Telugu Global
NEWS

టీఆరెస్ దెబ్బకు తెలంగాణలో పారని బీజేపీ పాచిక

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రాష్ట్రంలో 18 యేండ్ల తరువాత జరిగాయి. కానీ అప్పటి పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు ఎంతో తేడా ఉందని రాష్ట్రంలో తాము అధికారంలోకి రాబోతున్నామని, ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో ఉపయోగపడతాయని లేని పోనీ హడావిడి సృష్టించి, లేని పోనీ భ్రమలను కల్పించి ఇక్కడి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది బీజేపీ.

TRS And BJP
X

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రాష్ట్రంలో 18 యేండ్ల తరువాత జరిగాయి. కానీ అప్పటి పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు ఎంతో తేడా ఉందని రాష్ట్రంలో తాము అధికారంలోకి రాబోతున్నామని, ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో ఉపయోగపడతాయని లేని పోనీ హడావిడి సృష్టించి, లేని పోనీ భ్రమలను కల్పించి ఇక్కడి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది బీజేపీ. కానీ ఈ విషయాన్ని ముందే పసిగట్టిన టీఆర్ఎస్ పార్టీ బీజేపీని ఎదుర్కోవడంలో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించింది.

నరేంద్ర మోడీ సర్కార్ వైఫల్యాలను, గత ఎనిమిదేండ్లుగా రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని పెద్ద ఎత్తున జనంలోకి తీసుకెళ్లింది టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా. మరోవైపు విద్వేషం కాదు వికాసం కావాలి అన్న పిలుపుతో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ప్రసంగాన్ని వీడియోల రూపంలో ప్రజలకు చేరవేసింది టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా. అధికారంలో ఉన్న ఒక జాతీయ పార్టీగా రాష్ట్రంలో బీజేపీ పార్టీకి ప్రచారం కల్పించాలన్న ఆ పార్టీ నాయకుల ఎత్తులు ఫలించలేదు.

సాలు దొరా సెలవు దొరా అంటూ బీజేపీ కార్యాలయం వద్ద టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డు ప్రచారం బీజేపీ పార్టీకి పెద్ద మైనస్ అయింది. ఈ బోర్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ పార్టీ నాయకుల స్పందన పెద్దఎత్తున ప్రజల్లోకి వెళ్ళింది.

అదే క్రమంలో, ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లుగా 'bye bye modi' పేరుతో టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పెద్దఎత్తున ప్రచారాన్ని చేపట్టింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒక ప్రాంతీయ పార్టీ మీద బీజేపీ చేసిన ప్రచారం పక్కకు వెళ్లి, జాతీయ పార్టీని ప్రాంతీయ పార్టీ ఎండగట్టిన తీరు జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మోడీ సర్కార్ వైఫల్యాల మీద టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకు జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున మద్దతు లభించింది.

మరోవైపు రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రాకను పురస్కరించుకొని స్వాగత కార్యక్రమంలో మోడీ సర్కార్ వైఫల్యాలను సీఎం కేసీఆర్ ఎండగడుతూ హిందీలో చేసిన ప్రసంగం దేశ ప్రజలను ఆకర్షించింది. కేసీఆర్ విజన్ పట్ల దేశ ప్రజలకు ఒక అవగాహన ఏర్పడింది. ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు మోడీ నుండి జవాబు కరువైంది.

ఈ విషయాన్ని ప్రజలు గుర్తించేలా చేయడంలో టీఆర్ఎస్ పార్టీ 100 శాతం విజ్జయవంతమైంది. కేసీఆర్ ప్రశ్నలకు మోడీ సమాధానం ఇవ్వడు, బిజెపి తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారీ అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన కామెంట్ బీజేపీ పార్టీ దగ్గర సమాధానం లేదు అని ఓటమిని పరోక్షంగా ఒప్పుకున్నట్లయింది.

హైదరాబాద్ లో పార్టీ మీటింగ్ రోజున 'JumlaKingModi' హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వ్యూహాత్మకంగా చేసిన ఎదురుదాడి జాతీయ స్థాయిలో ట్రెండింగ్ మొదటిస్థానంలో ఉండటం విశేషం. ఎప్పుడూ సోషల్ మీడియాను నమ్ముకుని అవాస్తవాలను ప్రచారం చేసే బీజేపీకి అదే సోషల్ మీడియాను వాడుకొని వాస్తవాలను ప్రచారం చేయడంలో టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగం విజయం సాధించింది. విభజన హామీలకు మొండిచేయి మొదలుకొని దేశంలో అభివృద్ధి కుంటుపడుతున్న తీరు, బీజేపీ విద్వేష రాజకీయాలను ఎండగట్టడంలో టీఆర్ఎస్ విజయవంతం అయింది.

First Published:  5 July 2022 1:53 AM GMT
Next Story