Telugu Global
NEWS

చేతులెత్తేసిన భారత బౌలర్లు.. ఏకైక టెస్టులో ఇంగ్లాండ్ రికార్డు విజయం

ఇంగ్లాండ్ గడ్డపై తొలి సారి టెస్ట్ సిరీస్ గెలవాలన్న టీమ్ ఇండియా ఆశలు అడియాశలయ్యాయి. ఏడాది క్రితం జరిగిన సిరీస్‌లో వాయిదా పడిన చివరి టెస్టును జూలై 1 నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా నిర్వహించారు. మ్యాచ్‌ను మూడున్నర రోజుల పాటు తమ చేతిలోనే ఉంచుకున్న టీమ్ ఇండియా.. నాలుగో రోజు చివరి సెషన్, ఐదో రోజు చేతులెత్తేసింది. భారత జట్టు బౌలర్లు పేలవ ప్రదర్శన చేయడంతో 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ జట్టు కేవలం 3 […]

England vs India
X

ఇంగ్లాండ్ గడ్డపై తొలి సారి టెస్ట్ సిరీస్ గెలవాలన్న టీమ్ ఇండియా ఆశలు అడియాశలయ్యాయి. ఏడాది క్రితం జరిగిన సిరీస్‌లో వాయిదా పడిన చివరి టెస్టును జూలై 1 నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా నిర్వహించారు. మ్యాచ్‌ను మూడున్నర రోజుల పాటు తమ చేతిలోనే ఉంచుకున్న టీమ్ ఇండియా.. నాలుగో రోజు చివరి సెషన్, ఐదో రోజు చేతులెత్తేసింది.

భారత జట్టు బౌలర్లు పేలవ ప్రదర్శన చేయడంతో 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ జట్టు కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ జానీ బెయిర్‌స్టో (114), జో రూట్ (142) శతకాలు బాదడంతో ఇంగ్లాండ్ రికార్డు విజయం సాధించి సిరీస్‌ను 2-2తో సమం చేసింది.

భారత జట్టు నిర్దేశించిన 378 పరుగల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ నాలుగో రోజు మూడు వికెట్లు త్వరగానే కోల్పోయింది. దీంతో భారత జట్టు విజయం ఖాయమనే అభిమానులు భావించారు. అయితే జానీ బెయిర్‌స్టో, జో రూట్ మరో వికెట్ కోల్పోకుండా చివరి సెషన్‌లో ధాటిగా ఆడారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 259/3 స్కోర్‌తో పటిష్టంగా నిలిచింది.

ఇక చివరి రోజు ఇంగ్లాండ్ 259/3 ఓవర్ నైట్ స్కోర్‌తో బ్యాటింగ్ ప్రారంభించింది. ఆరంభం నుంచే ఇద్దరు బ్యాటర్లు భారత బౌలర్లపై విరుచుకపడ్డారు. వరుసగా బౌండరీలు సాధిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. అసలు వికెట్ పడకుండానే మిగిలిన పరుగులను రాబట్టారు. తొలి సెషన్‌లోనే ఇంగ్లాండ్‌కు విజయాన్ని అందించారు. ఈ క్రమంలో ముందుగా జో రూట్ 136 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోగా.. ఆ తర్వాత బెయిర్ ‌స్టో 138 బంతుల్లో సెంచరీ బాదాడు. వీరిద్దరూ కలసి నాలుగో వికెట్‌కు అజేయంగా 254 పరుగులు జోడించి ఇంగ్లాండ్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు. ఇంగ్లాండ్ టెస్టు చరిత్రలో ఛేదించిన భారీ లక్ష్యం ఇదే కావడం గమనార్హం. జానీ బెయిర్‌స్టోకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, జో రూట్, జస్ప్రిత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.

స్కోర్ బోర్డు:

ఇండియా తొలి ఇన్నింగ్స్ : 416 ఆలౌట్
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 284 ఆలౌట్
ఇండియా రెండో ఇన్నింగ్స్ : 245 ఆలౌట్
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ : 378/3

ఇంగ్లాండ్ ఛేదించిన భారీ లక్ష్యాలు

378 – ఇండియాపై ఎడ్జ్‌బాస్టన్‌లో 2022
359 – ఆస్ట్రేలియాపై లీడ్స్‌లో 2019
332 – ఆస్ట్రేలియాపై మెల్‌బోర్న్‌లో 1928/29
315 – ఆస్ట్రేలియాపై లీడ్స్‌లో 2000

First Published:  5 July 2022 8:21 AM GMT
Next Story