Telugu Global

రాజ్యసభకు దక్షిణాది ప్రముఖులు.. సినీరంగానికి పెద్దపీట..

సినీరంగానికి చెందిన ప్రముఖులకు పెద్దపీట వేస్తూ రాష్ట్రపతి కోటాలో దక్షిణాది ప్రముఖులను రాజ్యసభకు నామినేట్ చేశారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి కోటాలో నలుగురు దక్షిణాది ప్రముఖులను కేంద్రం రాజ్యసభకు నామినేట్‌ చేసింది. ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి తండ్రి, సినీ కథా రచయిత వి.విజయేంద్ర ప్రసాద్‌, సంగీత దిగ్గజం ఇళయరాజా ఇందులో ఉన్నారు. క్రీడారంగం నుంచి పరుగుల రాణి పీటీ ఉష, సామాజిక సేవా రంగం నుంచి వీరేంద్ర హెగ్డేను రాజ్యసభకు […]

Rajya Sabha polls
X

సినీరంగానికి చెందిన ప్రముఖులకు పెద్దపీట వేస్తూ రాష్ట్రపతి కోటాలో దక్షిణాది ప్రముఖులను రాజ్యసభకు నామినేట్ చేశారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి కోటాలో నలుగురు దక్షిణాది ప్రముఖులను కేంద్రం రాజ్యసభకు నామినేట్‌ చేసింది. ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి తండ్రి, సినీ కథా రచయిత వి.విజయేంద్ర ప్రసాద్‌, సంగీత దిగ్గజం ఇళయరాజా ఇందులో ఉన్నారు. క్రీడారంగం నుంచి పరుగుల రాణి పీటీ ఉష, సామాజిక సేవా రంగం నుంచి వీరేంద్ర హెగ్డేను రాజ్యసభకు నామినేట్‌ చేశారు. ఈ సందర్భంగా వారు అందించిన సేవల్ని గుర్తు చేసుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ట్వీట్‌ చేశారు.

ఇళయరాజా సంగీతం అనేక భావాలకు ప్రతిబింబమని.. అనేక తరాలకు ఆయన సంగీతం ఓ వారధిలా నిలిచిందని మోదీ తన ట్వీట్ లో ప్రస్తుతించారు.

పరుగుల రాణి పీటీ ఉష జీవితం.. భారతీయులందరికీ ఆదర్శనీయమన్నారు మోదీ. తాను వ్యక్తిగతంగా ప్రతిభ చూపడమే కాకుండా.. ఎంతోమంది క్రీడాకారుల్ని ఆమె తీర్చిదిద్దారని చెప్పారు.

విజయేంద్ర ప్రసాద్ దశాబ్దాల పాటు సృజనాత్మక సేవలు అందించారని.. ఆయన సేవలు మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేశాయన్నారు మోదీ. వీరేంద్ర హెగ్డే సేవారంగంలో ఎనలేని కృషి చేశారన్నారు.

ఆమధ్య మోదీని అంబేద్కర్ తో పోలుస్తూ ఇళయరాజా ఓ పుస్తకానికి రాసిన ముందుమాట సంచలనంగా మారింది. అంబేద్కర్ అండ్ మోదీ అనే ఆ పుస్తకానికి ముందు మాట రాసిన ఇళయరాజా.. మోదీని చూస్తే అంబేద్కర్ నిజంగా గర్వపడేవారని అన్నారు. అప్పట్లోనే ఇళయరాజాకు రాజ్యసభ కన్ఫామ్ అనే ప్రచారం జరిగింది. నేడది నిజమని నిరూపితమైంది. ఇక తెలుగు సినీ రంగం నుంచి రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కి రాజ్యసభ అవకాశం ఇవ్వడం కూడా ఆసక్తికర పరిణామమే.

First Published:  6 July 2022 10:29 AM GMT
Next Story