Telugu Global
National

కర్ణాటక పోలీసు నియామకాల్లో భారీ స్కామ్.. పోస్టుకు 70 లక్షలా ?

కర్ణాటకలో పోలీసు నియామకాల్లో జరిగిన భారీ స్కామ్ రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదిపింది. ఓ సబ్ ఇన్‌స్పెక్ట‌రే ‘దళారిగా’ వ్యవహరించడం చూసి విపక్షాలు ఆశ్చర్యపోతున్నాయి. మొదట కల్ బుర్గి జిల్లాలో ఇది వెలుగులోకి వచ్చింది. సబ్ ఇన్‌స్పెక్ట‌ర్ పోస్టులకు జరిగిన రాత పరీక్షలో ఒక అభ్యర్థి రాసిన ఓఎంఆర్ షీట్ ని గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 100 ప్రశ్నలకు గాను ఆ అభ్యర్థి 21 ప్రశ్నలకే సమాధానాలు రాసినప్పటికీ అతడ్ని పరీక్ష పాస్ […]

కర్ణాటక పోలీసు నియామకాల్లో భారీ స్కామ్.. పోస్టుకు 70 లక్షలా ?
X

కర్ణాటకలో పోలీసు నియామకాల్లో జరిగిన భారీ స్కామ్ రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదిపింది. ఓ సబ్ ఇన్‌స్పెక్ట‌రే ‘దళారిగా’ వ్యవహరించడం చూసి విపక్షాలు ఆశ్చర్యపోతున్నాయి. మొదట కల్ బుర్గి జిల్లాలో ఇది వెలుగులోకి వచ్చింది. సబ్ ఇన్‌స్పెక్ట‌ర్ పోస్టులకు జరిగిన రాత పరీక్షలో ఒక అభ్యర్థి రాసిన ఓఎంఆర్ షీట్ ని గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 100 ప్రశ్నలకు గాను ఆ అభ్యర్థి 21 ప్రశ్నలకే సమాధానాలు రాసినప్పటికీ అతడ్ని పరీక్ష పాస్ చేశారట. అంటే పరీక్షను ఎంత ఘోరంగా నిర్వహించారో, ఎలా, ఎన్ని అవకతవకలు జరిగాయో స్పష్టమైంది.

ఇది ఎంత స్థాయికి వచ్చిందంటే ఓ డీజీపీ రాంక్ స్థాయి అధికారిని కర్ణాటక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిబ్బంది అరెస్టు చేసేంతవరకు వచ్చింది. ఐపీఎస్ ఆఫీసర్ అయిన అమృత్ పాల్ అనే ఈయన ఎస్ఐ రిక్రూట్మెంట్ విభాగానికి హెడ్ కూడా..ఒక్కో పోస్టుకు 70 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువగా ముడుపులు చెల్లించినట్టు చెబుతున్న అభ్యర్థులను రిక్రూట్ చేసుకున్నారట. పైగా ఇలాంటి వారి ఆప్టికల్ మార్క్ రెకగ్నిషన్ (ఓఎంఆర్) షీట్లను రిక్రూట్మెంట్ డివిజన్ కార్యాలయంలోనే తారుమారు చేశారన్న ఆరోపణలున్నాయి. ఇవన్నీ అమృత్ పాల్ కనుసన్నల్లోనే జరిగాయట. ఇండియన్ పోలీస్ సర్వీస్ కర్ణాటక కేడర్ లో డీజీపీ ర్యాంక్ స్థాయి అధికారిని అరెస్టు చేయడం ఇదే మొట్టమొదటిసారి. నాలుగు సార్లు విచారించిన అనంతరం ఈయనను అరెస్టు చేశారు.

ఈ స్కామ్‌కి సంబంధించి జరిగిన దర్యాప్తులో ఓ బీజేపీ నేతతో పాటు కల్ బుర్గి లోని ఓ స్కూలు యజమాని, ఓ కాలేజీ ప్రిన్సిపాల్, మరికొందరి హస్తం ఉందని వెల్లడైంది. ఇలాగే ఓ డీఎస్పీ, సీఐ, ఎస్ఐ, మరికొందరు కానిస్టేబుల్స్ , ఓ ఎమ్మెల్యే గన్ మన్ కి కూడా ప్రమేయం ఉన్నట్టు తేలడంతో వారినందరినీ అరెస్టు చేశారు. ఎస్ఐ పోస్టులకు ‘ఎంపిక’ చేసిన 40 మంది అభ్యర్థులతో సహా దాదాపు 79 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఎగ్జామ్ సెంటర్ స్టాఫ్ కూడా ఉన్నారు. 545 పోస్టుల భర్తీకి గాను గత ఏడాది అక్టోబరులో నియామక ప్రక్రియ చేపట్టారు. 54 వేలమందికి పైగా అభ్యర్థులు పరీక్ష రాశారు. అయితే ఈ స్కామ్ బయటపడ్డాక ప్రభుత్వం ఈ పరీక్షనే రద్దు చేసి.. మళ్ళీ తాజాగా ఎగ్జామ్ నిర్వహిస్తామని పేర్కొంది. ఈ కుంభకోణంలో ఎంతటివారున్నా వదిలిపెట్టేదిలేదని సీఎం బొమ్మై, హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర హెచ్చరించారు.

సీఎం బొమ్మై రాజీనామా చేయాల్సిందే.. రాహుల్ గాంధీ
కర్ణాటకలో బీజేపీ విశృంఖల అవినీతికి పాల్పడిందని, పోలీసు శాఖ ఉద్యోగ నియామకాల్లో భారీ అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఇందుకు బాధ్యత వహించి సీఎం బసవరాజ్ బొమ్మై రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోడీపై కూడా నిప్పులు చెరిగారు. అవినీతిని సహించబోనన్న ప్రధాని.. కర్ణాటక సీఎం బొమ్మైపై ఎలాంటి చర్య ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.

అవినీతిలో బీజేపీ తనకు తానే సాటి అని నిరూపించుకుందని, కర్ణాటకలోని వేలాది యువకుల ఆశలను నీరు గార్చిందని, పోలీసు ఉద్యోగాలను అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్-ఛార్జ్ రణదీప్ సూర్జేవాలా సైతం ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. స్కామ్ జరిగినప్పుడు బొమ్మై హోం శాఖను కూడా చూశారన్న విషయాన్ని మరువరాదన్నారు. అయితే .. సీఎం బొమ్మై మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసు దర్యాప్తులో తమ ప్రభుత్వం సీఐడీకి పూర్తి అధికారాలిచ్చిందని తెలిపారు. అందువల్లే ఓ సీనియర్ పోలీసు అధికారిని కూడా అరెస్టు చేయడం జరిగిందన్నారు.

First Published:  5 July 2022 2:27 AM GMT
Next Story