Telugu Global
National

ఉద్ధ‌వ్‌ ఠాక్రే పై విమ‌ర్శ‌కుల‌కూ అభిమాన‌మే..! ఎందుకు?

‘అధికారాంత‌మందు చూడ‌వ‌లె ఆ అయ్య సౌభాగ్య‌ముల్’ అన్నాడో క‌వివ‌ర్యుడు. నేటి రాజ‌కీయాల‌కు ఇది చ‌క్క‌గా స‌రిపోతుంది. సాధార‌ణంగా ప‌ద‌వుల్లో ఉన్న‌ప్పుడే నాయ‌కులు గౌర‌వాభిమానాలు పొందుతుంటారు. ఆ త‌ర్వాత ప‌ద‌వి లేక‌పోతే క‌నీసం ముఖ‌మైనా చూడ‌రు ఎవ‌రూ. అయితే ఆయా నాయ‌కుల వ్య‌క్తిత్వంపై కూడా ఇది ఆధార‌ప‌డి ఉంటుంది. తాజాగా మ‌హారాష్ట్ర‌లో జ‌రిగిన నాట‌కీయ రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో శివ‌సేన అధ్య‌క్షుడు ఉద్ధ‌వ్‌ ఠాక్రే ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుంచి వైదొలిగారు. రెండున్న‌రేళ్ళ‌గా ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో ఉన్న‌ప్పుడు విప‌క్ష పార్టీల‌న్నీ […]

ఉద్ధ‌వ్‌ ఠాక్రే పై విమ‌ర్శ‌కుల‌కూ అభిమాన‌మే..! ఎందుకు?
X

‘అధికారాంత‌మందు చూడ‌వ‌లె ఆ అయ్య సౌభాగ్య‌ముల్’ అన్నాడో క‌వివ‌ర్యుడు. నేటి రాజ‌కీయాల‌కు ఇది చ‌క్క‌గా స‌రిపోతుంది. సాధార‌ణంగా ప‌ద‌వుల్లో ఉన్న‌ప్పుడే నాయ‌కులు గౌర‌వాభిమానాలు పొందుతుంటారు. ఆ త‌ర్వాత ప‌ద‌వి లేక‌పోతే క‌నీసం ముఖ‌మైనా చూడ‌రు ఎవ‌రూ. అయితే ఆయా నాయ‌కుల వ్య‌క్తిత్వంపై కూడా ఇది ఆధార‌ప‌డి ఉంటుంది.

తాజాగా మ‌హారాష్ట్ర‌లో జ‌రిగిన నాట‌కీయ రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో శివ‌సేన అధ్య‌క్షుడు ఉద్ధ‌వ్‌ ఠాక్రే ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుంచి వైదొలిగారు. రెండున్న‌రేళ్ళ‌గా ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో ఉన్న‌ప్పుడు విప‌క్ష పార్టీల‌న్నీ విమ‌ర్శించాయి. అది స‌హ‌జం. కానీ, ఆయ‌న ప‌ద‌వి నుంచి దిగిపోయిన త‌ర్వాత మాత్రం ప్ర‌త్య‌ర్థి పార్టీల నుంచి జాతీయ స్థాయిలో కూడా ప్ర‌శంస‌లు అందుకోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఇలా ఉద్ధ‌వ్‌ ఠాక్రే మెప్పులు పొంద‌డం ఆయ‌న సామ‌ర్థ్యానికి, వ్య‌క్తిత్వానికి నిద‌ర్శ‌న‌మ‌ని భావిస్తున్నారు.

ఉద్ధ‌వ్‌ ఠాక్రే ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు విమ‌ర్శించిన వారే ఆయ‌న ప‌దవి నుంచి తొలిగిన త‌ర్వాత అభిమానులుగా మారిపోయారు. శివ‌సేన గ‌తాన్నిదృష్టిలో ఉంచుకుని ఆ పార్టీ వారికి సాధార‌ణంగా అత‌క‌ని ప‌దాల‌తో పొగుడుతున్నారు. ఉద్ధ‌వ్ ఠాక్రే ఒక సున్నిత‌మైన ముఖ్య‌మంత్రి అంటూ కొనియాడుతున్నారు. గ‌త నెల 29న ఆయ‌న రాజీనామా చేయ‌గానే అంతా సంవేద‌న శీల‌మైన ముఖ‌మంత్రి అంటూ అభిమానులు విమ‌ర్శ‌కులూ సంబోధిస్తున్నారు. ఆయ‌న పాలించిన రెండున్న‌రేళ్ళ‌లో కొన్ని వివాదాలు ఉన్న‌ప్ప‌టికీ నేడు ఉద్ధ‌వ్‌ ను నిష్పాక్షిక‌మైన ముఖ్య‌మంత్రి గా గుర్తుంచుకుంటున్నారు. ఎంతోకాలంగా వైరి పార్టీగా చూసిన జ‌మ్ము క‌శ్మీర్‌ లోని నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ పార్టీకి చెందిన మాజీ ముఖ్య‌మంత్రి ఒమ‌ర్ అబ్దుల్లా ఒక ట్వీట్ చేస్తూ . ఉద్ధ‌వ్‌ ఠాక్రే ఒక సంచ‌ల‌నం అని పేర్కొన్నాడు.

ఉద్ధ‌వ్‌ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్పుడు అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఎప్పుడూ అసెంబ్లీ ముఖం కూడా చూడ‌ని వ్య‌క్తి, పాల‌నా అనుభ‌వం లేని వ్య‌క్తి.. కాంగ్రెస్‌, ఎన్‌సీపీ లతో క‌లిసి ఎంవిఏ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది అంద‌రికీ. ప‌వార్ చేతిలోకీలుబొమ్మ సీఎం గా ప‌నిచేస్తారులే అని అనుకున్నారంతా. కానీ అది త‌ప్పు అంచ‌నా అని ఆ త‌ర్వాత తెలిసింది.

బాధ్యతలు స్వీకరించిన ఒక నెలలోనే, కొత్తగా ప్రకటించిన జ్యోతిరావు పూలే పథకం కింద 2019 సెప్టెంబర్ 30 వరకు పెండింగ్‌లో ఉన్న రూ.2 లక్షల వరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని ఠాక్రే ప్రభుత్వం తొలి ప్రకటన చేసింది. రూ. 20,000 కోట్లకు పైగా, ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనేక మంది రైతులకు ఉపశమనం కలిగించింది. దీనిపై ఆయ‌న ప్ర‌త్య‌ర్థులు కూడా పెద్ద ఎత్తున ప్ర‌శంసించారు. కోవిడ్ ప‌రిస్థితుల్లో ఆయ‌న చేసిన కృషిని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ, ప్ర‌పంచ‌ ఆరోగ్య సంస్థ ప్ర‌తినిధులు బ‌హిరంగంగానే ప్ర‌శంసించారు.

ఠాక్రే శివసేనను తన తండ్రి బాలాసాహెబ్ ఠాక్రే ఆలోచ‌న విధానానికి భిన్నంగా నడిపిస్తున్నారని స్పష్టమైంది. శివసేన విమర్శకులు ఈ మార్పును గమనించి స్వాగతించారు కూడా. ఠాక్రే పదేపదే హిందూత్వంను విడిచిపెట్టలేదని చెప్పినప్పటికీ తరచుగా దీనిని ‘సెక్యులర్ సేన’ అని పిలుస్తారు.

మ‌త ఘ‌ర్ష‌ణ‌లు లేవు..
కోవిడ్‌తో పాటు, మతపరమైన సమస్యలపై ప్రభుత్వం వ్యవహరించిన తీరు కూడా ప్ర‌శంస‌నీయంగా ఉంద‌నే పేరు తెచ్చుకుంది ఉద్ధ‌వ్ ప్ర‌భుత్వం. ఎటువంటి మతపరమైన అల్లర్లు లేవు. విద్వేష‌ వాతావ‌రణం ఎక్క‌డా క‌న‌బ‌డ‌లేదు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో కూడా ఎటువంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌క్క‌పోవ‌డం ప్ర‌భుత్వ స‌మ‌ర్థ‌త‌కు నిద‌ర్శ‌నంగా నిలిచింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్ణాటకతో సహా అనేక ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, మహారాష్ట్రలో సీఏఏ వ్యతిరేక నిరసనలు చాలావరకు శాంతియుతంగా ఎలా జరిగాయో అంటూ చాలా మంది ఆశ్చర్య‌పోయారు. ఇంత ప్ర‌శాంతంగా నిర‌స‌న‌లు నిర్వ‌హించిన ముస్లిం స‌మాజానికి ఉద్ధ‌వ్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. వాతావరణ ఉద్యమకారుల డిమాండ్లను అంగీకరిస్తూ, ముంబైలోని ఆరే కాలనీలో కోలాబా-బాంద్రా-సీప్జ్ మెట్రో 3 కారిడార్ కార్-షెడ్ నిర్మాణాన్ని ఉద్ధవ్ నిలిపివేశారు. ఆయన ప్రభుత్వం ఆరే కాలనీని రిజర్వ్ ఫారెస్ట్‌గా కూడా గుర్తించింది. అయితే కొత్త ప్ర‌భుత్వం దానిని మార్చేసింది.

ఇవీ స‌మ‌స్య‌లు..
అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే, జూన్ 2020లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు ఎంవీఏ ప్రభుత్వానికి పెద్ద స‌వాల్ గా నిలిచింది. అలాగే ముంబైలో డ్ర‌గ్స్ మాఫియాల‌ను ర‌క్షించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ప్రతిపక్షాలు ఎంవీఏని ఆరోపించాయి. ఫిబ్రవరి 2021లో, సచిన్ వాజే, పరమ్ బీర్ సింగ్ ల వివాదంతో మహా వికాస్ అఘాడీ మ‌రో పెద్ద సవాలును ఎదుర్కొంది. పాల్ఘర్‌లో ఇద్దరు హిందూ పూజారుల హత్య ఎంవీఏ ప్రభుత్వాన్ని చాలా ఇబ్బంది పెట్టింది.

ఈ వివాదాల‌ను విప‌క్షాలు ముఖ్యంగా బీజేపీ రాజ‌కీయంగా బాగా ఉప‌యోగించుకుని శివ‌సేన పై ఆరోప‌ణ‌లు చేసింది. ఇటువంటి ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లే త‌ప్ప ఉద్ధ‌వ్‌ ఠాక్రే పాల‌న‌న‌పై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు లేవు. అయినా నాడు విమ‌ర్శ‌లు చేసిన‌వారు కూడా ఉద్ధ‌వ్‌ పాల‌నా తీరుపై ప్ర‌శంశ‌లు కురిపిస్తున్నారు.

First Published:  4 July 2022 5:12 AM GMT
Next Story