Telugu Global
NEWS

ఆమ్ ఆద్మీ బాటలో జనసేన.. బీజేపీతో బంధం తెగినట్టేనా..?

పవన్ కల్యాణ్ ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నారు. ప్రజలకు అనుమానాలు ఉండొచ్చు కానీ, ఆ రెండు పార్టీల నేతలు పొత్తులో ఉన్నామనే చెబుతుంటారు. అయితే అది బలంగా ఉందా, బలహీనంగా ఉందా అనేది ఎవరికి వారే అంచనా వేసుకోవచ్చు. ఈ దశలో పవన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీని తీసిపడేసినట్టు మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీని ఆకాశానికెత్తేశారు. అక్కడ ఆమ్ ఆద్మీతో మార్పు మొదలైందని, ఇక్కడ జనసేన ఆ మార్పుకి సిద్ధమైందని చెప్పారు. మంగళగిరి జనసేన […]

ఆమ్ ఆద్మీ బాటలో జనసేన.. బీజేపీతో బంధం తెగినట్టేనా..?
X

పవన్ కల్యాణ్ ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నారు. ప్రజలకు అనుమానాలు ఉండొచ్చు కానీ, ఆ రెండు పార్టీల నేతలు పొత్తులో ఉన్నామనే చెబుతుంటారు. అయితే అది బలంగా ఉందా, బలహీనంగా ఉందా అనేది ఎవరికి వారే అంచనా వేసుకోవచ్చు. ఈ దశలో పవన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీని తీసిపడేసినట్టు మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీని ఆకాశానికెత్తేశారు. అక్కడ ఆమ్ ఆద్మీతో మార్పు మొదలైందని, ఇక్కడ జనసేన ఆ మార్పుకి సిద్ధమైందని చెప్పారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో వీర మహిళల శిక్షణ తరగతుల ముగింపు సభలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

కొత్త పొత్తు పొడిచేనా..?
బీజేపీ, టీడీపీ, బీఎస్పీ, వామపక్షాలు.. ఇలా పవన్ కల్యాణ్ దాదాపుగా అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. కానీ ఆయన ఆమ్ ఆద్మీతో మాత్రం చేతులు కలపలేదు. ఒకవేళ.. వచ్చే ఎన్నికల్లో పవన్ ఆ పని కూడా పూర్తి చేస్తారా అనే అనుమానం లేకపోలేదు. లేకపోతే పవన్ బహిరంగంగా ఆమ్ ఆద్మీని పొగడ్తల్లో ముంచెత్తరు, కేజ్రీవాల్ భావజాలాన్ని మెచ్చుకోరు. పైగా.. ఆమ్ ఆద్మీకి, బీజేపీకి మధ్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఇప్పటికే ఢిల్లీలో బీజేపీకి పక్కలో బల్లెంలా మారిన ఆమ్ ఆద్మీ పార్టీ, పంజాబ్ లో అధికారం చేజిక్కించుకున్న తర్వాత మరింత స్పీడ్ గా ముందుకెళ్తోంది. బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కల్యాణ్, ఆమ్ ఆద్మీ పార్టీని మెచ్చుకున్నారంటే కచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది.

అది నాకు చాలా చిన్న విషయం..
చట్టసభలకు తానొక్కడినే వెళ్లాలనుకుంటే ఎప్పుడో వెళ్లి ఉండేవాడినని, కానీ బలమైన భావజాలం కలిగిన నేతలు అంతా చట్టసభలకు వెళ్తే బాగుంటుందని, అప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతోటే తాను పార్టీ పెట్టానని, అందర్నీ కలుపుకొని వెళ్తున్నానని అన్నారు పవన్. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ మొదలైంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రెండుచోట్ల పోటీ చేసి ఓడిపోయారు పవన్ కల్యాణ్. అలాంటి పవన్ తాను ఎప్పుడో చట్టసభలకు వెళ్లి ఉండేవాడినని ఎలా చెబుతారంటూ నిలదీస్తున్నారు నెటిజన్లు. అది ఓ పెద్ద జోక్ గా అభివర్ణిస్తున్నారు.

First Published:  2 July 2022 10:14 PM GMT
Next Story