Telugu Global
National

రాజకీయ విమర్శలకు ప్రధాని మోడీ దూరం

హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో ఆదివారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ సుమారు 27 నిముషాల పాటు మాత్రం క్లుప్తంగా మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి తమ ప్రభుత్వం చేసిన, చేస్తున్న కృషిని మాత్రం ఆయన ప్రస్తావించారు. సీఎం కేసీఆర్ లేదా ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్ లపై వ్యక్తిగత విమర్శలకు ఆయన దూరంగా ఉన్నారు. నిన్న కేసీఆర్ చేసిన సవాళ్ళలో వేటికీ ఆయన స్పందించలేదు. కేసీఆర్ ప్రశ్నలకు ఆయన నుంచి ఎలాంటి రియాక్షన్ […]

Narendra Modi
X

హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో ఆదివారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ సుమారు 27 నిముషాల పాటు మాత్రం క్లుప్తంగా మాట్లాడారు.

తెలంగాణ అభివృద్ధికి తమ ప్రభుత్వం చేసిన, చేస్తున్న కృషిని మాత్రం ఆయన ప్రస్తావించారు. సీఎం కేసీఆర్ లేదా ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్ లపై వ్యక్తిగత విమర్శలకు ఆయన దూరంగా ఉన్నారు.

నిన్న కేసీఆర్ చేసిన సవాళ్ళలో వేటికీ ఆయన స్పందించలేదు. కేసీఆర్ ప్రశ్నలకు ఆయన నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు కూడా. అయితే తెలంగాణాలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలని ఆకాంక్షించిన ఆయన.. ఇక్కడ బీజేపీ ఎదుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

అంతకుముందు ప్రసంగించిన అమిత్ షా, పీయూష్ గోయెల్, నడ్డా, యోగి ఆదిత్యనాథ్ తదితరులు కేసీఆర్,పైన, ఆయన పాలనపైన విమర్శలు సంధించారు. ఏమైనా మోడీ విరుచుక పడతారని భావించిన జాతీయ, స్థానిక నేతలు ఆశ్చర్యపోతూనే కాస్త నిరాశ చెందారన్న అభిప్రాయాలు వినవస్తున్నాయి. అయితే సభకు వచ్చిన జనాలను చూసి మాత్రం ఆయన సంతృప్తి చెందారు.

బహుశా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుల సమావేశాల్లో తెలంగాణకు సంబంధించి ఆమోదించిన రాజకీయ తీర్మానాలను మోడీ పరిశీలించి ఉంటారని, వాటిలోని అంశాలను మించి తాను మరింత మాట్లాడడం మంచిది కాదని భావించి ఉంటారన్న విశ్లేషణ సాగుతోంది.

కుటుంబ పాలన సాగుతున్న తెలంగాణ, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి, బీజేపీ కృషి చేస్తుందని, మరో 30, 40 ఏళ్ళు దేశంలో బీజేపీ శకమే ఉంటుందని అమిత్ షా అంతకు ముందు ఓ రాజకీయ తీర్మానంలో పేర్కొన్నారు.

అలాగే కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కూడా తమ పార్టీ పవర్ లోకి రావడం తథ్యమన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా మోడీ ప్రసంగం చప్పగా సాగిందని అంటున్నవారు లేకపోలేదు.

తనకు ముందు ప్రసంగించిన నేతల వ్యాఖ్యలనే తాను కూడా వల్లె వేయడం సముచితం కాదని ఆయన భావించి ఉండవచ్చు.. అయితే రాబోయే రోజుల్లో తెలంగాణను తమ వశం చేసుకోవడానికి బీజేపీ సరికొత్త వ్యూహాలకు పదును పెట్టినా పెట్టవచ్చు. ఎన్నికల ముందు ఇది ఎన్నెన్ని పోకడలకు పోతుందో వేచి చూడాల్సిందే !

First Published:  3 July 2022 9:44 AM GMT
Next Story