Telugu Global
International

స్త్రీల వ్యాధిపై మాస్టర్ క్లాస్… ప్యానల్ లో అందరూ మగవారే

యురోపియన్ ఎండోమెట్రియోసిస్ లీగ్ (ఈఈఎల్ ).. అనే సంస్థ లండన్ లో… వచ్చే నవంబరులో ఎండోమెట్రియోసిస్ అనే అనారోగ్యానికి సంబంధించి ఒక మాస్టర్ క్లాస్ ని నిర్వహించాలని తలపెట్టింది. మహిళలకు వచ్చే అనారోగ్యం ఇది. గర్భ సంచి లోపల పెరగాల్సిన ఎండోమెట్రియం అనే పొర గర్భసంచి వెలుపల పెరగటం వలన ఈ సమస్య వస్తుంది. దీనిని సరైన సమయంలో గుర్తించి చికిత్స చేయకపోతే… ఇది కొన్నిరకాల క్యాన్సర్లకు దారితీసే ప్రమాదం ఉంది. మహిళల అనారోగ్యాలకు చికిత్స చేసే […]

European Endometriosis
X

యురోపియన్ ఎండోమెట్రియోసిస్ లీగ్ (ఈఈఎల్ ).. అనే సంస్థ లండన్ లో… వచ్చే నవంబరులో ఎండోమెట్రియోసిస్ అనే అనారోగ్యానికి సంబంధించి ఒక మాస్టర్ క్లాస్ ని నిర్వహించాలని తలపెట్టింది. మహిళలకు వచ్చే అనారోగ్యం ఇది.

గర్భ సంచి లోపల పెరగాల్సిన ఎండోమెట్రియం అనే పొర గర్భసంచి వెలుపల పెరగటం వలన ఈ సమస్య వస్తుంది. దీనిని సరైన సమయంలో గుర్తించి చికిత్స చేయకపోతే… ఇది కొన్నిరకాల క్యాన్సర్లకు దారితీసే ప్రమాదం ఉంది.

మహిళల అనారోగ్యాలకు చికిత్స చేసే వైద్యులకు ఎండోమెట్రియోసిస్ పై మరింత అవగాహన పెంచేందుకు మాస్టర్ క్లాస్ నిర్వహించాలని యురోపియన్ ఎండోమెట్రియోసిస్ లీగ్ భావించింది. ఇది మంచి విషయమే. అయితే ఈ క్లాస్ ని నిర్వహించే నిపుణుల్లో ఒక్కరు కూడా మహిళ లేకపోవటంతో దీనిపై పలు విమర్శలు వెల్లువెత్తాయి.

ఈఈఎల్ మాస్టర్ క్లాస్ కి సంబంధించిన వివరాలతో కూడిన నోటీస్ ని ట్విట్టర్ లో ఉంచగా పలువురు మహిళలు ప్యానల్ లో మహిళలు లేకపోవటంపై తమ అభ్యంతరం తెలుపుతూ విమర్శలు చేస్తున్నారు.

ఎండోమెట్రియోసిస్ నిర్దారణ, చికిత్సలకు సంబంధించిన పరిశోధనలను మరింత ప్రోత్సహించడానికి, వైద్యులకు దీనిపై మరింత అవగాహన పెంచడానికి పని చేస్తున్న ఈఈఎల్ నిర్వాహకుల్లో ఆరుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. అయితే ఇప్పుడు మాస్టర్ క్లాస్ ని నిర్వహిస్తున్న ప్యానెల్ లో ఏడుగురు సభ్యులుండగా…వారంతా మగవారే.

స్త్రీలకు సంబంధించిన వ్యాధిపై నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఒక్క స్త్రీ కూడా లేకపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సోషల్ మీడియాలో చాలామంది స్త్రీలు దీనిపై తమ వ్యతిరేకతని వెల్లడించారు. కొందరు ఇదేమీ ఆశ్చర్యం కాదులే… అని వ్యంగంగా స్పందించగా… పితృ స్వామ్య భావజాలమే ఇందుకు కారణమని మరికొందరు పేర్కొన్నారు.

ఒక మహిళ శరీరంలో ఏం జరుగుతుంది అనేది పురుషులు ఏ విధంగా తెలుసుకోగలరని కొందరు ప్రశ్నించారు. ప్రతి విషయంలోనూ మగవారి శరీరాన్నే ప్రమాణంగా తీసుకునే అలవాటు ఉండటం వలన ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయనే విమర్శలు సైతం వస్తున్నాయి.

అసలు ఎండోమెట్రియోసిస్ పరిశోధనలు ఎలా జరుగుతున్నాయో ఇప్పుడు అర్థమైందని, దీనిపై మరింత విస్తృతంగా పరిశోధనలు జరగాల్సి ఉందని, మహిళా పరిశోధకులు పెరగాలని మరికొందరు అభిప్రాయపడ్డారు. అయితే వ్యాధి నిర్దారణ, చికిత్స ముఖ్యమని వైద్యులు మగవారా, స్త్రీలా అనేది ముఖ్యం కాదని కూడా కొంతమంది పేర్కొన్నారు. కాకపోతే స్త్రీలకు సంబంధించిన వ్యాధిపై నిర్వహించే మాస్టర్ క్లాస్ లో ఒక్క మహిళ కూడా లేకపోవటం అనేది చాలామందికి జీర్ణంకాని విషయంగా మారింది.

First Published:  4 July 2022 9:51 AM GMT
Next Story