Telugu Global
NEWS

ఇప్పటికైనా తెలంగాణ గొప్పతనం తెలుసుకోండి.. ప్రధాని మోడీకి కేటీఆర్ లేఖ

హైదరాబాద్ లో రెండు రోజులపాటు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, 12 మంది బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల బ్రీఫింగులు, అది చాలక ప్రధాని మోడీ బహిరంగ సభ కూడా జరిగిందంటే తెలంగాణ అభివృద్ధి గురించి ఈ పార్టీ నేతలు తెలుసుకోవాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన మోడీకి బహిరంగ లేఖ రాశారు. శరవేగంగా అభివృద్ధిలో దూసుకుపోతున్న హైదరాబాద్‌లో మీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించాలని మీరు […]

ఇప్పటికైనా తెలంగాణ గొప్పతనం తెలుసుకోండి.. ప్రధాని మోడీకి కేటీఆర్ లేఖ
X

హైదరాబాద్ లో రెండు రోజులపాటు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, 12 మంది బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల బ్రీఫింగులు, అది చాలక ప్రధాని మోడీ బహిరంగ సభ కూడా జరిగిందంటే తెలంగాణ అభివృద్ధి గురించి ఈ పార్టీ నేతలు తెలుసుకోవాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన మోడీకి బహిరంగ లేఖ రాశారు.

శరవేగంగా అభివృద్ధిలో దూసుకుపోతున్న హైదరాబాద్‌లో మీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించాలని మీరు నిర్ణయించారంటే ఇందులో ఆశ్చర్యం లేదన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పుకుంటున్న వెనుకబడిన రాష్ట్రాల కన్నా.. హైదరాబాద్ వంటి ప్రాంతమే బెటర్ అని, ఇక్కడే మీటింగులు పెట్టుకోవాలని మీరు భావించారని ఆయన పేర్కొన్నారు.

అసలు మీ డీఎన్ఏ లోనే ద్వేషం, సంకుచితత్వం నిండిపోయి ఉన్నాయని, అలాంటిది మీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అభివృద్ధి, సంక్షేమం వంటి వాటిపై బీజేపీ నేతలు మాట్లాడుతారనుకోవడం అత్యాశే అవుతుందన్నారు. ‘మీ సమావేశాల రియల్ ఎజెండా ద్వేషాన్ని వ్యాపింపజేయడం, ఎలాంటి సరికొత్త పాలసీలు, పథకాల గురించి ప్రస్తావించకపోవడమన్నది అర్థమవుతూనే ఉంది’ అని కేటీఆర్ దుయ్యబట్టారు.

ప్రజలను సదా చీల్చాలన్నదే మీ సిద్ధాంతమని, అబద్ధాల మూలస్తంభాలపై బీజేపీ నడుస్తోందని, ఈ పార్టీ నేతలు ఆత్మపరిశీలన చేసుకుంటారని కూడా ఆశించజాలమని ఆయన పేర్కొన్నారు. మీకు మీరు ఆత్మప‌రిశీల‌న చేసుకుని మీ రాజకీయాలను తెలంగాణ అభివృద్ధి దిశగా మలచుకున్న పక్షంలో ఈ రాష్ట్రాన్ని మించిన ప్రాంతం మరొకటి లభించదని కేటీఆర్ అన్నారు.

తెలంగాణ మోడల్ ని స్టడీ చేయండి
తెలంగాణ అభివృద్ధి మోడల్‌ని, ఈ రాష్ట్ర పాలసీలు, పథకాలను అధ్యయనం చేయాలని మంత్రి కేటీఆర్ పీఎం మోడీని కోరారు. డబుల్ ఇంజన్లతో సతమతమవుతున్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వీటిని అమలు చేయాలని సూచించారు.

మతసామరస్యాన్ని ప్రతిబింబించే సమాజం వంటి వసుదైక కుటుంబం గురించి ఆలోచించండి.. ఓ కొత్త నాందికి శ్రీకారం చుట్టండి అని ఆయన అన్నారు. ఇరిగేషన్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్ వంటి రంగాల్లో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రం-బీజేపీకి తన రాజకీయ ఆలోచనలను సరిదిద్దుకోవడానికి మంచి అవకాశం ఇస్తోందని కేటీఆర్ తమ లేఖలో స్పష్టంచేశారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చాలా పథకాలు, పాలసీలను తెలంగాణ నుంచి కాపీ కొట్టినవేనని మీకు గుర్తు చేస్తున్నా అని అన్నారాయన. సీఎం కేసీఆర్ నాయకత్వం కింద ప్రభుత్వం ప్రపంచంలోనే అతి పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టును ఎలా నిర్మించిందో మీరు, మీ పార్టీ నేతలు తెలుసుకోవాలన్నారు. ఇది రాష్ట్రంలో ఇరిగేషన్ వ్యవస్థనే మార్చివేసిందన్నారు. ఈ ప్రాజెక్టును అధ్యయనం చేయడం ద్వారా దేశంలో నీటిపారుదల రంగాన్ని ఎలా బలోపేతం చేయాలో నేర్చుకోండి అని ఆయన సలహా ఇచ్చారు.

అలాగే మిషన్ కాకతీయ స్కీం ని స్టడీ చేయడం ద్వారా దేశంలోని సరస్సులను ఎలా ‘పునరుజ్జీవింప’ జేయాలో కూడా నేర్చుకోవాలన్నారు. రైతుల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు, రైతు బీమావంటి పలు పథకాలను అమలు చేస్తోందని, రైతులకు 24 గంటలూ ఉచిత విద్యుత్ ఇస్తోందని కేటీఆర్ వివరించారు. తెలంగాణ రైతు బంధు పేరునే మీరు మార్చి పీఎం కిసాన్ యోజన అంటూ ప్రవేశపెట్టారని, కానీ దురదృష్టవశాత్తూ మూడేళ్ళుగా ఈ పథకంలో కొత్త రైతులను చేర్చడం లేదని ఆయన విమర్శించారు. మీ పాలసీ పదాలను మార్చుకోండి.. అవి రైతులకు మరింత ప్రయోజనకరంగా ఉండేట్టు చూడండి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మిషన్ భగీరథ పథకం గురించి కూడా ప్రస్తావించారు.

దేశంలోని ప్రతి గ్రామానికీ విద్యుత్ ఇస్తామని 2018 నాడు మీరు హామీ ఇచ్చారని, కానీ రాష్ట్రపతి ఎన్నికలో మీ ఎన్డీయే తరఫు అభ్యర్థి ద్రౌపది ముర్ము సొంత గ్రామానికి ఇటీవలే విద్యుత్ సౌకర్యం వచ్చిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. గుజరాత్ రాష్ట్రంలో ఇప్పటికీ పవర్ హాలిడే ఇస్తున్నారు. ఆ రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సదుపాయం లేదు.

కానీ తెలంగాణాలో మేం అన్ని రంగాలకూ నిరంతరాయంగా (24 గంటల) పవర్ ఇస్తున్నాం అని పేర్కొన్నారు. ఇంకా తెలంగాణకు కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీనైనా మంజూరు చేయలేదని, కానీ మా ప్రభుత్వం ప్రతి జిల్లాలో ఓ మెడికల్ కళాశాలనివ్వబోతోందని వెల్లడించారు. అలాగే ఇప్పటివరకు తమ సర్కార్ 1.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని, కానీ మీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం దేశ యువతకు జాబ్స్ ఇవ్వడంలో ఘోరంగా విఫలమైందని అన్నారు.

‘హైదరాబాద్ ఔన్నత్యాన్ని గుర్తించండి.. ఇక్కడి ధ‌మ్ బిర్యానీని తినడం మర్చిపోకండి.. కొత్త రాజకీయ ఆలోచనలతో రండి.. ఇక్కడి ఇరానీ చాయ్ సేవించడం ద్వారా కొత్త నాందికి శ్రీకారం చుట్టండి’ అని కేటీఆర్ తన లేఖను ముగించారు.

First Published:  4 July 2022 8:39 AM GMT
Next Story