Telugu Global
NEWS

టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆర్టీఐల అస్త్రం.. 100 దరఖాస్తులు చేసిన బీజేపీ

తెలంగాణలో టీఆర్ఎస్-బీజేపీ మధ్య పొలిటికల్ వార్ ముదురుతోంది. రాష్ట్ర అభివృద్ధి, నిధుల కేటాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదని ఎన్నాళ్ల నుంచో టీఆర్ఎస్ వాదిస్తోంది. హైదరాబాద్‌కు వచ్చిన పీఎం మోడీకి స్వయంగా సీఎం కేసీఆర్ నిధులు, అభివృద్ధి విషయంలో పలు ప్రశ్నలు బహిరంగంగానే సంధించారు. పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన సభలో మోడీ.. తెలంగాణకు కేంద్రం చేసిన పనుల గురించి వివరించే ప్రయత్నం చేశారు. కానీ, దీని వల్ల ఒరిగింది ఏమీ లేదు. ప్రధాని ప్రసంగాన్ని […]

టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆర్టీఐల అస్త్రం.. 100 దరఖాస్తులు చేసిన బీజేపీ
X

తెలంగాణలో టీఆర్ఎస్-బీజేపీ మధ్య పొలిటికల్ వార్ ముదురుతోంది. రాష్ట్ర అభివృద్ధి, నిధుల కేటాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదని ఎన్నాళ్ల నుంచో టీఆర్ఎస్ వాదిస్తోంది. హైదరాబాద్‌కు వచ్చిన పీఎం మోడీకి స్వయంగా సీఎం కేసీఆర్ నిధులు, అభివృద్ధి విషయంలో పలు ప్రశ్నలు బహిరంగంగానే సంధించారు. పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన సభలో మోడీ.. తెలంగాణకు కేంద్రం చేసిన పనుల గురించి వివరించే ప్రయత్నం చేశారు. కానీ, దీని వల్ల ఒరిగింది ఏమీ లేదు.

ప్రధాని ప్రసంగాన్ని తెలంగాణ సమాజం అసలు పట్టించుకోలేదు. ఇప్పటికీ తెలంగాణ అభివృద్ధి అంతా కేసీఆర్ చలవే అని నమ్ముతున్నారు. ఈ క్రమంలో బీజేపీ మరో అస్త్రాన్ని సంధించింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందే దీనికి పునాదులు పడ్డాయి. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనుల వివరాలను తెలుసుకునేందుకు సీఎంవో సహా పలు ఇతర శాఖల నుంచి సమాచారం కోరుతూ ఆర్టీఐ ద్వారా భారీగా దరఖాస్తులు దాఖలు చేశారు. తెలంగాణ చీఫ్ బండి సంజయ్ జూన్ 28న స్వయంగా 88 ఆర్టీఐ దరఖాస్తులు ఇచ్చినట్లు చెప్పారు. అంతే కాకుండా పార్టీ అనుబంధ విభాగాలను కూడా జిల్లా కేంద్రాల్లో మరిన్ని దరఖాస్తులు దాఖలు చేయాలని ఆదేశించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ 2014, 2018 ఎన్నికల సమయంలో చేసిన ప్రకటనలు, వాగ్దానాలకు సంబంధించిన పనులు ఎంత వరకు వచ్చాయని ఆ దరఖాస్తులో కోరారు. అంతే కాకుండా మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు ఎలా అమలు అవుతున్న విషయాన్ని కూడా తెలియజేయాలని పేర్కొన్నారు. దాదాపు 100 ఆర్టీఐలను సీఎంవో సహా, ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయం, ఫైనాన్స్, రెవెన్యూ, యాంటీ కరప్షన్ బ్యూరో, సోషల్ వెల్ఫేర్, పంచాయతి రాజ్, ఇరిగేషన్, ఎడ్యుకేషన్, హెల్త్ డిపార్ట్‌మెంట్లలో కూడా దాఖలు చేశారు. ఈ ఆర్టీఐల ద్వారా సమాధానం వస్తే, దాన్ని ఆధారం చేసుకొని టీఆర్ఎస్, కేసీఆర్‌పై విమర్శలు చేయాలని భావిస్తోంది.

2014 జూన్ 2 నుంచి 2022 జూన్ 25 వరకు సీఎం కేసీఆర్ ఏయే రాష్ట్రాల్లో పర్యటించారు, ఆ పర్యటనలకు అయిన ఖర్చు, వివరాలను కూడా తెలియజేయాలని కోరారు. ఇటీవల పలు జాతీయ పత్రికలకు కేసీఆర్ యాడ్స్ ఇచ్చారు. వాటి వివరాలను కూడా కావాలని కోరారు. ప్రగతి భవన్ నిర్మించడానికి ఎంత ఖర్చు అయ్యిందని కూడా అడిగారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు, ధరని పోర్టల్ అప్లికేషన్లు, ఆ సైట్ డిజైనర్లు ఎవరు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ఖర్చు, ఉద్యోగ నియామకాలు ఎంత వరకు వచ్చాయని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నియమించిన సలహాదారులు ఎలాంటి సలహాలు ఇచ్చారో కూడా తెలియజేయాలని కోరారు. ఇలా కేసీఆర్‌పై అన్ని వైపుల నుంచి దాడి చేసి దోషిగా నిలబెట్టాలని బీజేపీ భావిస్తోంది.

First Published:  6 July 2022 9:48 PM GMT
Next Story