Telugu Global
NEWS

వందనాలే తప్ప.. వరాలు లేని తెలుగు రాష్ట్రాల పర్యటన

ప్రధాని మోడీ మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో గడిపారు. శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో దిగిన మోడీ ఇవాళ భీమవరం సభ తర్వాత ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. తెలంగాణ పర్యటన పూర్తిగా భార‌తీయ జ‌న‌తా పార్టీ వ్యవహారం. ఇక, ఏపీలో చేసిన కొన్ని గంటల పర్యటన కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగం. అయినా సరే మోడీ పర్యటనపై రెండు రాష్ట్రాలు స్పందించిన తీరు ప్రజలు దగ్గర నుంచి గమనించారు. ఈ […]

వందనాలే తప్ప.. వరాలు లేని తెలుగు రాష్ట్రాల పర్యటన
X

ప్రధాని మోడీ మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో గడిపారు. శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో దిగిన మోడీ ఇవాళ భీమవరం సభ తర్వాత ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. తెలంగాణ పర్యటన పూర్తిగా భార‌తీయ జ‌న‌తా పార్టీ వ్యవహారం. ఇక, ఏపీలో చేసిన కొన్ని గంటల పర్యటన కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగం. అయినా సరే మోడీ పర్యటనపై రెండు రాష్ట్రాలు స్పందించిన తీరు ప్రజలు దగ్గర నుంచి గమనించారు. ఈ పర్యటనలో మోడీ ఏపీ, తెలంగాణకు ఇచ్చింది ఏమీ లేదు. కనీసం పార్టీ సభలో అయినా.. భవిష్యత్‌లో ఏం చేయబోతున్నామో కూడా చెప్పలేదు.

గత కొంత కాలంగా కేంద్రం, బీజేపీ, మోడీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. అదే స్థాయిలో మోడీ పర్యటనపై విరుచుకుపడింది. రాష్ట్రానికి గత 8 ఏళ్లలో చేసింది ఏమిటో చెప్పాలంటూ సీఎం కేసీఆర్ బహిరంగ ప్రకటనలు చేశారు. రైతులకు రూ. 1 లక్ష కోట్లు ఖర్చు చేశామని మోడీ చెప్పడంపై టీఆర్ఎస్ మంత్రులు, నాయకులే కాకుండా రైతులు కూడా ఆశ్చర్యపోవడం గమనార్హం.

ఈ ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వడ్ల పంచాయితీ బాగానే జరిగింది. దాదాపు నెల రోజుల పాటు టీఆర్ఎస్-బీజేపీలు వడ్ల కొనుగోలు విషయంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. చివరకు రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్ కూడా పక్కన పెట్టి ఎప్పటిలాగానే కేవలం ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించారు. ఇలా సేకరించిన వాటికే కేంద్రం సొమ్ములు చెల్లిస్తోంది. కానీ మోడీ మాత్రం గత ఎనిమిదేళ్లలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన లెక్కలను కూడా తెలంగాణకు ఇచ్చిన నిధుల ఖాతాలో వేసేశారు. కనీసం అలా రైతులకు రూ. 1 లక్ష కోట్లు కూడా చెల్లించలేదని.. అవన్నీ తప్పుడు లెక్కలే అని రైతులు కూడా అంటున్నారు. మోడీ చెప్పిన ఈ లెక్కలపై తెలంగాణ రైతులు అడిగే ప్రశ్నలకు బీజేపీ నేతలు కూడా సమాధానం చెప్పలేక పోతున్నారు.

ఇక మెగా టెక్స్‌టైల్ పార్క్ అంటూ ఆర్భాటంగా ప్రకటించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని నెలలుగా వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్క్ కోసం ఎన్నో లేఖలు రాసినా పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు వరంగల్ టెక్స్‌టైల్ పార్కుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నామని చెప్పినా.. తెలంగాణ ప్రజలు హర్షించేవాళ్లు. కానీ ఎప్పటిలాగే మోడీ రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుకుంటూ పోయినట్లే సాగింది ప్రసంగం. రీజనల్ రింగ్ రోడ్, ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ రోడ్లు అంటూ పాత కథనే వినిపించారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నాళ్లుగానో అడుగుతున్న కాళేశ్వరం జాతీయ హోదా, విభజన హామీలు, ఇండస్ట్రియల్ కారిడార్లపై మాత్రం నోరు మెదపలేదు.

ప్రధాని మోడీ ఇతర రాష్ట్రాల పర్యటనకు వెళ్లినప్పుడు రూ. వేల కోట్ల నిధులు, ప్రాజెక్టులంటూ హామీలు గుప్పిస్తుంటారు. వాటిని పట్టుకొని అక్కడి బీజేపీ నాయకులు భారీగా ప్రచారం చేసుకుంటారు. కానీ.. తెలంగాణ బీజేపీ నాయకులకు ఆ అవకాశం కూడా దొరకలేదు. ఒక్కటంటే ఒక్క పైసా, ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రకటించకుండా మోడీ తన దారిన తాను వెళ్లిపోవడంతో బీజేపీ నాయకుల్లో కూడా అసంతృప్తి వ్యక్తం అవుతోంది. మిగిలిన రాష్ట్రాల మాదిరిగా ఇక్కడ మత రాజకీయాలు చేయడం కష్టం. కనీసం ఏవో అభివృద్ధి పనుల పేరుతో ఓట్లు అడుగుదామని భావిస్తే.. మోడీ ఆ ఛాన్స్ ఇవ్వకుండా వెళ్లిపోవడం బీజేపీలో నిరాశను మిగిల్చింది.

ఇక ఏపీలో కూడా మోడీ ప్రసంగం చప్పగానే సాగింది. అప్పట్లో అమరావతి శంకుస్థాపనకు వచ్చి మట్టి, నీళ్లు కుమ్మరించి పోయిన మోడీ.. ఈసారి అవి కూడా ఇవ్వకుండా ఖాళీ చేతులతో వచ్చారని విమర్శిస్తున్నారు. ఆదివాసీలకు అటవి సంపద అంటూ హామీ ఇచ్చారు. కానీ, వాస్తవానికి అది ఆదివాసీల హక్కు అని మోడీకి తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. చింతపల్లి పోలీస్‌స్టేషన్‌ను అభివృద్ధి చేసి దాన్ని ఏం చేస్తారు? దాన్ని పర్యాటక ప్రదేశం చేస్తారా అని ఎద్దేవా చేస్తున్నారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ అంటూ ఎన్నో ఊదరగొట్టిన బీజేపీ ఈనాటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. నిధుల కొరతతో ఉన్న ఆ రాష్ట్రానికి కేంద్ర చేయూత అవసరం. ఈ క్రమంలో ఏపీకి ప్రత్యేకంగా పథకాలు ఏమైనా ప్రకటిస్తారని భావించినా.. మోడీ ఆ ఊసే ఎత్తలేదు. ఎప్పటిలాగే వచ్చామా.. మాట్లాడామా.. వెళ్లామా అన్న రీతిలోనే మోడీ పర్యటన సాగింది.

మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మోడీ పర్యటనను ఆసాంతం గమనించారు. ఏవైనా వరాల జల్లులు కురిపిస్తారేమో అని ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ చివరకు మోడీ వందనాలు మాత్రం చెప్పి.. ఎప్పటిలాగే వరాలను మర్చిపోయారు.

First Published:  4 July 2022 6:03 AM GMT
Next Story