Telugu Global
National

మమతపై అలక.. బెంగాల్ పోనంటున్న యశ్వంత్ సిన్హా

భారత నూతన రాష్ట్రపతి ఎన్నికకు రోజులు దగ్గరపడుతుండగా బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మధ్య దూరం పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఈ ఎన్నికకు ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్మును బీజేపీ ఎంపిక చేశాక.. దీదీ నాలుక్కరుచుకున్నంత పనిచేశారు. గిరిజన మహిళ ద్రౌపదిని ఎంపిక చేస్తామని మాకు ముందే చెప్పి ఉంటే మేం ఆమె అభ్యర్దిత్వానికి మద్దతు పలికేవారమేమో అంటూ ఓబాంబు పేల్చారు. ఈ ఎన్నికలో మోడీ ప్రభుత్వాన్ని, […]

మమతపై అలక.. బెంగాల్ పోనంటున్న యశ్వంత్ సిన్హా
X

భారత నూతన రాష్ట్రపతి ఎన్నికకు రోజులు దగ్గరపడుతుండగా బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మధ్య దూరం పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఈ ఎన్నికకు ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్మును బీజేపీ ఎంపిక చేశాక.. దీదీ నాలుక్కరుచుకున్నంత పనిచేశారు.

గిరిజన మహిళ ద్రౌపదిని ఎంపిక చేస్తామని మాకు ముందే చెప్పి ఉంటే మేం ఆమె అభ్యర్దిత్వానికి మద్దతు పలికేవారమేమో అంటూ ఓబాంబు పేల్చారు. ఈ ఎన్నికలో మోడీ ప్రభుత్వాన్ని, బీజేపీని ఎలాగైనా ఎదుర్కొనేందుకు విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా సీనియర్ రాజకీయ నేత యశ్వంత్ సిన్హాను ఏరికోరి ఎంపిక చేసిన దీదీ.. ఈ మధ్య ప్లేటు మార్చగానే.. ఊహించని ఈ పరిణామానికి సిన్హా బిత్తరపోయారు.

అప్పటివరకు తనకు బెంగాల్ నుంచి టీఎంసీ ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్లు పడవచ్చని ఆశించిన ఆయన.. ఖంగు తిన్నారు. రాష్ట్రపతి ఎన్నికలో విజయమన్నది ముఖ్యం కాదని, ఇది సిధ్ధాంతాల మధ్య పోటీ అని ప్రకటించిన సిన్హా.. ఇక ఓట్ల కోసం తాను బెంగాల్‌లో ప్రచారం చేయబోనని అంటున్నారు.

తన సొంత రాష్ట్రం జార్ఖండ్ లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది క‌నుక.. అక్కడికీ వెళ్లరాదని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆ రాష్ట్రంలో యూపీఏ మిత్ర పక్షం జార్ఖండ్ ముక్తి మోర్చా కూడా యూ టర్న్ తీసుకుంది మరి ! ‘బెంగాల్ లో మీరు ప్రచారం చేయకపోయినా ప‌ర్వాలేదు.. నేను చూసుకుంటాన్లెండి’ అని దీదీ ‘ హామీ’ ఇవ్వడంతో యశ్వంత్ సిన్హా కామ్ అయిపోయారు. మీరు అంతగా చెప్పాక ఇక నేను చేసేదేముంటుందని సైలెన్స్ కాక తప్పలేదు.

ఇక ఇక్కడ మమతమ్మ గారి భయం కూడా ఒకటుంది. ఈ ఎన్నికలో ద్రౌపది ముర్మును సమర్థించకపోతే ఉత్తర బెంగాల్, జంగల్ మహల్ ప్రాంతాల్లో గిరిజన ఓటు బ్యాంకు తన పార్టీకి దక్కదని ఆమె కంగారు పడిపోతున్నారని వార్త ! ద్రౌపది ముర్ము సంథాల్ తెగకు చెందిన మహిళ.. బెంగాల్ గిరిజన జనాభాలో ఈ తెగకు చెందిన వారు సుమారు 80 శాతం మంది ఉన్నారు. అలాంటిది వీళ్ళను కాదని సిన్హాకే ఓకే చెబితే నష్టం తనకేనని దీదీ భావించారట.. ఇలా అని పార్టీ వర్గాలు గుసగుసలాడుకున్నాయి.

జార్ఖండ్ విషయానికే వస్తే అక్కడ శిబూ సొరేన్ నేతృత్వంలోని జేఎంఎం కూడా సిన్హాకు మొండి చెయ్యి చూపింది. కాంగ్రెస్ తో కలిసి మేం సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపితే మాత్రమేం? మేము ముర్ము వైపే అని ఈ పార్టీ కూడా ఆమెకే జైకొట్టింది. జార్ఖండ్ లోనూ గిరిజన జనాభా లెక్కకు మించి ఉంది. ఇక యశ్వంత్ సిన్హా బీహార్ బాట పట్టాలని డిసైడయ్యారు.

ఈ రాష్ట్రంలో జేడీ-యూ లోని అసమ్మతి వర్గాలను ఆయన తనవైపు తిప్పుకునే యత్నం చేయవచ్చు. మరోవైపు- పులిమీద పుట్రలా మహారాష్ట్ర పరిణామాలు కూడా ఆయనకు విషమ పరీక్షనే సృష్టించాయి. శివసేనరెండు వర్గాలుగా చీలిపోవడంతో ఈక్వేషన్స్ మారిపోయాయి. ఈ రాష్ట్రం నుంచి ఎన్ని ఓట్లు సిన్హాకు పడతాయన్నది ప్రశ్నార్థకమే.. తెలంగాణలో టీఆరెస్ కి సంబంధించి ఎలెక్టోరల్ కాలేజీలో 24,796 ఓట్లు (2.30 శాతం) ఉన్నాయి. ఇవన్నీ సిన్హాకు ఖచ్చితంగా పడవచ్చు.. ఏమైనా.. ఎన్నిక రోజు దగ్గరపడేకొద్దీ సిన్హా కి అసలు సీన్ అర్థమైపోతోందని అంటున్నారు.

First Published:  7 July 2022 2:21 AM GMT
Next Story