Telugu Global
National

వస్తా..! అన్నాడీఎంకేలో మళ్ళీ చక్రం తిప్పుతా.. – శశికళ

తమిళనాడులో మళ్ళీ ‘చిన్నమ్మ’ శశికళ హవా కొన‌సాగ‌నుందా..? తన రాజకీయ ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు ఆమె రంగంలోకి దిగనున్నారా..? తాజాగా ఆమె చేసిన ప్రకటనలను చూస్తే `ఎస్‌` అనిపిస్తుంది. అన్నాడీఎంకేకి తిరిగి పూర్వ వైభవం తెస్తానని, పార్టీని ముందుకు తీసుకువెళ్తానని ఆమె ప్రకటించారు. ఎంజీఆర్, అమ్మ (జయలలిత) పార్టీని ఎలా ముందంజలో నడిపారో తాను కూడా అలాగే పార్టీ ముందుకు దూసుకువెళ్లేలా కృషి చేస్తానని ఆమె చెప్పారు, మన పార్టీ కేడర్ కి ఈ విషయం బాగా […]

వస్తా..! అన్నాడీఎంకేలో మళ్ళీ చక్రం తిప్పుతా.. – శశికళ
X

తమిళనాడులో మళ్ళీ ‘చిన్నమ్మ’ శశికళ హవా కొన‌సాగ‌నుందా..? తన రాజకీయ ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు ఆమె రంగంలోకి దిగనున్నారా..? తాజాగా ఆమె చేసిన ప్రకటనలను చూస్తే 'ఎస్‌' అనిపిస్తుంది. అన్నాడీఎంకేకి తిరిగి పూర్వ వైభవం తెస్తానని, పార్టీని ముందుకు తీసుకువెళ్తానని ఆమె ప్రకటించారు. ఎంజీఆర్, అమ్మ (జయలలిత) పార్టీని ఎలా ముందంజలో నడిపారో తాను కూడా అలాగే పార్టీ ముందుకు దూసుకువెళ్లేలా కృషి చేస్తానని ఆమె చెప్పారు, మన పార్టీ కేడర్ కి ఈ విషయం బాగా తెలుసని, పైగా నిజాయితీగా, సమర్థంగా పని చేసేవారు కావాలన్నారు. గత సంగతుల గురించి, ఇప్పటి విషయాల గురించి ఏది పడితే అది మాట్లాడేవారు కాదు కావలసింది.. తమిళనాడు ప్రజల ప్రయోజనాలకు దోహదపడేవారే ఇప్పుడు అవసరం అని శ‌శిక‌ళ‌ వ్యాఖ్యానించారు. తానిప్పటికీ ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శినే అని చెప్పిన ఆమె.. సమయం వచ్చినప్పుడు పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్తానన్నారు.

పార్టీకి సింగిల్ లీడర్ అవసరమా అని ఓ జర్నలిస్టు అడగ్గా.. పార్టీ కార్యకర్తలే ఈ విషయాన్ని నిర్ణయిస్తారని చెప్పారు. ఎనైనా చెప్పండి.. వారిదే తుది తీర్పు అని చాకచక్యంగా శశికళ అన్నారు. పార్టీ నేత ఎడప్పాడి పళనిస్వామి మద్దతుదారులు ఈ నెల 11న ఆయనను పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకునేందుకు జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. ఇదే విషయమై ఆమెను అడిగినప్పుడు.. ఇప్పుడు జరుగుతున్నది అసలు జనరల్ కౌన్సిల్ సమావేశమే కాదని పేర్కొన్నారు. చూద్దాం ! ఏం జరుగుతుందో అన్న తీరులో స్పందించారు.

అన్నా డీఎంకేలో ఐక్యత అవసరమని పదేపదే చెబుతున్న ‘చిన్నమ్మ’ పార్టీలోని అసమ్మతి నేతలను, కార్యకర్తలను తనవైపు బాగానే తిప్పుకున్నారు. పార్టీకి శ‌శిక‌ళ‌ నాయకత్వం అవసరమని చెబుతున్న నేతల సంఖ్య పెరుగుతోంది. అయితే శశికళ మళ్ళీ పార్టీలోకి రావడాన్నిపళనిస్వామి గట్టిగా వ్యతిరేకిస్తున్న విషయం గమనార్హం.. ఆమెను పార్టీనుంచి బహిష్కరించడానికి ఉద్దేశించిన తీర్మానాన్ని జనరల్ కౌన్సిల్ లోగడ ఆమోదించింది కూడా..

కోడనాడు కేసుపై శశికళ మౌనం
2017 ఏప్రిల్ లో జరిగిన కోడనాడు కేసుపై వ్యాఖ్యానించేందుకు శశికళ నిరాకరించారు. నాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వానికి ఇది పెను సవాలుగా మారింది. నీలగిరి జిల్లాలోని కోడనాడులో ఎస్టేట్ సెక్యూరిటీ గార్డు హత్య, జయలలిత బంగళాలో భారీ చోరీ, ఆ తరువాత ఎస్టేట్ ఉద్యోగి సూసైడ్, అనంతరం మూడు రోడ్డు ప్రమాదాలు రాష్ట్రాన్ని వణికించాయి. పార్టీకి ఒకరే నాయకులు ఉండాలన్న నినాదాన్ని లేవనెత్తడం ద్వారా పళనిస్వామి కోడనాడు సమస్యను కవర్ చేయజూస్తున్నారని శశికళ ఆరోపించారు.

అయితే ప్రస్తుత సీఎం స్టాలిన్ తన ఎన్నికల ప్రచారంలో కోడనాడు అంశాన్ని కూడా ప్రస్తావించారని, డీఎంకే అధికారంలోకి వస్తే ఈ కేసు నిందితులపై చర్య తీసుకుంటానని హామీ ఇచ్చారని ఆమె గుర్తుచేశారు. మరి ఇప్పుడు ఎందుకు చర్య తీసుకోలేదో ఆయనను అడగాలని ఆమె మీడియాకు సూచించారు.

First Published:  6 July 2022 6:36 AM GMT
Next Story