Telugu Global
NEWS

ఖమ్మం కాంగ్రెస్‌లో అప్పుడే టికెట్ల లొల్లి.. ముదురుతున్న వర్గపోరు

కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒక కంచుకోట లాంటిది. కానీ, ఇప్పుడు మాత్రం ముఖ్య నాయకులంతా వేరే పార్టీల్లోకి వెళ్లిపోయారు. వైఎస్ఆర్ సీపీ ఏర్పడిన తర్వాత ఎక్కువ మంది కాంగ్రెస్ నేతలు ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. కానీ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఎదగడంతో.. వీళ్లంతా కారెక్కారు. అయితే రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయ్యాక.. మళ్లీ ఖమ్మంలో కాంగ్రెస్ తన ఉనికిని చాటుకుంటోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి బలమైన […]

ఖమ్మం కాంగ్రెస్‌లో అప్పుడే టికెట్ల లొల్లి.. ముదురుతున్న వర్గపోరు
X

కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒక కంచుకోట లాంటిది. కానీ, ఇప్పుడు మాత్రం ముఖ్య నాయకులంతా వేరే పార్టీల్లోకి వెళ్లిపోయారు. వైఎస్ఆర్ సీపీ ఏర్పడిన తర్వాత ఎక్కువ మంది కాంగ్రెస్ నేతలు ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. కానీ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఎదగడంతో.. వీళ్లంతా కారెక్కారు. అయితే రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయ్యాక.. మళ్లీ ఖమ్మంలో కాంగ్రెస్ తన ఉనికిని చాటుకుంటోంది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉండటంతో కొంచెం కష్టపడితే ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమకు కలసి వస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో అప్పుడే టికెట్ల హడావిడి మొదలైంది. ముఖ్యంగా సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో టికెట్ల కోసం ముఖ్యనేతలు పోటీ పడుతున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ ఈసారి టికెట్ నాకంటే నాకు అని చెప్పుకొని తిరుగుతున్నారు. దీంతో కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది.

సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉండేది. మాజీ సీఎం జలగం వెంగళరావు సత్తుపల్లి నుంచే పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే టీడీపీ ఆవిర్భావం తర్వాత తుమ్మల నాగేశ్వరరావు తన కంచుకోటగా మార్చుకున్నారు. ఎస్సీ రిజర్వుడ్‌గా మారిన తర్వాత కూడా టీడీపీ గెలిచింది. అయితే కాంగ్రెస్‌కు ఇక్కడ విజయావకాశాలు ఉండటంతో టికెట్ కోసం పోటీ పెరిగింది.

మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, టీపీసీసీ అధికార ప్రతినిధి కోటూరి మానవతారాయ్ మధ్య ఇప్పుడు టికెట్ల లొల్లి షురూ అయ్యింది. ఈ నియోజకవర్గంలో ఇరువురు పై చేయి సాధించేందుకు గత కొన్నాళ్లుగా పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మూడు సార్లు పోటీ చేసి ఓడిపోయిన సంభాని చంద్రశేఖర్ ఇప్పటికీ నియోజకవర్గాన్నే కేంద్రంగా చేసుకొని రాజకీయాలు చేస్తున్నారు. అదే సమయంలో యువకుడైన మానవతారాయ్ ఈ సీటుపై కన్నేశారు. సత్తుపల్లి సెగ్మెంట్‌లోని కల్లూరుకు చెందిన ఆయన.. తనకే సీటు ఖాయం అని.. అధిష్టానం ఆశీస్సులు ఉన్నాయంటూ నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు.

గత కొన్నాళ్లుగా ఇద్దరు నాయకులు వేర్వేరుగా రైతు రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరిద్దరి తీరుతో సెగ్మెంట్‌లోని కాంగ్రెస్ కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. ఇద్దరు ముఖ్యనాయకుల మధ్య విభేదాల కారణంగా.. కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇద్దరు నాయకులు ఏకతాటిపైకి వస్తేనే రాబోయే ఎన్నికల్లో విజయం సాధ్యమవుతుందని.. ఇలా గొడవలు పడితే గెలిచే అవకాశాలు కోల్పోతామని కార్యకర్తలు అంటున్నారు.

First Published:  3 July 2022 12:12 AM GMT
Next Story