి సినిమాల్లో అంత వినోదం పండుతుంది. హ్యాపీ బర్త్ డేలో అది మిస్సయింది.

డీజే టిల్లూ సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ క్యారెక్టర్ హైలెట్. ఇక జాతిరత్నాల్లో నవీన్ పొలిశెట్టి పాత్ర సూపర్. ఇలాంటి ఓ గట్టి పాత్ర అనుకొని, దాని చుట్టూ వినోదాన్ని అల్లుకుంటే వర్కవుట్ అవుతుంది. ఈ లాజిక్ ను గాలికొదిలేసి, కామెడీతో మేజిక్ చేద్దామని చూస్తే, అది హ్యాపీ బర్త్ డే సినిమాలా తయారవుతుంది. సరైన పాత్రలు, వాటికి సరైన క్యారెక్టరైజేషన్లు లేక ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.

ఈ సినిమా కోసం జిండియా అనే ఫిక్షన్ లోకాన్ని సృష్టించాడు దర్శకుడు రితేష్ రానా. అందులో జిన్ సిటీని సృష్టించాడు. రిత్విక్ సోది (వెన్నెల కిషోర్) అనే రక్షణ మంత్రి తన దేశంలో గన్స్ కోసం ప్రత్యేక బిల్లు తెస్తాడు. ఎవరైనా తుపాకీ కలిగి ఉండొచ్చని బిల్లు తీసుకొస్తాడు. దీంతో సంతలో కూరగాయల్లా తుపాకులు అమ్ముతారు. రకరకాల షేపులు, రంగులతో సరదాగా తుపాకీ బజార్లను చూపించారు.

మరోవైపు రిట్జ్ గ్రాండ్ అనే హోటల్ లో హౌస్ కీపర్ గా పనిచేస్తుంటాడు నరేష్ అగస్త్య. ఆ హోటల్ కు పార్టీ కోసం ఎంటర్ అవుతుంది హ్యాపీ (లావణ్య త్రిపాఠి). ఇదే హోటల్ లోకి మిగతా పాత్రలన్నీ ఎంటర్ అవుతాయి. అందరి దగ్గర గన్స్ కామన్. ఊహించని విధంగా హ్యాపీ కిడ్నాప్ అవుతుంది. అసలు ఆమె ఎందుకు కిడ్నాప్ అయింది.. ఎవరు కిడ్నాప్ చేశారు.. అంతా కలిసి ఆ హోటల్ లో ఏం చేశారు.. ఫైనల్ గా ఎలా బయటపడ్డారు అనేది స్టోరీ.

హ్యాపీ బర్త్ డే సినిమాకు మంచి సెటప్ అయితే కుదిరింది. దర్శకుడు రితేష్ రానా డిఫరెంట్ స్టోరీ రాసుకున్నాడు. విషయం ఉన్న నటీనటుల్ని ఎంచుకున్నాడు, టెక్నీషియన్స్ ను బాగా సెలక్ట్ చేసుకున్నాడు. డబ్బులు పెట్టే నిర్మాతలు కూడా దొరికారు. ఇలా అంతా సెట్ అయిన ఈ సినిమాలో నెరేషన్ మిస్ అయింది. ఫస్టాఫ్ లో ఓ మాదిరిగా నవ్వులు పండించిన దర్శకుడు.. సెకండాఫ్ కు వచ్చేసరికి హ్యాండ్సప్ అన్నాడు. క్లైమాక్స్ అయితే దారుణం.

ఈమధ్య కామెడీ సినిమాలు తీసేవాళ్లంతా ఓ కొత్త వితండవాదం ఎత్తుకున్నారు. కామెడీ చూడాలనుకునేటప్పుడు లాజిక్కులు పట్టించుకోకూడదనేది వీళ్ల వాదన. ఆమధ్య ఎఫ్3 వచ్చినప్పుడు అనీల్ రావిపూడి ఇదే చెప్పాడు. ఈరోజు రిలీజైన హ్యాపీ బర్త్ డే చూడాలనుకున్నప్పుడు కూడా ఇదే పద్ధతి ఫాలో అవ్వాలి. పోనీ అలా అన్నీ వదిలేసి చూద్దామనుకున్నా కిక్ ఇవ్వని మూవీ ఇది. ఏదో ఒక కామెడీని ఎంజాయ్ చేద్దామంటూ బ్రెయిన్ ను బీరువాలో పెట్టి మరీ థియేటర్లకు వచ్చినప్పటికీ సంతృప్తి దక్కని సినిమా ఇది.

సినిమాలో కొన్ని జోక్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. కానీ కొన్ని జోక్స్ మాత్రం ఇది ఇప్పుడు పెట్టాల్సిన అవసరం ఏముంది అన్నట్టు అనిపించాయి. కొన్ని పంచ్ లైన్స్ మాత్రం బాగా నవ్వు తెప్పించాయి. అయితే ఈమాత్రం నవ్వుల కోసం నరకాన్ని అనుభవించాల్సి రావడం మాత్రం దారుణం. హీరోయిన్ పాత్ర చిత్రీకరణతో పాటు.. ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే సన్నివేశాలు ఈ సినిమాలో కోకొల్లలు. క్లైమాక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎపిసోడ్స్ కు ఎపిసోడ్స్ బోర్ కొట్టడం ఈ సినిమా ప్రత్యేకత.

ఇన్ని మైనస్సుల మధ్య కూడా కొన్ని ప్లస్సులున్నాయి. ఫస్టాఫ్ లో మెజారిటీ కామెడీ, సెంకడాఫ్ లో మరికొన్ని కామెడీ పంచుల్ని ఎంజాయ్ చేయొచ్చు. కాలభైరవ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. రితేష్ రానా నెరేషన్ ఎలా ఉన్నప్పటికీ అతడి డైలాగ్స్ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ చాలా బాగున్నాయి.

పాత్రల పరంగా చూసుకుంటే, లావణ్య త్రిపాఠి కంటే ముందు సత్య గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమాను చివరివరకు ప్రేక్షకుడు భరించాడంటే దానికి ప్రధాన కారణం సత్య. తన కామెడీ టైమింగ్ తో సత్య చించి పడేశాడు. అతడి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇది. ఇక లావణ్య త్రిపాఠి కూడా తన పాత్రకు న్యాయం చేసింది. ప్రతి సీన్ లో ఆమె ఎనర్జీ కనిపించింది. కానీ క్యారెక్టరైజేషన్ బాగా లేకపోవడం వల్ల హ్యాపీ పాత్ర తేలిపోయింది. వెన్నెల కిషోర్, నరేష్ అగస్త్య, గుండు సుదర్శన్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ గా చుసుకుంటే, ఇంతకుముందే చెప్పుకున్నట్టు సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయి. ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. దర్శకుడి విషయానికొస్తే.. అతడు ఈసారి నెరేషన్ కంటే తన సినిమాకు సంబంధించి టెక్నికల్ అంశాలపై ఎక్కువగా దృష్టిపెట్టినట్టు కనిపించింది. మత్తువదలరా సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రితేష్ రానా, ఆ సినిమా కథ-స్క్రీన్ ప్లే విషయంలో పూర్తి పట్టు ప్రదర్శించాడు. రెండో సినిమా హ్యాపీ బర్త్ డే విషయంలో మాత్రం ఆ సత్తా చూపించలేకపోయాడు. సెకెండాఫ్ లో అతడు పూర్తిగా గాడి తప్పాడు.

ఓవరాల్ గా కొన్ని కామెడీ సీన్లు, సత్య పెర్ఫార్మెన్స్ కోసం హ్యాపీ బర్త్ డే సినిమాను ఓసారి చూడొచ్చు.

First Published:  8 July 2022 1:52 AM GMT
Next Story