Telugu Global
NEWS

మళ్లీ మొదలైంది.. మంత్రి సబిత వర్సెస్ తీగల కృష్ణారెడ్డి

అధికార టీఆర్ఎస్ పార్టీలోని ఇద్దరు కీలక నేతల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. మహేశ్వరం నియోజకవర్గంలో 12 ఏళ్లుగా నువ్వా, నేనా అన్నట్లు ఉన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి తమ విభేదాలను మరోసారి బయటపెట్టుకున్నారు. మంత్రి సబిత ఇంద్రారెడ్డి 2009లో తొలిసారి మహేశ్వరం నుంచి పోటీ చేసి ఆనాటి వైఎస్ఆర్ కేబినెట్‌లో హోం మంత్రి అయ్యారు. ఆ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన తీగల కృష్ణారెడ్డి ఓడిపోయారు. అప్పటి నుంచే […]

Teegala VS Sabitha
X

అధికార టీఆర్ఎస్ పార్టీలోని ఇద్దరు కీలక నేతల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. మహేశ్వరం నియోజకవర్గంలో 12 ఏళ్లుగా నువ్వా, నేనా అన్నట్లు ఉన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి తమ విభేదాలను మరోసారి బయటపెట్టుకున్నారు. మంత్రి సబిత ఇంద్రారెడ్డి 2009లో తొలిసారి మహేశ్వరం నుంచి పోటీ చేసి ఆనాటి వైఎస్ఆర్ కేబినెట్‌లో హోం మంత్రి అయ్యారు. ఆ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన తీగల కృష్ణారెడ్డి ఓడిపోయారు. అప్పటి నుంచే ఇరువురి నేతల మధ్య రాజకీయ విభేదాలు పొడసూపాయి.

2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో తీగల కృష్ణారెడ్డి టీడీపీ తరపున భారీ మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత కేసీఆర్ ప్రోత్సాహంతో తీగల టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. 2018 ముందస్తు ఎన్నికల్లో తీగల టీఆర్ఎస్ తరపున, సబిత కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో సబిత 9వేల పై చిలుకు మెజార్టీతో గెలిచారు. కానీ, తర్వాత టీఆర్ఎస్‌లో చేరి ఏకంగా మంత్రి పదవి పొందారు.

ఒకప్పుడు వేర్వేరు పార్టీల్లో ఉండి విమర్శలు చేసుకున్న ఇద్దరు నాయకులు.. టీఆర్ఎస్‌లో ఉన్నా.. ఎడమొఖం పెడమొఖం గానే వ్యవహరించారు. సబితతో కలిసిపోవాలని అధిష్టానం సూచించినా.. తీగల మాత్రం ఆ మాటలు ఖాతరు చేయలేదు. ప్రతీ నిత్యం ఆమెపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. తనకు పార్టీలో సరైన ప్రాధాన్యత లభించడం లేదని.. తమ వర్గాన్ని మంత్రి సబిత అణచి వేస్తున్నారనే కారణంతో తీగల కృష్ణారెడ్డి పార్టీని వీడాలని భావించారు. ఇటీవల కేటీఆర్ బుజ్జగించడంతో పార్టీ మార్పును విరమించుకున్నారు. కానీ సబితపై విమర్శలు మాత్రం ఆపలేదు.

తాజాగా, సబితను టార్గెట్ చేస్తూ తీగల తీవ్ర విమర్శలు చేశారు. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని మీర్‌పేట ప్రాంతంలో సబితా ఇంద్రారెడ్డి కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. సబిత అండదండలతో ఏకంగా చెరువులు, పాఠశాలల స్థలాలు కూడా వదలకుండా ఆక్రమిస్తున్నారని దుయ్యబట్టారు. అసలు సబిత టీఆర్ఎస్ నుంచి గెలవలేదని.. వేరే పార్టీ నుంచి వచ్చిందని.. ఇప్పుడు పార్టీకి కూడా నష్టం చేకూరేలా వ్యవహరిస్తోందని తీగల అన్నారు.

మీర్‌పేట్ చెరువును రక్షించుకోవడానికి అవసరం అయితే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని తీగల చెప్పారు. ఆమె అభివృద్ధిని గాలికి వదిలేసి.. కబ్జాలపై దృష్టి పెట్టారని విమర్శించారు. ఆమె పేదల కోసం ఏ ఒక్కపని చేయడం లేదని ఆరోపించారు. త్వరలోనే సీఎం కేసీఆర్‌ను కలిసి ఆమె గురించి పూర్తి విషయాలు చెప్తానని తీగల స్పష్టం చేశారు. ఇరువురు కీలక నేతల వ్యవహారం ఇప్పుడు మహేశ్వరంలోనే కాకుండా టీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కాగా, ఇప్పటి వరకు తీగల చేసిన ఆరోపణలపై మంత్రి సబిత స్పందించలేదు.

First Published:  5 July 2022 4:54 AM GMT
Next Story