Telugu Global
NEWS

రేపటినుంచే వైసీపీ ప్లీనరీ.. తొలిరోజు తీర్మానాలు, మలిరోజు ప్రసంగాలు..

వైసీపీ ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటినుంచి రెండురోజులపాటు ప్లీనరీ జరుగుతుంది. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఉన్న స్థలంలో వైసీపీ ప్లీనరీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముందస్తుగా ఏపీలోని 175 నియోజకవర్గాల్లో ప్లీనరీలు జరిగాయి, ఆ తర్వాత జిల్లా స్థాయిలో కూడా ప్లీనరీలు నిర్వహించారు. ఇప్పుడు రాష్ట్రస్థాయి సమావేశానికి నేతలు సిద్ధమయ్యారు. జగన్ సీఎం అయిన తర్వాత జరుగుతున్న తొలి ప్లీనరీ కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్వహించేందుకు సిద్ధమయ్యారు నేతలు. ఇటీవలే టీడీపీ మహానాడు […]

ysrcp plenary
X

వైసీపీ ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటినుంచి రెండురోజులపాటు ప్లీనరీ జరుగుతుంది. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఉన్న స్థలంలో వైసీపీ ప్లీనరీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముందస్తుగా ఏపీలోని 175 నియోజకవర్గాల్లో ప్లీనరీలు జరిగాయి, ఆ తర్వాత జిల్లా స్థాయిలో కూడా ప్లీనరీలు నిర్వహించారు.

ఇప్పుడు రాష్ట్రస్థాయి సమావేశానికి నేతలు సిద్ధమయ్యారు. జగన్ సీఎం అయిన తర్వాత జరుగుతున్న తొలి ప్లీనరీ కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్వహించేందుకు సిద్ధమయ్యారు నేతలు. ఇటీవలే టీడీపీ మహానాడు కార్యక్రమం విజయవంతమైందని ఆ పార్టీ నాయకులు సంబరాల్లో ఉన్నారు. మహానాడు తర్వాత టీడీపీ నాయకుల మాట తీరు కూడా మారింది. దీంతో మహానాడుకి ధీటుగా వైసీపీ ప్లీనరీ ఏర్పాట్లు జరిగాయి.

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులకు కమిటీల బాధ్యతలు అప్పగించారు. స్వాగత కమిటీ, కార్యకర్తల కమీటీ, వాలంటీర్ల కమిటీ, భోజనాలు, డెకరేషన్, వసతి, వాహనాలు.. ఇలా అన్నిటినీ విభజించారు. ఎవరి బాధ్యతలు వారికి అప్పగించారు. పక్కా ప్రణాళికతో ఈ ప్లీనరీ విజయవంతం కోసం పార్టీ శ్రేణులు, నాయకులు కష్టపడుతున్నారు.

తొలిరోజు షెడ్యూల్..

రెండురోజులపాటు జరిగే ప్లీనరీలో తొలిరోజు తీర్మానాలు ప్రవేశ పెడతారు. మొదటి రోజు 5 అంశాలపై చర్చ జరుగుతుంది. ఈనెల 8న ఉదయం 8 గంటలకు ప్లీనరీ సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఉదయం 8నుంచి 10 గంటల వరకు ప్లీనరీకి వచ్చిన సభ్యులకు రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంటుంది. సరిగ్గా ఉదయం 10 గంటల 10 నిముషాలకు సీఎం జగన్ పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం సర్వమత ప్రార్థనలు ఉంటాయి. 10.55 గంటలకు పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రకటనను సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విడుదల చేస్తారు. ఆ తర్వాత సీఎం జగన్ ప్రసంగం, ఆ వెంటనే పార్టీ ఆడిట్ నివేదిక ప్రతిపాదన, ఆమోదం ఉంటాయి.

తీర్మానాలు..

11.45 గంటలకు మహిళా సాధికారత – దిశ చట్టం పై తొలి తీర్మానం ప్రవేశ పెడతారు. ఈ తీర్మానంపై మహిళా నేతలు ఉషశ్రీ చరణ్, రోజా, పోతుల సునీత, లక్ష్మీపార్వతి, జక్కంపూడి విజయలక్ష్మి ప్రసంగిస్తారు. రెండో అంశంగా విద్యపై తీర్మానం ప్రవేశపెడతారు. దీనిపై బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, కిలారి రోశయ్య, సుధాకర్ బాబు, నాగార్జున యాదవ్ ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2.15 గంటల నుంచి పావు గంట సేపు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. అదే సమయంలో మధ్యాహ్న భోజనం ఉంటుంది. ఇక 2.30 గంటలకు లబ్ధిదారులకు నగదు బదిలీపై తీర్మానం ప్రవేశపెడతారు. దీనిపై మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన.. ఇతర నాయకులు ప్రసంగిస్తారు. వైద్యంపై ప్రవేశపెట్టె తీర్మానంపై.. విడదల రజిని, సీదిరి అప్పలరాజు, అనిల్ కుమార్ యాదవ్, ఆళ్ల నాని ప్రసంగిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు పరిపాలనా- పారదర్శకత అంశంపై చర్చ జరుగుతుంది. తొలిరోజు ప్లీనరీ కార్యక్రమాన్ని సాయంత్రం 5 గంటలకు ముగిస్తారు. మలిరోజు సీఎం జగన్ సహా.. ఇతర నేతల కీలక ప్రసంగాలు ఉంటాయని తెలుస్తోంది.

తరలిన శ్రేణులు..

ఇప్పటికే నియోజకవర్గాలనుంచి ప్లీనరీకి నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక వాహనాలలో తరలి వెళ్తున్నారు. వారంతా విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో బస చేస్తున్నారు. ప్లీనరీకి దారితీసే గ్రామాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలకు మామిడి తోరణాలతో స్వాగత ఏర్పాట్లు చేశారు. ప్లీనరీరోజు ఏయే నియోజకవర్గాలనుంచి ఎన్ని వాహనాలు వస్తున్నాయనే విషయంలో నాయకులు పోటీ పడుతున్నారు.

విజయమ్మ రాకపై సస్పెన్స్..

గతంలో జరిగిన పార్టీ ప్లీనరీలకు వ్యవస్థాపక అధ్యక్షురాలి హోదాలో జగన్ తల్లి విజయమ్మ హాజరయ్యారు. కానీ ఇప్పుడు ఆమె షర్మిలతోపాటు హైదరాబాద్ లో ఉంటున్నారు. విజయమ్మ ప్లీనరీకి రాకపోతే తల్లీ కొడుకుల మధ్య గ్యాప్ ఉందన్న ప్రతిపక్షాల విమర్శలకు బలం చేకూరుతుంది. అయితే ఆమె ప్లీనరీకి వస్తారని ఈపాటికే నేతలు ప్రకటించారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా విజయమ్మ ప్లీనరీకి వస్తారని, అందులో అనుమానం ఏముంటుందని చెప్పారు. అయితే ఇప్పటి వరకూ ఆమె రాకపై అధికారిక సమాచారం లేదు. దీంతో ప్లీనరీ ప్రారంభమయ్యే వరకు విజయమ్మ వస్తారా లేదా అనేది అనుమానమే.

First Published:  7 July 2022 2:30 AM GMT
Next Story