Telugu Global
NEWS

కుప్పంలో టీడీపీని ఖాళీ చేయించేలా వైసీపీ వ్యూహాలు.. ఫలిస్తున్న పెద్దిరెడ్డి రాజకీయం

రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడించాలనేది వైసీపీ టార్గెట్. అది ఇప్పటికిప్పుడు పెట్టుకున్న లక్ష్యం కాదు. ఇందుకోసం గత కొన్నేళ్లుగా వైసీపీ ప్రత్యేక వ్యూహంతో ముందుకు పోతోంది. 1989 నుంచి చంద్రబాబుకు కంచుకోటలా మారిపోయిన కుప్పం నియోజకవర్గంలో.. లక్షకు తగ్గని మెజారిటీతో ఆయన గెలుస్తూ వచ్చారు. అయితే గత ఎన్నికల్లో ఆ మెజార్టీని 30 వేల ఓట్లకు తగ్గించడంలో వైసీపీ విజయవంతం అయ్యింది. ఇక రాబోయే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నుంచి బాబును పంపేయడమే లక్ష్యంగా […]

కుప్పంలో టీడీపీని ఖాళీ చేయించేలా వైసీపీ వ్యూహాలు.. ఫలిస్తున్న పెద్దిరెడ్డి రాజకీయం
X

రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడించాలనేది వైసీపీ టార్గెట్. అది ఇప్పటికిప్పుడు పెట్టుకున్న లక్ష్యం కాదు. ఇందుకోసం గత కొన్నేళ్లుగా వైసీపీ ప్రత్యేక వ్యూహంతో ముందుకు పోతోంది. 1989 నుంచి చంద్రబాబుకు కంచుకోటలా మారిపోయిన కుప్పం నియోజకవర్గంలో.. లక్షకు తగ్గని మెజారిటీతో ఆయన గెలుస్తూ వచ్చారు. అయితే గత ఎన్నికల్లో ఆ మెజార్టీని 30 వేల ఓట్లకు తగ్గించడంలో వైసీపీ విజయవంతం అయ్యింది. ఇక రాబోయే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నుంచి బాబును పంపేయడమే లక్ష్యంగా పనిచేస్తోంది.

టీడీపీ అధినేత చంద్రబాబుకు కుప్పంలో చెక్ పెట్టే బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఎంపీ మిథున్ రెడ్డి కూడా చూస్తున్నారు. ఇటీవల కాలంలో వైసీపీ వ్యూహాలతో చంద్రబాబు కోట బీటలు వారింది. గ్రామస్థాయి నుంచి టీడీపీని వైసీపీ దెబ్బకొడుతూ వస్తోంది. పంచాయతీ, మండల, జిల్లాపరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో వరుసగా వైసీపీ విజయం సాధించింది. అక్కడ ఏ ఎన్నికలైనా టీడీపీనే గెలిచేది. కానీ గత కొన్నాళ్లుగా వైసీపీకి గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోతోంది. ఓట్ల శాతాన్ని కూడా టీడీపీ భారీగా కోల్పోయింది. చంద్రబాబుకు గ్రామాల్లో నమ్మకస్తులుగా పేరున్న వాళ్లను వైసీపీలోకి తీసుకొని రావడంతో పెద్దిరెడ్డి సక్సెస్ అయ్యారు.

మంగళవారం కూడా కుప్పం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో జాయిన్ అయ్యారు. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి సమక్షంలో వాళ్లు వైసీపీ కండువా కప్పుకున్నారు. భారీ సంఖ్యలో తిరుపతిలోని మంత్రి కార్యాలయానికి చేరుకొని మంత్రిని కలిశారు. నియోజకవర్గంలో బలమైన వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలే వీళ్లంతా. వీరు కొన్ని ఊర్లలో గెలుపును నిర్దేశించగలిగే బలమైన వర్గం. ఒక విధంగా ఇది వైసీపీ విజయమనే చెప్పుకోవచ్చు.

రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని మంత్రి పెద్దరెడ్డి స్పష్టం చేశారు. కుప్పంలో టీడీపీ ఖాళీ అవుతుందని, 2024లో వైసీపీ అభ్యర్థి గెలవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తంచేశారు. కులం, మతం, పార్టీలకు అతీతంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన అందిస్తున్నారని, ఆయన పాలనకు ఎంతో మంది ఆకర్షితులవుతున్నారని చెప్పారు. చంద్రబాబు ఈసారి ఓడిపోవడం తప్పదని చెప్పారు. కుప్పంలో టీడీపీని ఖాళీ చేయించేదాక విశ్రమించేది లేదన్నారు. ఓటర్లు వైసీపీ అభ్యర్థి విషయంలో కన్ఫ్యూజ్ కావొద్దని, అక్కడి నుంచి ఎమ్మెల్సీ భరత్ పోటీ చేస్తారని ఆయన స్పష్టం చేశారు.

First Published:  5 July 2022 10:23 PM GMT
Next Story